ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 26, 2020 , 03:14:18

పెద్దపీట!

పెద్దపీట!

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలకవర్గంలో జిల్లాకు పెద్దపీట దక్కింది. ఈ బ్యాంకు డైరెక్టర్లుగా ఎన్నిక ఏకగ్రీవమైన పదిహేడు మంది టీఆర్‌ఎస్‌ మద్దతుదారులో జిల్లా నుంచి ఐదుగురు ఉండడం విశేషం. వీరిలో నలుగురు ప్రాధమికక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల చైర్మన్లు కాగా మరొకరు వ్యవసాయేతర సంఘం చైర్మన్‌ ఉన్నారు. నోటిఫికేషన్‌ ప్రకారం హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం డీసీసీబీ పాలకవర్గం ఎన్నిక కోసం అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పీఏసీఎస్‌ల నుంచి పదహారు మంది డైరెక్టర్లు ఎన్నికయ్యే ఎ-గ్రూపులో ఎస్సీలు లేకపోవడం వల్ల రెండు డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. నలుగురు డైరెక్టర్లు ఎన్నికయ్యే బి-గ్రూపులో ఎస్టీలు లేకపోవడం వల్ల ఒక డైరెక్టర్‌ పదవికి నామినేషన్లు రాలేదు. దీంతో ఎ-గ్రూపులో 14 డైరెక్టర్లు, బి-గ్రూపులో ముగ్గురు డైరెక్టర్ల స్థానాలకు మాత్రమే అంటే మొత్తం 20 స్థానాలకు 17 పదవులకు సింగిల్‌ నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో నామినేషన్ల దాఖలు, పరిశీలన ముగిసిన తర్వాత 17 డైరెక్టర్‌ పదవులకు ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలైనట్లు జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పదిహేడు స్థానాల నుంచి టీఆర్‌ఎస్‌ మద్దతుతో సింగిల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన 17 మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారి జరిగిన డీసీసీబీ పాలకవర్గం ఎన్నిక ఇది. దరిమిల ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు డీసీసీబీ పాలకవర్గంలో ప్రాతినిథ్యం ఉండేలా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ ఎమ్మెల్యేలు, పీఏసీఎస్‌ల చైర్మన్లతో మాట్లాడి సమన్వయం చేశారు. చివరకు ఊహించినట్లుగానే డీసీసీబీ పాలక వర్గం ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా పక్కా ప్రణాళిక రూపొందించి అమల్లో పెట్టారు. దీంతో డీసీసీబీపై గులాబీ జెండా ఎగిరింది.

జిల్లా నుంచి ఎవరెవరంటే..

డీసీసీబీ పాలకవర్గంలో ఏకగ్రీవమైన పదిహేడు మంది జాబితాలో జిల్లా నుంచి ఐదుగురికి చోటు దక్కింది. ఎ-గ్రూపులో ఎన్నిక ఏకగ్రీవమైన పద్నాలుగు మంది డీసీసీబీ డైరెక్టర్లలో జిల్లా నుంచి సంగెం, మొగిలిచర్ల, పెంచికలపేట, నల్లబెల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు సపావత్‌ కిషన్‌నాయక్‌, దొంగల రమేశ్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి, చెట్టుపల్లి మురళీధర్‌ ఉన్నారు. వీరిలో దొంగల రమేశ్‌, కంది శ్రీనివాస్‌రెడ్డి మొగిలిచర్ల, పెంచికలపేట పీఏసీఎస్‌ల చైర్మన్లుగానూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చెట్టుపల్లి మురళీధర్‌ గతంలో నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికై వరంగల్‌ ఉమ్మడి జిల్లా  పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ నెల 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. డీసీసీబీ చైర్మన్‌గా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని నందనం పీఏసీఎస్‌ నుంచి చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గానూ ఏకగ్రీవమైన మార్నేని రవీందర్‌రావుకు అవకాశం లభిస్తే వైస్‌ చైర్మన్‌గా వరంగల్‌రూరల్‌ జిల్లా నుంచి నల్లబెల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌ పేరును టీఆర్‌ఎస్‌ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం మురళీధర్‌ పేరును పార్టీ నాయకత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. వ్యవసాయేతర సంఘాల నుంచి బి-గ్రూపులో డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికైన ముగ్గురిలో పోలెపాక శ్రీనివాస్‌ గీసుగొండ మండలం పోతరాజుపల్లె గ్రామస్తుడు. 

ఓడీసీఎంఎస్‌ పాలకవర్గంలోనూ..

ఓడీసీఎంఎస్‌ పాలకవర్గంలోనూ జిల్లాకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చింది. మంగళవారం ఓడీసీఎంఎస్‌ పాలకవర్గం ఎన్నిక కోసం అధికారులు నామినేషన్లు స్వీకరించారు. పది స్థానాలకు ఏడు స్థానాల నుంచి నామినేషన్లు దాఖలైనట్లు ప్రకటించారు. ఎస్సీలు, ఇతరులు లేకపోవడం వల్ల ఎ- గ్రూపులో రెండు, బి- గ్రూపులో ఒక స్థానానికి అంటే మొత్తం 3 డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో పీఏసీఎస్‌ చైర్మన్లు ఓడీసీఎంఎస్‌ డైరెక్టర్లుగా ఎన్నికయ్యే ఎ-గ్రూపులోని ఆరుగురు డైరెక్టర్లకు సింగిల్‌ నామినేషన్‌ దాఖలైన ఐదు స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఐదుగురు డైరెక్టర్లలో జిల్లా నుంచి ఖానాపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, పరకాల పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండెబోయిన నాగయ్య ఉన్నారు. వీరిలో గుగులోతు రామస్వామి నాయక్‌ ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవికి రేసులో ఉన్నట్లు తెలిసింది. ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా ఈ నెల 29న జరుగనుంది. ఎస్టీ సామాజికవర్గానికి ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని కేటాయించేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయిస్తే జిల్లాకు చెందిన రామస్వామి నాయక్‌కు ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం కూడా ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదే గాని జరిగితే జిల్లాకు ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది.

Previous Article పెద్దపీట!
Next Article మహర్దశ!

logo