మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 13, 2020 , 17:08:09

తొలిసారి జలాశయాల గణనతో లెక్క పక్కా

తొలిసారి జలాశయాల గణనతో లెక్క పక్కా

చిన్న నీటి వనరుల లెక్క తేలుతోంది. జిల్లాలోని బోర్లు, బావులు, చెరువులు ఎన్నో పక్కాగా తెలువనున్నాయి. ఆరో చిన్ననీటి తరహా సాగునీటి వనరుల గణన చివరి దశకు చేరింది. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో లెక్కింపు చేపట్టారు. ఇప్పటి వరకు ఆరు మండలాల్లో పూర్తయింది. ఇందులో శాయంపేట, గీసుగొండ, ఖానాపూర్‌, నర్సంపేట, చెన్నారావుపేట, పరకాల మండలాలు ఉన్నాయి. మిగిలిన మండలాల్లో ఈ నెలాఖరులోగా పూర్తి కానుంది. గతంలో బోర్లు, బావులను మాత్రమే లెక్కించగా, ఈ సారి తొలిసారిగా చెరువులు, కుంటలు, జలాశయాల గణన చేపడుతున్నారు. విస్తీర్ణం, ఆయకట్టు, నీటి లభ్యత, వాడకం, ఎవరి అధీనంలో ఉన్నది వంటి అన్ని అంశాలను సేకరిస్తున్నారు. లెక్కతేలిన వాటికి ప్రత్యేకంగా ఒక నంబర్‌ కేటాయించి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఈ నంబర్‌తో ఆన్‌లైన్‌లో బావులు, చెరువుల వివరాలను తెలుసుకోవచ్చు. జిల్లాలో రెండో పెద్ద జలాశయంగా ఉన్న శాయంపేట మండలంలో ని చలివాగు ప్రాజెక్టు చిన్ననీటి వనరుల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు 230 గ్రామాల్లో 51, 585 బావులు, 1606 చెరువులు ఉన్నట్లు తేలింది. మొత్తంగా చిన్న నీటి వనరులు పెరుగనున్నా   

శాయంపేట, మార్చి 12 : చిన్న నీటి వనరుల లెక్క తేలుతోంది. బోర్లు, బావులు, చెరువులెన్నో తెలుస్తోంది. ఈ లెక్కతో జిల్లాలో చిన్న నీటి వనరులు పెరుగుతున్నాయి.  6వ చిన్ననీటి తరహా సాగునీటి వనరుల గణన 2017-18 చివరి దశకు చేరినట్లు అధికారులు వెల్లడించారు.  జిల్లాలోని 15 మండలాల్లో గణన చేపట్టారు. ఇప్పటి వరకు ఆరు మండలాల్లో గణన పూర్తి కాగా, మిగతా  మండలాల్లో ఈనెలాఖరులోగా పూర్తి అవుతుందని అధికారులు వెల్లడించారు.  గతంలో బోర్లు, బావులపై మా త్రమే గణన చేసేవారు. కానీ ఈసారి జలాశయాలపై తొలిసారి గణన చేపట్టి వాటి లెక్కను సైతం తేల్చుతున్నారు.  గత జూన్‌లో ఈ సమగ్ర సాగునీటి వనరుల గణనను ప్రారంభించారు.  రెవెన్యూ గ్రామాల వారీగా వీఆర్వోలు, వీఆర్‌ఏలు గణనను చేపడుతున్నారు.  జలాశయాలు(చెరువులు, కుంటలు)లకు ప్రత్యేక నంబర్‌ కేటాయించి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి చిన్న తరహా నీటి వనరుల గణన చేపడుతున్నారు. ఇప్పటి వరకు బోర్లు, బావులకే పరిమితమయ్యారు. కానీ ఈ సారి చెరువులు, కుంటలు, జలాశయాల లెక్కలను సేకరిస్తున్నా రు.  పూర్తి సమాచారాన్ని ప్రత్యేక ఫార్మాట్‌లో పొందుపర్చుతున్నారు. విస్తీర్ణం, ఆయకట్టు, నీటి లభ్యత, వినియోగం  అనే అంశాలను సేకరిస్తున్నారు. రైతులు ఎక్కువగా చిన్న నీటి వనరులను ఆసరా చేసుకుని పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యం లో ప్రభుత్వం గణాంకాలకు శ్రీకారం చుట్టింది. బావులు, బోర్ల కే పరిమితం కాకుండా చెరువులు, కుంటలు, జలాశయాలను సమగ్రంగా నమోదు చేస్తున్నారు. వీటిని జియోట్యాగింగ్‌ చేయడంతో పాటు నీటి లభ్యత, వినియెగంపై అంచనావేస్తున్నారు.  

