శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 14, 2020 , 11:36:39

విజయ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ప్రత్యేక దృష్టి

విజయ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ప్రత్యేక దృష్టి

విజయ డెయిరీని లాభాల బాట పట్టించేందుకు యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు  బదిలీల ప్రక్రియ చేపట్టింది. దీంతో ఏళ్ల    తరబడిగా ఇక్కడే పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిలో గుబులు మొదలైంది. ఎక్కడికి బదిలీ చేస్తారోననే  భయాందోళన నెలకొంది. 

వరంగల్‌ విజయ డెయిరీని లాభాల బాటలో నడిపేందుకు.., నూతన జవసత్వాలు నింపేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆదేశాల మేరకు ఎండీ రాష్ట్రవ్యాప్తంగా డెయిరీలో బదిలీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఏళ్ల తరబడిగా పాతుకుపోయిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి స్థాన చలనం కల్పించారు. కొంతమంది కొత్త ఉద్యోగులు వరంగల్‌లోని డెయిరీకి వచ్చారు. రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ డెయిరీలో పాల సేకరణ పెంచేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే పాడి రైతులకు రూ.2 అదనంగా చెల్లించడంతో పాటు రూ.4 ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ మినహా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో పాడి రైతుల నుంచి విజయ డెయిరీ పాలు సేకరిస్తున్నది. హన్మకొండలోని విజయ డెయిరీలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా ఉమ్మడి వరంగల్‌లో సుమారు 62 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. ఇందులో 10 మందిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. 

మరింత అభివృద్ధికి..

ఏళ్ల తరబడిగా పని చేస్తూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది బదిలీపై ఎండీ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి రెండేళ్లకోసారి బదిలీలు చేయాల్సి ఉండగా ఏడేళ్ల నుంచి ఆ ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భారీగా బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. విజయ డెయిరీ అభివృద్ధి కోసం సత్వర చర్యలు తీసుకునేందుకు కొత్త సిబ్బంది అయితే చురుగ్గా పని చేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హన్మకొండ డెయిరీకి అసిస్టెంట్‌ మేనేజర్లుగా హరికృష్ణ, శ్రీతేజ విధుల్లో చేరారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్‌ రజిత సంగెం మేనేజర్‌గా, నర్సంపేట మేనేజర్‌గా రాణి బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తున్నది.

స్థానచలనం కాకుండా ఒత్తిళ్లు

ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది స్థానచలనం కాకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తున్నది. తమ బదిలీలు నిలిపివేసేందుకు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. గాడ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బదిలీలను నిలిపివేయించుకుంటున్నట్లు తెలుస్తున్నది. విజయ పాల డెయిరీ ఎండీపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. వరంగల్‌ జిల్లాను వదిలి వెళ్లలేక పైరవీలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తక్కువ వేతనంతో ఇక్కడ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఇతర జిల్లాలకు బదిలీ చేయడంతో వారు అక్కడికి వెళ్లలేక, వారి బాధలు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.  

ఆప్షన్స్‌ ఫర్‌ ఔట్‌ సోర్సింగ్‌..

హన్మకొండలోని విజయ పాల డెయిరీలో ఏళ్ల తరబడిగా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి బదిలీల్లో ఆప్షన్స్‌ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 62 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉండగా 10 మందిని బదిలీ చేశారు. అయితే వారు విధుల్లోకి వెళ్లకపోవడంతో మరో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఎంపిక చేసుకున్న జిల్లాకు పంపించేందుకు రెండుమూడు రోజుల్లో ఎండీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.


logo