బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 07, 2020 , 02:01:18

ఆలయంలో చోరీ

ఆలయంలో చోరీ

నెక్కొండ, మార్చి 06: మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు సీఐ తిరుమల్‌,ఎస్సై నాగరాజులు  తెలిపారు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ మంటపం గ్రిల్స్‌కు వేసిన తాళాన్ని గడ్డపారతో పగులగొట్టి లోనికి చొరబడ్డారు. శివాలయం గర్భగుడిలో ఉన్న శివపార్వతుల పంచలోహ ఉత్సవ విగ్రహాలు, వాసవి కన్యకా పరమేశ్వరీ గర్భాలయంలో అమ్మవారికి అలంకరించిన ఇత్తడి తొడుగులు, కిరీటం, షఠం దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు బీ.వీ.ఎన్‌.శాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చోరీ  సమాచారం అందుకున్న సీఐ తిరుమల్‌ ఆలయాన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయంలోని బస్తాలో ఉన్న బియ్యాన్ని అక్కడే కుమ్మరించి బస్తాలో విగ్రహాలు,అలకంరణ వస్తువులను తీసుకువెళ్లగా ఖాళీ బస్తా విసిరేసిన ప్రాంతాన్ని గుర్తించారు. వరంగల్‌కు చెందిన దేవేందర్‌ ఆధ్వర్యంలోని క్లూస్‌టీం నెక్కొండ ఆలయానికి చేరుకొని వేలిముద్రలను,ఇతర ఆధారాలను సేకరించారు. చోరీకి గురైన విగ్రహాలు, అలంకరణ సామగ్రి విలువ సుమారు రూ.45వేల వరకు ఉండవచ్చని చెబుతున్నారు.

ఆలయాన్ని సందర్శించిన ఏసీపీ 

చోరీ జరిగిన ఆలయాన్ని ఏసీపీ ఫణీంద్ర శుక్రవారం సాయంత్రం సందర్శించారు. చోరీ జరిగిన తీరుపై ఎస్సై నాగరాజు, అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్‌ గన్ను కృష్ణతో మాట్లాడారు. చోరీ అనంతరం దొంగలు ఖాళీ బస్తాను వదిలేసి పారిపోయిన ప్రాంతాన్ని , ఆలయం నలువైపులా ప్రహారీ గోడ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పంచలోహ విగ్రహాల చోరీ పక్కా ప్రణాళికతో , ప్రొఫెషనల్స్‌ చేసినట్లుగా భావిస్తున్నామన్నారు.  logo