మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Mar 08, 2020 , 02:23:04

మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలి

మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలి

వరంగల్‌ కల్చరల్‌, మార్చి 07 : మహిళలు ఆత్మైస్థెర్యంతో జీవితంలో ముందుకు సాగిపోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ రవీందర్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ డివిజనల్‌ పోలీసులు ఆధ్వర్యంలో శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన విదార్థినులు, మహిళా పోలీసులు, న్యాయవాదులు, కండక్టర్లు, నర్సులతో పాటు ఇతర రంగాలకు చెందిన మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో.. అక్కడ దేవతలు సంచరిస్తారని శాస్ర్తాలు చెబుతున్నాయన్నారు. ఎల్లప్పుడు ఓర్పు, సహనంతో ఉండే మహిళలపై సమాజంలో చిన్నచూపు ఉండరాదన్నారు. పరిస్థితులను  బట్టి మహిళలు ఆదిపరాశక్తులుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళలకు ఆయన పిలుపునిచ్చారు. మహిళలకు ఉద్యోగం నిర్వహించే ప్రాంతంలోగానీ, కాలేజీ, వీధుల్లో ఎక్కడైనా ఎవరూ ఇబ్బందులకు గురి చేసినా వెంటనే డయల్‌ 100కు గానీ, షీటీం వాట్సాప్‌ నంబరు 9491089257కు సమాచారం అందించాలని సూచించారు. నిందితులపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. 


ఇంతకన్నా ముందు జరిగిన కార్యక్రమంలో వరంగల్‌ అదనపు డీసీపీ వెంకటలక్ష్మి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలను షేర్‌ చేయోద్దని చెప్పారు. అనంతరం కేయూ రిజిస్ట్రార్‌ పురుషోత్తం, కేఎంసీ విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య యూనివర్శిటీ లా కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, అదనపు డీసీపీ మల్లారెడ్డి, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శోభ మాట్లాడారు. అనంతరం వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఏఎస్‌ఐ శోభ, కండక్టర్‌ తోట సునీత, డాక్టర్‌ రమ, డాక్టర్‌ కస్తూరి ప్రమీల, విద్యార్థిని మీరాజ్‌షెరీన్‌, న్యాయవాది హైమవతిని వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ రవీందర్‌ సన్మానించి జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ జాగృతి కళాబృందం సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సమావేశంలో హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సీఐలు డేవిడ్‌రాజు, దయాకర్‌, అజయ్‌, సతీశ్‌కుమార్‌, ఎస్సైలు, ఏఎస్సైలు ఇతర హన్మకొండ డివిజన్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  logo
>>>>>>