వివరాల నమోదు ఇలా..

భూగర్భ జల వనరుల పథకంలో చిన్న నీటి వనరులను నమోదు చేస్తున్నారు.  జిల్లా, మండలం, గ్రామం, వనరు(తవ్వకం బావి, గొట్టపు బావి), లోతు తక్కువ,(115 ఫీట్ల లోపు), లోతైన (230ఫీట్లకు ఎక్కువ), ప్రభుత్వం ఆధీనం, వ్యక్తి ఆధీనం, రైతు బృందంలోనిది, సర్వే నంబర్‌, కమతం ఎన్ని ఎకరాల విస్తీర్ణం, యజమాని (ఎస్సీ, ఎస్టీ, బీసీ)తెగ, లింగ భేదం, వనరు ప్రారంభ సంవత్సరం, సమీపంలోని మరో బావి నుంచి దూరం, నిర్మాణ ఖర్చు, ప్రభుత్వ నిధి, సొంత నిధి, వనరు ప్రస్తుతం స్థితి(ఉపయోగం, నిరుపయోగం),అందుకు కారణాలు, నీటి పంపిణీ విధానం(బహిరంగ, భూగర్భ పైపులైన్‌, స్ప్రింక్లర్లు), ఎత్తిపోతల విధానం, ఉపయోగించే ఇంధనం, మోటర్‌ హార్స్‌పవర్‌, విద్యుత్‌ వినియోగం రోజులు, సాగు చేయు ఆయకట్టు విస్తీర్ణం, కాలల వారీగా సాగునీటి పారుదల సామర్థ్యం, 2017-18 కాలంలో సాగుచేసిన విస్తీర్ణం తదితర అంశాలను నమోదు చేస్తున్నారు.   

చివరి దశకు గణన..

జిల్లాలో 15 మండలాల్లో రెవెన్యూ గ్రామాల వారీగా చిన్న తరహా నీటి వనరుల లెక్క చేపడుతున్నారు.  శాయంపేట, గీసుకొండ, ఖానాపూర్‌, నర్సంపేట, చెన్నారావుపేట, పరకాల మండలాల్లో గణన పూర్తి చేశారు. మిగతా  మండలాల్లో 90 శాతం లెక్క తేలిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరుతో గణన పూర్తి కానుంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో చిన్ననీటి వనరుల లెక్క ఇలా ఉన్నట్లు తెలిపారు. గ్రౌండ్‌ వాటర్‌(బావులు,కుంటలు), సర్‌ఫేస్‌   వాటర్‌ (చెరువులు, ఫాంపాండ్స్‌ , జలాశయాలు) ఆధారంగా వనరులను లెక్కించారు. ఇప్పటి వరకు 230 గ్రామాల్లో గణన పూర్తి చేశారు. వీటి ప్రకారం జిల్లాలో ఓపెన్‌ వెల్స్‌(బావులు) 40824 ఉన్నట్లు తేలింది. లోతు తక్కువ బావులు 441, మధ్యతరహా లోతు బావులు 7448, లోతు ఎక్కువ 2872 బావులున్నాయి. ఇవి మొత్తం జిల్లాలో 51,585 ఉన్నాయి. బావుల్లో అధికంగా నర్సంపేట మండలంలో 5170, దుగ్గొండిలో 4683, సంగెంలో 4410, పర్వతగిరిలో 4190, పరకాలలో 4019, చెన్నారావుపేటలో 3504, గీసుకొండలో 3559, ఖానాపూర్‌లో 1736, నల్లబెల్లి 3517, తక్కువగా వర్ధన్నపేటలో 1807 ఉన్నట్లు ఇప్పటి వరకు తేలింది. అలాగే జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు గణన ప్రకారం 679 చెరువులు నమోదయ్యాయి. మోటర్ల ద్వారా ఎత్తిపోసే నీటి వనరుల సంఖ్య 927గా లెక్క తేలింది. మొత్తం జిల్లాలో చెరువుల సంఖ్య 1606 వరకు చేరింది. ఇది గతంలో పోల్చితే పెరిగినట్లు చెబుతున్నారు. అన్ని రకాల చెరువులను చూస్తే నర్సంపేట మండలంలో 400 వరకు ఉన్నాయి. చెన్నారావుపేటలో 237, దామెర 233,  ఆత్మకూరు 31, దుగ్గొండి 84, గీసుకొండ 75, ఖానాపూర్‌ 77, నల్లబెల్లి 28, నెక్కొండ 60, పరకాల 51, పర్వతగిరి 26, రాయపర్తి 22, సంగెం 34 ఉండగా వర్ధన్నపేట వివరాలు అందలేదు. 

