సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Feb 25, 2020 , 03:10:30

నేడు నామినేషన్లు

నేడు నామినేషన్లు

సుబేదారి, ఫిబ్రవరి 24 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలక మండలి ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర కో-ఆపరేటివ్‌ సొసైటీ ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్‌ సహకార కేంద్ర బ్యాంకు పాలకమండలి ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారి మద్దిలేటి ఈ నెల 22న ఎన్నిక నోటీస్‌ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు గాను 90 సంఘాలకు ఈనెల 15న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్‌గా ఎన్నికైనవారు డీసీసీబీ పాలకమండలి ఎన్నికలో ఓటువేస్తారు. అలాగే డీసీసీబీ సభ్యత్వం కలిగి ఉన్న మత్య్స, గొర్రెలు, మేకలు, చేనేత సహకార సంఘాలు 22 ఉన్నాయి. ఈ సంఘాల నుంచి చైర్మన్‌గా ఉన్నవారు కూడా డీసీసీబీ ఎన్నికలో ఓటు హక్కు కలిగి ఉన్నారు. పాలకమండలిలో 22మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఆ తర్వాత ఈ 22 మందిలో ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఈఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు హన్మకొండ అదాలత్‌ డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం ఒకేరోజున నామినేషన్లు దాఖలు చేస్తారు. మొత్తం 112 మంది ఓటర్లలో  90మంది పీఏసీఎస్‌ చైర్మన్లు, 22మంది వ్యవసాయేతర సంఘాల చైర్మన్లు ఉన్నారు. 


ఒకేరోజు నామినేషన్లు, ఉపసంహరణ

డీసీసీబీ పాలక మండలి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మంగళవారం హన్మకొండ డీసీసీబీ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట మధ్య నామినేషన్లు దాఖలు చేయాలి. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ల పరిశీలన, సాయంత్రం 3:30 నుంచి 5గంటల వరకు ఉపసంహరణ , సాయంత్రం వరకు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను గుర్తులను ఎన్నికల అధికారులు కేటాయిస్తారు. 


28న ఎన్నిక.. 

ఈనెల 28న డీసీసీబీ పాలకమండలి 22 మంది డైరెక్టర్లకు ఎన్నిక జరుగుతుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్‌ , ఆతర్వాత లెక్కింపు, సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడి, మరుసటి రోజు 29న పాలకమండలి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఉంటుంది.


logo