మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 13, 2020 , 17:53:43

పరుగులు పెడుతున్న ఉత్పత్తి చక్రం...వృద్ధి చెందిన నగరం

పరుగులు పెడుతున్న ఉత్పత్తి చక్రం...వృద్ధి చెందిన నగరం

అన్ని రంగాల్లో వరంగల్‌ ఉమ్మడి జిల్లా అద్వితీయ ప్రగతిదారుల్లో పయనిస్తున్నది. రోజురోజుకూ ఆదాయ సమృద్ధిని సాధిస్తూ సమ్మిళిత ప్రగతి దిశగా అడుగులు వేస్తు న్నది. వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆరు జిల్లాలుగా విస్తరించి ఏ జిల్లాకు ఆ జిల్లా వికాసంలో పోటీపడుతున్నది. వ్యవసా యం ఇగురెక్కి, దాని అనుబంధ వృత్తి వికాసం గ్రామీణ ప్రాంతాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక స్పష్టం చేస్తున్నది. చేసే పనుల్లేక డొక్కలెండిన తెలంగాణ ఇవాళ చేతినిండా పనులతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్ర పోతున్నది. వలసల నివారణ జరగడం మాత్రమే కాదు ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం ఇక్కడికి వస్తున్న వ్యవసాయ కూలీలే అందుకు నిదర్శనం. వరి పైరుల పనులకు, మిర్చి తోటల పనులకు సరిహద్దు రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వేలాది మంది వ్యవసాయ కూలీలు మన ప్రాంతాలకు వస్తున్న వైనం గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. అంతేకాదు పారిశ్రామికంగా చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నదని సామాజిక, ఆర్థిక సర్వే రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సరిపోల్చినప్పుడు రికార్డు స్థాయిలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగా ల్లో ఉపాధి గణనీయంగా పెరిగిన వాతావరణం నెలకొన్నది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ఆరు జిల్లాలు ప్రగతిదారుల్లో పోటీపడు తున్నాయి. ఎస్సారెస్పీ కాలువల్లో పారే జలసిరులు పంటచేల ను ముద్దాడుతూ పరవశించి  దేవాదుల నీటి వినియోగం అధికం కావడంతో రెండు పంటలు సమృ ద్ధిగా పండుతూ గణనీయమైన దిగుబడులు వస్తున్నాయి. ఏయేటికా యేడు పంట విస్తీర్ణం పెరుగుతూ వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ రైతాంగానికి భరోసా లభిస్తున్నది. జిల్లాల స్థూల  ఆదాయంలో వరంగల్‌ అర్బన్‌ ప్రథమ స్థానం లో (రాష్ట్రంలో 15వ స్థానం), ములుగు జిల్లా ఆరో స్థానంలో (రాష్ట్రంలో చివరి స్థానం) నిలిచింది. అయితే తలసరి ఆదా యంలో ములుగు జిల్లా మన ఆరు జిల్లాల్లో టాప్‌గా నిలవడం విశేషం. గ్రామాల్లో వ్యవసా య విస్తరణ గణనీయంగా పెరగడం వల్ల చేతి నిండా పనులు దొరికి ఉపాధి కల్పనలోనూ ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలబడింది. రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే-2020లో ఏ అంశాల్లో ఏ జిల్లా ప్రగతి ప్రస్థానం ఈ విధంగా ఉన్నదనేది రంగాల వారీగా విశ్లేషణలు అంకెల రూపంలో ఇస్తున్నాం.


రామప్పకు పూర్వవైభవం తీసుకురావాలి 

ములుగు జిల్లా ప్రతినిధి-నమస్తేతెలంగాణ: ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. శాసన మండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్‌గౌడ్‌ను పోచంపల్లి అభ్యర్థించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సానుకూలంగా స్పందించారు. దేవాలయాలు, వారసత్వ కట్టడాల సంరక్షణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ఆధ్యాత్మిక అస్తిత్వానికి పునర్జీవం పోస్తున్నారని అన్నారు. పుణ్యక్షేత్రాలకు పూర్వ వైభవం తెస్తున్నారని, ఇదే వరుసలో చారిత్రక, పర్యాటక క్షేత్రం రామప్ప ఆలయం ఉండాల్సిందని తెలిపారు. చెక్కు చెదరని శిల్పకళ ఉన్న రామప్ప.. వారసత్వ సంపదగా ప్రపంచ గుర్తింపు కోసం ఎదురు చూస్తోందని వెల్లడించారు. రామప్ప చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్‌లో ధ్యానకేంద్రం ఏర్పాటు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు ఐలాండ్‌లో కొన్ని పిల్లర్లు వేసి నిర్మాణ పనులు ప్రారంభించి వదిలివేశారని అన్నారు. అక్కడ ధ్యానకేంద్రం కట్టే యోచన ఉందా..? లేక శిల్ప కళా వేదిక, శిల్ప కళాశాల లాంటిది ఏదేని ఏర్పాటు చేస్తే బాగుంటుందా..? అన్న విషయంపై ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 

కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి 

రామప్ప ఆలయాన్ని పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చారని, పురావస్తు శాఖ కేంద్రం పరిధిలో ఉందని, ఆలయ పూర్వ వైభవాన్ని కాపాడేందుకు పురావస్తు శాఖ ఆపసోపాలు పడుతోందని పోచంపల్లి ఎద్దేవా చేశారు. అద్భుత శిల్ప కళను చూడటానికి వేలాదిగా ప్రజలు దేశ సరిహద్దులు దాటి వస్తున్నారని అన్నారు. ఆలయ అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొన్ని నిధులు మంజూరు చేసి రామప్పను అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి ఎమ్మెల్సీ తీసుకొచ్చారు. 

టూరిజం స్పాట్‌గా మార్చాలి 

రామప్పను టూరిజం స్పాట్‌గా మార్చాలని, తద్వారా రామప్ప ఖ్యాతి ఖండాంతరాలు దాటే అవకాశం ఉందని అన్నారు. యునెస్కో ప్రతినిధుల బృందం రామప్పను సందర్శించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల సహకారం తీసుకొని యునెస్కొ బృందంతో మాట్లాడినట్లు తెలిపారు. రామప్పలో కొంత అభివృద్ధిని చేస్తే యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని, యునెస్కో గుర్తింపు వల్ల మరిన్ని నిధులు రామప్పకు వస్తాయని, ఆ నిధులతో రామప్ప అంతర్జాతీయ టూరిజం స్పాట్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేయాలని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని మంత్రికి ఎమ్మెల్సీ వివరించారు. 

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించే అవకాశం 

రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వంతో రామప్ప అభివృద్ధిపై మాట్లాడాలని మంత్రిని, ప్రభుత్వాన్ని పోచంపల్లి కోరారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే సర్వే ఆఫ్‌ ఇండియా, పురాతత్వ శాఖ, సాంస్కృతిక, పర్యాటక, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో మరిన్ని నిధులతో రామప్పను వేగవంతంగా ఆధునీకరించేందుకు వీలు ఉంటుందని వివరించారు. ఇందుకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ స్పందిస్తూ.. పురాతన ఆలయాలు, కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి అభివృద్ధికి తగు ఆలోచనలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు.


logo