బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 06, 2020 , 02:32:37

కొవిడ్‌-19పై అప్రమత్తం

కొవిడ్‌-19పై అప్రమత్తం

రెడ్డికాలనీ, మార్చి 05 : ‘కొవిడ్‌-19’పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో కే లలితాదేవి సూచించారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ‘కొవిడ్‌-19’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సాంకేతికపరమైన వివిధ అంశాలపై ఐడీఎస్పీ సర్వలెన్స్‌ వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణారావుతో కలిసి వివరించారు. వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకూ కేసులు నమోదు కానప్పటికీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు ఆందోళనకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయాలని చెప్పారు. కేరళలో న మోదైన కేసులు పూర్తిగా రికవరీ అయ్యాయని చెప్పారు. కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఫాలో అప్‌చేసి తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని, జలుబు, దగ్గు, శ్వాసతో ఇబ్బందిగలవారు ఇతరులకు దూరంగా ఉంటూ, చేతుల శుభ్రతపై అవగాహన కలిగించాలన్నారు. 


ఇది కేవలం వ్యాధిగ్రస్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వారికి సన్నిహితంగా ఉండేవారికి వ్యాపించే అవకాశం ఉందని, గాలిద్వారా ప్రయాణించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ విషయంగా డిప్యూటేషన్‌పై పంపించినవారు తప్పకుండా వెళ్లాల్సిందేనన్నారు. పీహెచ్‌సీలకు కొవిడ్‌-19 వైరస్‌కు సంబంధించిన అవగాహన కరపత్రాలు పంపిస్తున్నామని చెప్పారు. హోర్డింగ్స్‌, బస్‌ప్యానెల్స్‌ ద్వారా, టీవీ, సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్రస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మారి స్వచ్ఛంద సంస్థ ద్వారా నడుస్తున్న ‘సంగ్రహ ప్రాజెక్టు’ తరుఫున నీయా నాంపల్లి, ఏల్తియా నేహా కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎండీ యాకుబ్‌పాషా, డీఐవో సీహెచ్‌ గీతాలక్ష్మి, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సీ ఉమశ్రీ, ఐడీఎస్పీ డిస్ట్రిక్ట్‌ సర్వెలెన్స్‌ అధికారి డాక్టర్‌ శ్రీకృష్ణారావు, డీఎంవో డాక్టర్‌ వాణిశ్రీ, జిల్లా మాస్‌మీడియా అధికారి వేముల అశోక్‌రెడ్డి, వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>