మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 12, 2020 , 14:46:18

శతాబ్దాల నగరిపై చరితార్థపు అడుగు

శతాబ్దాల నగరిపై చరితార్థపు అడుగు

వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ జిల్లాల ప్రగతి నమూనాకు అంకురార్పణ జరిగే తొలి అడుగు బుధవారం పడింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆమోద ముద్ర వేశారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యఅధికార యంత్రాంగం సుదీర్ఘంగా చర్చించి ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంతి కేసీఆర్‌ సంకల్పించారు. ఈ నేపథ్యంలో 2015 జనవరిలో ఆయన నాలుగు రోజులు ఇక్కడే బసచేసి నగర స్వరూపాన్ని మార్చివేయాలని, మరో 100-150 సంవత్సరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నమూనాలు రూపొందించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పట్టణాభివృద్ధి శాఖ, కుడా, గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాయి. 

నిజానికి నాలుగు దశాబ్దాల క్రితం 1971లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఆధారంగా నగర విస్తరణ ఇష్టారాజ్యంగా సాగింది. చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ వికాస ఖిల్లా అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదని తెలంగాణ సర్కార్‌ భావించింది. ఈ నేపథ్యంలోనే కొత్త మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించాలని భావించి అందుకు అనుగుణమైన విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 


మూడు రింగ్‌ల ముచ్చటైన కనెక్టివిటీ

వరంగల్‌ మహానగర పాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వికాసానికి పునాది రహదారుల విస్తరణే. ఒక ప్రాంత ప్రజాజీవన ప్రమాణాల పెంపు కోసం అక్కడి రహదారులే జీవనాడులు అన్న అంతఃసూత్రాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో మూడు ముఖ్యమైన రోడ్‌కనెక్టివిటీ నెట్‌వర్క్‌లను ప్రతిపాదించింది. అందులో ఇన్నర్‌ రింగ్‌రోడ్‌, అవుటర్‌ రింగ్‌రోడ్‌, రీజినల్‌ రింగ్‌రోడ్‌ ఉన్నాయి. ఈ మూడింటితో వరంగల్‌ మహానగరం నిత్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో కరచాలనం చేసే విధంగా రూపొందించారు. 

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ 

కడిపికొండ నుంచి ఖమ్మం రోడ్‌ (వయా భట్టుపల్లి, ఉర్సు గుట్ట మీదుగా నాయుడు పెట్రోల్‌ పంప్‌). ఇది ఇప్పటికే పూర్తయింది. నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి నక్కలపెల్లి, ఖిలా వరంగల్‌ మీదుగా అబ్బనికుంట అవతలివైపు నుంచి ఏనుమూముల రెండో గేట్‌, అక్కడి నుంచి కొత్తపేట మీదుగా ఆరెపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్‌ను కలిపే నెట్‌వర్క్‌ నగర అంతరనగగా రూపుదాల్చుతున్నది. 

ఔటర్‌ రింగ్‌రోడ్‌ 

రెండు జాతీయ రహదారుల సమాహారంగా ఔటర్‌ రింగ్‌రోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 163 జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తయ్యాయి. రాంపూర్‌ నుంచి ఆరెపల్లి (చింతట్టు మీదుగా) వరకు పూర్తి కావస్తున్నది. ఇక రెండో జాతీయ రహదారి (556) జగిత్యాల టు ఖమ్మం. దీనికి సంబంధించిన నిధుల్ని కూడా రెండో దశలో ప్రభుత్వం మంజూరు చేసింది. వరంగల్‌కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్‌రోడ్‌లో 29 కిలోమీటర్ల రింగ్‌రోడ్‌ పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2వ తేదీ నాటికి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. 

రీజినల్‌ రింగ్‌రోడ్‌ 

ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌రోడ్లను అనుసంధానం చేస్తూ ప్రాంతీయ రింగ్‌రోడ్‌ను మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచారు. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు, ధర్మసాగర్‌, భీమదేవరపల్లి (ముల్కనూరు), ఎల్కతుర్తి, కమలాపూర్‌, పరకాల, ఆత్మకూర్‌, గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట మీదుగా రీజినల్‌ రింగ్‌రోడ్‌ను పొందుపరిచారు. వీటితోపాటు 18 రేడియల్‌ రోడ్స్‌ను సైతం ప్రతిపాదించారు. మొత్తంగా రోడ్‌కనెక్టివిటీతో విస్తృతమైన ప్రయాణ సౌకర్యం కలిగిస్తూ ప్రజాజీవన వికాసంలో రహదారుల పాత్ర అతిముఖ్యమైనదిగా మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. 

గ్రోత్‌కారిడార్‌ 

మాస్టర్‌ ప్లాన్‌లో అవుటర్‌ రింగ్‌రోడ్‌ చుట్టూ గ్రోత్‌ కారిడార్‌గా రూపొందించడంతో వరంగల్‌ మహానగర విస్తరణ వికాసంవైపు అడుగులు వేయబోతున్నది. 

15 కిలోమీటర్ల మెట్రో నియో

పట్టణాభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడే విధంగా వరంగల్‌ను నిలపాలన్న సర్కారు సంకల్పానికి మరో మైలురాయి పడింది. కాజీపేట నుంచి హన్మకొండ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌, హన్మకొండ చౌరస్తా మీదుగా ములుగురోడ్‌, ఎంజీఎం సర్కిల్‌, పోచమ్మమైదాన్‌, వెంకట్రామ జంక్షన్‌ నుంచి వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వరకు 15 కిలోమీటర్ల పొడవునా మెట్రో నియో ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మహామెట్రో ప్రతినిధి బృందం ఇప్పటికే రెండు దఫాలుగా నగరంలో పర్యటించి అధ్యయనం చేసింది. ఆ సంస్థ త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించబోతున్నది అనే తీపికబురును మాస్టర్‌ ప్లాన్‌ సమీక్ష సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్‌ తరహాలో మెట్రో రైల్‌ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

మాస్టర్‌ప్లాన్‌ మైలురాళ్లు

నగరాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే మాస్టర్‌ప్లాన్‌పై దశాబ్ద కాలంగా సుదీర్ఘ కసరత్తు చేశారు. దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల మాస్టర్‌ప్లాన్‌లను అధ్యయనం చేసి వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌ను తీర్చిదిద్దారు.  దశాబ్దం క్రితం మాస్టర్‌ ప్లాన్‌ బాధ్యతలను ఢిల్లీకి చెందిన ఐకాం కంపెనీకి అప్పగించారు. logo
>>>>>>