పెరిగిన చిన్న నీటి వనరుల లెక్క..  

శాయంపేట మండలంలో 13 రెవెన్యూ గ్రామాల పరిధిలో మైనర్‌ ఇరిగేషన్‌ సెన్సెస్‌ 2017-18 వివరాలను అధికారులు వెల్లడించారు. ఇందులో గ్రౌండ్‌ వాటర్‌, సర్‌ఫేస్‌  వాటర్‌ ఆధారంగా వనరులను తేల్చారు. గ్రౌండ్‌ వాటర్‌లో ఓపెన్‌ వెల్స్‌(బావులు) 2479 ఉన్నాయి. అలాగే చెరువులు మొత్తం  248 ఉన్నాయి. లోతు తక్కువ ఉన్న బావులు 25, మధ్యరకం లోతున్న బావులు 77, లోతు ఎక్కువ ఉన్న బావులు 48. మొత్తం 2629 ఉన్నట్లు తేలింది. వీటిలో అత్యధికంగా ఓపెన్‌ వెల్స్‌ గట్లకానిపర్తి పరిధిలో 406, కొప్పులలో 359, పత్తిపాక 151, పెద్దకోడెపాక 375, శాయంపేట పరిధిలో 202,అతి తక్కువగా హుస్సేన్‌పల్లి పరిధిలో 47 ఉన్నాయి. లోతు ఎక్కువగా ఉన్న బావులు కాట్రపల్లి పరిధిలో 21 ఉన్నాయి. ఇక సర్ఫస్‌  వాటర్‌లో అంటే చెరువులు, కుంటలు, ఫాంపాండ్స్‌  ను ఇందులో నమోదు చేశారు.  అలాగే గోడలపై పెట్టి మోటర్లద్వారా పంపింగ్‌ చేసే సైఫన్లను లెక్కించారు. దీంతో మండలంలో చెరువులు, ఫాంపాండ్స్‌  74 ఉన్నట్లు తేలింది. అలాగే నీటిని ఎత్తిపోసే సైఫన్లు 174 మొత్తంగా 248 ఉన్నాయి. వీటిలో చెరువులు, కుంటలు, ఫాంపాండ్స్‌  కలిపి పత్తిపాక పరిధిలో 57, కొప్పుల 29, మైలారం 27, నేరేడుపల్లి 25, ప్రగతిసింగారం 43, వసంతాపూర్‌ 23, తహార్‌పూర్‌ 11, కొత్తగట్టుసింగారంలో 4, పెద్దకోడెపాక 10, గట్లకానిపర్తిలో 3, హుస్సేన్‌పల్లి పరిధిలో ఒకటి, కాట్రపల్లి 8,శాయంపేట పరిధిలో 7 ఉన్నట్లు తేలింది. 

చిన్న నీటి వనరుగా చలివాగు ప్రాజెక్టు!

జిల్లాలో ప్రధానంగా రెండోపెద్ద జలాశయంగా పేరొందిన శాయంపేట మండలంలోని  చలివాగు ప్రాజెక్టు  చిన్ననీటి వనరుల్లో నమోదైంది. మధ్యతరహా నీటి వనరుగా రావాలంటే ఆయకట్టు ఐదు వేల ఎకరాలు ఉండాలని అధికారులు తెలిపారు. అయితే చలివాగు కింద 3048 ఎకరాల ఆయకట్టు అధికారికంగా ఉంది. ఈక్రమంలో దీనిని చిన్ననీటి వనరుగా నమోదు చేసినట్లు తెలిపారు. చలివాగు కింద అధికారికంగా సుమారు  ఐదు వేలకుపైగా ఎకరాల్లో సాగు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పూడిక పెరిగి నీటి సామర్థ్యం  తగ్గినట్లు వారు పేర్కొంటున్నారు.  

ప్రతి చెరువుకు నంబర్‌తో జియోట్యాగింగ్‌..

చిన్నతరహా నీటి వనరుల గణనతో పాటు చెరువులు, కుంటలు(పాంఫాండ్స్‌), జలాశయాలను జియోట్యాగింగ్‌ చేస్తున్నారు.  మండలంలో 248 చెరువుల లెక్క తేలడంతో వాటికి ప్రత్యేకంగా నంబర్‌ కేటాయించి జియోట్యాగింగ్‌ చేశారు. దీంతో నంబర్‌ సాయంతో ఆన్‌లైన్‌లో వివరాలను తెలుసుకుని పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టారు. దీని వల్ల ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. 
logo