శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 12, 2020 , 14:48:51

వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం

వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం

కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో నగ ర రూపురేఖలు మారనున్నాయి. సౌకర్యాల కల్పనతో పాటు సంపద వృద్ధి కానుంది. ప్రజలకు కనీస వసతులు కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు పడనున్నాయి. కుడా పరిధిలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు రానున్నాయి. ముఖ్యంగా దశాబ్దాల తరబడి భూ వినియోగ మార్పు సమస్యతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలకు మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో ఊరట లభించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. ప్రతి నిర్మాణానికి అనుమతులు రానుండడంతో గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌కు భారీగా ఆదాయం సమకూరనుంది. 1971 నాటి మాస్టర్‌ ప్లానే ఇప్పటి వరకు అమలవుతున్న పరిస్థితుల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఏళ్ల తరబడి భూ వినియోగ మార్పు కోసం సెక్రటేరియట్‌ చుట్టూ తిరిగే పరిస్థితులకు తెరపడింది. కొత్త మాస్టర్‌ ప్లాన్‌తో శివారు ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందను న్నాయి. దీంతో నగరంలో భూ విలువ మరింత పెరుగనుంది. రియల్‌ బూమ్‌ ఊపందుకోనుంది.

భూ వినియోగ సమస్యకు పరిష్కారం

మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం నగర ప్రజలకు ఎంతో ఊరట కలిగించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మాస్టర్‌ ప్లాన్‌ ఎట్టకేలకు ఆమోదం పొందడంతో నగరంలోని అనేక ప్రాంతాల భూ వినియోగ సమస్యకు పరి ష్కారం లభించింది. 49ఏళ్ల క్రితం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటికీ అమలు చేస్తుండటంతో భూ విని యోగ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నగర నడిబొడ్డులో ఉన్న అనేక పరిశ్రమలు ఇప్పుడు విస్త రించిన నగర శివారు ప్రాంతాలకు తరలి పోయాయి. వ్యవసాయ భూములన్నీ నివాస ప్రాంతాలుగా మారి పోయాయి (ఉదాహరణకు ఖమ్మం రోడ్‌, హంటర్‌రోడ్‌, ఉర్సు బైపాస్‌ రోడ్‌, దర్గా కాజీపేట ప్రాంతాలు). అయితే అప్పటి మాస్టర్‌ ప్లానే ఇప్పటికీ అమలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ నివాస గృహాలకు అనుమతులు లభించలేదు. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. పాత మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న ఇండస్ట్రియల్‌ జోన్లు, అగ్రికల్చర్‌ జోన్లు, పార్కులు అన్నీ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కమర్షియల్‌, సెమీ కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ జోన్లుగా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు లభించనున్నాయి. 

మెరుగుపడనున్న జీవన ప్రమాణాలు

మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదంతో వరంగల్‌ నగర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి. ఆదాయం భారీగా పెరుగనుంది. అన్ని ప్రాంతాల్లో సౌకర్యాల కల్పన జరుగనుంది. ముఖ్యంగా దేశంలోని 15 నగరాల మాస్టర్‌ ప్లాన్‌లను అధ్యయనం చేసి ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. అర్బన్‌ ప్రాంతమంతా కలుషితమవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అర్బన్‌ గ్రీన్‌ లంగ్స్‌ స్పేసెస్‌, గ్రీన్‌ కారిడార్స్‌, పార్కులను పెద్ద ఎత్తున ప్లాన్‌లో పొందుపరిచారు. ప్రణాళికాబద్ధంగా నగర నిర్మాణం జరుగనుంది. 

భారీ ఆదాయం

భూ వినియోగ సమస్య తీరడంతో నిర్మాణాలు పెరగనున్నాయి. భూ విలువ రెట్టింపు కానుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖలతో పాటు గ్రేటర్‌కు భవన నిర్మాణాల అనుమతుల పేరిట రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు భారీగా ఆదాయం సమకూరనుంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడనుంది. 

రియల్‌ బూమ్‌ ఊతం

కొత్త మాస్టర్‌ ప్లాన్‌తో రియల్‌ బూమ్‌ ఊపందుకోనుంది. నగరం చుట్టూరా రింగ్‌రోడ్లు రానున్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. దీంతోపాటు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారిస్తుండడంతో రియల్‌ వ్యాపారం పెరగనుంది. 


logo