మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 12, 2020 , 14:17:02

రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న సాగు !

రికార్డు స్థాయిలో  వరి, మొక్కజొన్న సాగు !

శాయంపేట : మండలంలో యాసంగిలో రికార్డు స్థాయిలో వరి, మొక్కజొన్న పంట సాగైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖరీఫ్‌ సాగుతో యాసంగి పోటీ పడింది. ఎస్సారెస్పీ నీళ్లు ప్రవహిస్తూ చెరువుల్లోకి చేరడంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ఎటు చూసినా పంట పొలాలు దర్శనమిస్తుండటం రైతుల్లో ఆనందాన్ని నింపింది. యాసంగి వచ్చిందంటే చుక్క నీరు లేని పరిస్థితి కనిపించేదంటున్నారు. కానీ దానికి భిన్నంగా చెరువులు యాసంగిలో నిండుకుండలా మారి అలుగు పోస్తుండటం విశేషం. శ్రీరాంసాగర్‌ నుంచి వారబందీ పద్ధతిలో నీటిని ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్‌ నెల వరకు నీళ్లు ఇస్తామని అధికారులు వెల్లడించారు. ఈ తరుణంలో మొక్కజొన్న, వరిసాగు భారీగా పెరిగింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో మొక్కజొన్న  పంట కంకులు వేస్త్తూ చేతికి వచ్చేస్తోందంటున్నారు.  మండలంలో 29,016 ఎకరాల జియోగ్రాఫికల్‌ ఏరియా ఉంది. ఇందులో 18,784 ఎకరాలు సాగు విస్తీర్ణమని అధికారులు చెప్పారు. అయితే యాసంగిలో మండల పరిధిలో కేవలం వరి 6,564 ఎకరాలు, మొక్కజొన్న 1,276 ఎ కరాల్లో సాగైనట్లు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. దాదాపు తొంభై శాతం విస్తీర్ణంలో ఈ  పం టలు సాగు చే యడం విశేషమని తెలిపారు. గతంలో చూస్తే యా సంగిలో మొక్కజొన్న సాగు తక్కువేనంటున్నారు. ఇక వరి పంటలు  అయితే బావుల కింద మాత్రమే సాగు చేసేవారంటున్నారు. కానీ ఈ యాసంగిలో పూర్తి స్థాయిలో వరి పంట సాగైందని అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలో రెండో పెద్ద జలాశయమైన చలివాగు ప్రాజెక్టు కింద యాసంగి సాగు పెరిగింది. ప్రధాన పంటగా వరిని సాగుచేశారు. తైబంధీ మేరకు పెద్దకోడెపాక పరిధిలో 836, కొప్పుల పరిధిలో 258 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. మండలంలో పెద్ద చెరువుల కింద 1361 ఎకరాలు, చిన్న చెరువుల కింద 1726 ఎకరాలు, బోరు బావుల కింద 2500 ఎకరాల వరకు వరి సాగు చేస్తున్నారు. అయితే బోరుబావులు, బావుల కింద మాత్రమే మొక్కజొన్న సాగు చేశారు. బోరుబావుల కింద 770 ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద 506 ఎకరాలు సాగైందని వెల్లడించారు. అయితే మొత్తంగా పెద్దకోడెపాక పరిధిలో 1442 ఎకరాలు, వసంతాపూర్‌ పరిధిలో 648 ఎకరాలు, శాయంపేట పరిధిలో 485 ఎకరాలు, పత్తిపాక 620 ఎకరాలు అధికంగా వరిని సాగు చేశారు. మొక్కజొన్న పంట కూడా పెద్దకోడెపాక పరిధిలో 175 ఎకరాలు, తహారాపూర్‌లో 185 ఎకరాలు, కాట్రపల్లి 253 ఎకరాలు,  సాగు చేయగా వసంతాపూర్‌లో తక్కువగా 34 ఎకరాలు సాగైనట్లు పేర్కొన్నారు. ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి గంగా జమున మాట్లాడుతూ ఈ యాసంగిలో వరి, మొక్కజొన్న భారీగా సాగైందన్నారు. రబీతో సమానంగా వరి సాగుచేసినట్లు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా తొంభై శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. logo
>>>>>>