గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 02, 2020 , 02:10:45

మల్లన్న చెంత.. భక్తుల పులకింత

మల్లన్న చెంత.. భక్తుల పులకింత

చేర్యాల, నమస్తే తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో 7వ వారం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7వ వారం సందర్భంగా సుమారు 60 వేల మంది భక్తులు మల్లన్నను దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు  గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు. అనంతరం ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో పవిత్రంగా స్నానాలు అచరించారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతోపాటు కొరికలు తీర్చాలని వేడుకున్నారు. మహిళల భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండపై ఎల్లమ్మ తల్లికి బొనాలు సమర్పించారు. కొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కొడెల స్తంభం వద్ద కొడెలు కట్టి పూజలు, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కొరికలు తీర్చాలని స్వామిని వేడుకున్నారు. స్వామి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ మేక సంతోశ్‌, డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్‌ తెలిపారు. భక్తులకు పాలక మండలి సభ్యులు ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, ఏఈవోలు రావుల సుదర్శన్‌, శ్రీనివాస్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఏఈలు బ్రహ్మండ్లపల్లి అంజయ్య, ప్రతాప్‌, సిబ్బంది బత్తిని పోచయ్య, మేకల పోచయ్య, విజయ్‌కుమార్‌, వెంకటచారి, జగదీశ్వర్‌, మాధవి, నర్సింహులు, అర్చకులు సేవలందించారు.  


logo
>>>>>>