శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 05, 2020 , 02:28:13

కొవిడ్‌-19 నివారణకు పకడ్బందీ చర్యలు

కొవిడ్‌-19 నివారణకు పకడ్బందీ చర్యలు

వరంగల్‌ చౌరస్తా, మార్చి 0 4:  ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19(కరోనా)వైరస్‌ నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయమై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బుధవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్జీ హన్మంతు, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మేయ ర్‌ గుండా ప్రకాశ్‌రావులతో కలిసి ఎంజీఎంలో 25 పడకలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక (ఐసోలేటెడ్‌) విభాగాన్ని ఆ యన సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. విభాగాన్ని రెండు విభాగాలుగా విభజించాలని ఆడవారికి, మగవారికి వేర్వేరుగా వార్డును విభజించడం మూలంగా మరిం త సులువుగా వైధ్యసేవలు అందించడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన  విభాగానికి అవసరమైన వసతులను పరిశీలించి ఐసోలేషన్‌ (ఏసీల బిగింపు) ప్రక్రియను ఎందుకు నిర్వహించలేదని అధికారులను ప్రశ్నించడంతో ప్రస్తుతం అందుబాటులో లేనికారణంగా బిగింపు చేపట్టలేదని అధికారులు తెలియజేశారు. దీంతో వెంటనే ప్రత్యేక విభాగానికి అవసరమైన ఐసోలేటెడ్‌ యంత్ర సామగ్రిని అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. 


అనంతరం ఎంజీఎం సూపరింటెండెంట్‌ బీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఎంజీఎంలోని వివిధ విభాగాలకు చెందిన పలువురు విభాగాధిపతులు, అధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎంజీఎం దవాఖాన పరిసరాల్లో అపరిశుభ్రంగా ఉండడాన్ని ఆయన గుర్తించినట్లు తెలియజేస్తూ వెంటనే పారిశుధ్య కాంట్రాక్టు రద్దుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ, ఎంజీఎంలో పారిశుధ్యం బాధ్యతలను గ్రేటర్‌ కమిషన్‌ పర్యవేక్షించాలని అన్నారు. ఎంజీఎం లో అందుతున్న, అందాల్సిన సేవలను, వాటికి అవసరమైన వసతులను కల్పించడానికి కలెక్టర్‌ పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం ప్రజలకు కొవిడ్‌-19పై అవగాహన కల్పించడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టాడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. వెంటనే కరపత్రాలు, పోస్టర్‌లు, వివిధ రకాల ప్రచార సాధనాల ద్వారా అన్ని ప్రాంతాల వారికి అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రజలు భయబ్రాంతులకు గురికాకుండా ప్రతి రోజు పత్రికాముఖంగా నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.  నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచడంతో పాటుగా  విధుల్లో ఉండే వైద్యులు, విభాగాధిపతుల వివరాలతో పాటుగా వారి మొబైల్‌ నంబర్లతో సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఎంజీఎం ఆర్‌ఎంవో హరీశ్‌రాజ్‌, పలు విభాగాల అధిపతులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.logo