బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 02, 2020 , 02:50:40

ఉపాధి కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌!

ఉపాధి కూలీలకు సమ్మర్‌ అలవెన్స్‌!

శాయంపేట, మార్చి 01: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ వేసవిలో అలవెన్స్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు పనులు చేసే ఉపాధి కూలీలకు రూ. 20 నుంచి రూ. 30 అధికంగా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే, ఉపాధి పనులు చేసే దివ్యాంగ కూలీలకు అదనంగా 50 పనిదినాలు మంజూరు చేస్తూ సర్క్యులర్‌ జారీ చేశారు. 

వలసల నివారణకు..

గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తున్నది. వ్యవసాయ పనుల అనంతరం ఐదు నెలలపాటు పనులు నిర్వహించనున్నారు. కూలీలకు సాధారణంగా ఇచ్చే వేతనం కంటే నిర్దేశించిన శాతం ప్రకారం పెంచి కూలి డబ్బులు అందించనున్నారు. దీంతో కూలీలకు చేసిన పనికంటే రూ. 20 నుంచి రూ. 30 వరకు అధికంగా లబ్ధి చేకూరనున్నది. ఎండ తీవ్రత అధికంగా ఉండి పని గంటలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కూలీలు నష్టపోకుండా వారికి అదనపు వేతనంతో లబ్ధి చేకూర్చనున్నారు.

జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు..

ఉపాధిహామీ పథకం వివరాలు ఫిబ్రవరి 25 వరకు జిల్లాలో ఇలా ఉన్నాయి. జిల్లాలో 1,43,822 కుటుంబాలు జాబ్‌కార్డులు కలిగి ఉన్నాయి. వ్యక్తిగతంగా పనుల కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారు మాత్రం 3,02,013 ఉన్నారు. 18 ఏళ్లు నిండి పని చేసే వారికి జాబ్‌కార్డులు అందిస్తున్నారు. ఉపాధి పనులు చేసే కుటుంబాలు 75,769 ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,24,024 మంది కూలీలు పనులను వినియోగించుకుంటున్నారు. రోజుకు ఒక్కో కూలీకి రూ. 211 చెల్లించేలా నిర్దేశించారు. నిబంధనల ప్రకారం పని చేస్తే రోజుకు రూ. 211 చెల్లిస్తారు. అంతేగాకుండా గడ్డపారతో పని చేసే కూలీలకు రోజుకు దాన్ని సాన పట్టేందుకు రూ. 10, తట్ట, పారతో పని చేసే కూలీకి రోజుకు రూ. 5 అందిస్తున్నారు. అలాగే, కూలీకి పని చేసే చోట తాగునీటి కోసం రోజుకు రూ. 2.50, ఎండకాలం రూ. 5 అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మొత్తం కలిపి రోజుకు రూ. 211 ప్రతి కూలీకి అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

వేసవిలో అదనంగా వేతనం..

ఉపాధి కూలీలకు వేసవిలో ఎండల దృష్ట్యా పని గంటలు తగ్గినా అందుకనుగుణంగా వేతనం అందించనున్నారు. ఇది 30 శాతం వరకు అధికంగా ఉండనుంది. ఒక కూలీ నిర్దేశించిన పని గంటల కంటే తక్కువ చేసినా అదనపు వేతనం కలిపి చెల్లిస్తారు. దీనిని ఈ ఫిబ్రవరి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అదనంగా కరువు భత్యంగా చెల్లించనున్నట్లు ఉపాధిహామీ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మేలో ఎండలు అధికంగా ఉంటాయి. ఈ రోజుల్లో ఉదయమే పనులు చేసుకునే వీలుంటుంది. వారికి నిర్దేశించిన విధంగా కొలతల ప్రకారం పని చేయాలి. అయితే, ఇందులో తక్కువ పని చేసినా నిర్దేశించిన శాతం ప్రకారం పెంచి ఆటోమెటిక్‌గా పేమెంట్‌ జనరేట్‌ అవుతుందని అధికారులు తెలిపారు. కూలీ రూ. 180 వరకు పని చేసినా అదనపు భత్యం కలిపి రోజుకు రూ. 211 వరకు చెల్లిస్తారు. కాగా, గ్రామాల్లో ఇంకా ఉపాధిహామీ పనులు పుంజుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు ఉపాధి పనుల వైపు మొగ్గు చూపడం లేదు. మిర్చి తోటలు, కలుపు తీసే  వ్యవసాయ పనుల్లోకి వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో నర్సరీల్లో మాత్రమే ఉపాధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే, వచ్చే నెల నుంచి ఉపాధి పనుల్లోకి కూలీలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాంపాండ్స్‌, చెరువుల్లో పూడికతీత, ఫీడర్‌ ఛానల్స్‌, ఫీల్డ్‌ ఛానల్స్‌ తదితర పనులను చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వేసవిలో రైతులతోపాటు చాలామంది కూలి పనులు చేయడానికి వస్తారని చెబుతున్నారు.

మూడు లక్షల మంది కూలీలు!

జిల్లావ్యాప్తంగా 3,02,013 మంది కూలీలు జాబ్‌కార్డులు తీసుకుని పనుల కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. అయితే, వీరిలో పనుల్లోకి వస్తున్న వారు 1,24,024 మంది ఉన్నారు. వీరంతా ఆక్టివ్‌ జాబ్‌కార్డులు కలిగి ఉండి పనులు చేస్తున్నారు. అయితే, ఎంతమంది కూలీలు పనికి వచ్చినా ప్రభుత్వం వారికి నిర్దేశించిన విధంగా వేసవి భత్యం అందనున్నది. ఆక్టివ్‌ జాబ్‌కార్డులు కలిగిన వారు జిల్లాలో అధికంగా నెక్కొండ మండలంలో ఉన్నారు. జిల్లాలో 16 మండలాలు, 401 పంచాయతీల్లో మొత్తంగా ఆక్టివ్‌ జాబ్‌కార్డులు ఉన్న వా రు 1,24,024 మంది ఉన్నారు. మొత్తంగా గత ఫిబ్రవరి 25 తేదీ వరకు లెక్కిస్తే.. జిల్లాలో ఉపాధిహామీ కింద రూ. 66.20 కోట్లు వెచ్చించారు. ఇందులో వేజెస్‌ కింద రూ. 47.88 కోట్లు, మెటీరియల్‌ కింద రూ. 11.93 కోట్లు ఖర్చు చేశారు.

దివ్యాంగులకు 150 రోజుల పని

ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న దివ్యాంగ కూలీలకు 150 రోజుల పని కల్పించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధి పనిలోకి వచ్చే దివ్యాంగ కుటుంబాలకు ఇప్పటి వరకు ఏడాదికి 100 పనిదినాలు కల్పిస్తున్నారు. అయితే, వీరికి మరింత ఆర్థిక తోడ్పాటునందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా 50 రోజుల పని దినాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జాబ్‌కార్డు కలిగిన దివ్యాంగులకు నిర్దేశించిన ప్రకారం 150 రోజుల పనిని కల్పించనున్నారు.


logo