మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 24, 2020 , 03:38:36

‘పట్టణప్రగతి’ని విజయవంతం చేద్దాం

‘పట్టణప్రగతి’ని విజయవంతం చేద్దాం

అర్బన్‌ కలెక్టరేట్‌/సిద్ధార్థనగర్‌, ఫిబ్రవరి 23: పల్లెప్రగతి స్ఫూర్తి, సమన్వయంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదివారం ఆర్‌ఈసీ సమీపంలోని మయూరి గార్డెన్‌లో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి అధ్యక్షతన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి  ముఖ్య అతిథులుగా పట్టణ ప్రగతి వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జి మంత్రి సత్యవతితో పాటు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. నగరంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో సోమవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు 10 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను, ప్రజాప్రతినిధులను, డివిజన్‌ కమిటీల సమక్షంలో సమస్యలు, అభివృద్ధి పనులను గుర్తించాలని చెప్పారు.


డివిజన్‌ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని, ఇందుకు నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పట్టణ ప్రగతికిగాను ప్రతి డివిజన్‌ పరిధిలో స్థానికులు, మేధావులు, మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌, యువకులతో కలిసి ఒక్కొక్క కమిటీలో 15 మంది చొప్పున 4 కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌,  మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారని ఆమె పేర్కొన్నారు. పట్టణ ప్రగతికి ప్రతినెలకు రూ.70కోట్లు విడుదల చేస్తూ, జనాభా దామాష ప్రకారం కేటాయింపులు జరుగుతాయన్నారు. ముఖ్యంగా డివిజన్‌ పరిధిలో పారిశుధ్యం, హరితహారం, విద్యుత్‌ సమస్యలు, చెత్తసేకరణ, డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, తదితర సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం నిర్ధిష్ట ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ ఏడాది కాలం కార్పొరేటర్లకు కీలకమని, భవిష్యత్‌లో మం చి అవకాశాలు లభించాలంటే ఈ కార్యక్రమం ప్రామాణికం అవుతదని చెప్పారు. పది రోజులు శ్రద్ధతో, పోటీపడి డివిజన్‌ తో పాటు నియోజక వర్గ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు.  


సమస్యలకు శాశ్వత పరిష్కారం

పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణంలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పల్లెప్రగతితో గ్రామాల రూపు రేఖలు మారినట్లుగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో డివిజన్ల రూపురేఖలు మారాలని ఆయన పిలుపునిచ్చారు. పల్లెప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు ఇవ్వగా పట్టణ ప్రగతికి రూ. 70 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రగతికి నిధుల  కొరత లేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామం చేసి అందరితో చర్చించి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అన్ని డివిజన్లలో పర్యటిస్తానన్నారు. పట్టణ ప్రగతిలో పనిచేసిన వారికి మంచి గుర్తింపు ఇస్తామని, పని చేయకపోతే పదవి నుంచి సస్పెండ్‌ చేసే అధికారం సీఎం కేసీఆర్‌ కలెక్టర్లకు ఇచ్చారని అన్నారు. హైదరాబాద్‌ తర్వాత రెండో అతి పెద్ద నగరమైన వరంగల్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అందరం పని చేద్దామన్నారు. ప్రతి ఇంటికి తడిపొడి చెత్త సేకరణకు వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి షాపు ముందు చెత్త డబ్బాలు ఏర్పాటు చేయాలని, ఖాళీ ప్లాట్లను శుభ్రం చేయాలని ముందస్తుగా నోటీసులు జారీ చేయాలన్నారు. ఎవ్వరి ఇంటి ముందుగాని, షాపుల ముందుగాని చెత్తవేస్తే కనిపిస్తే జరిమానా విధించాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 10 వార్డులను మాజీ ఉప ముఖ్య మంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, 9వార్డులను ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డికి, ఏడు వార్డులను కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి పట్టణ ప్రగతి ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారన్నారు. 


 విజయవంతం చేద్దాం

అందరి భాగస్వామ్యంతో పట్టణ ప్రగతిని విజయవంతం చేద్దామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ ఏ కార్యక్రమం ఇచ్చినా విజయవంతం చేసిన ఘనత పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఉందన్నారు. పట్టణ ప్రగతితో ఎన్నో ఏళ్లుగా  పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. వైకుంఠధామాల కోసం ప్రభుత్వ భూమి లేకుంటే ప్రైవేట్‌ స్థలంలో నిర్మిద్దామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు. కార్పొరేటర్లు పట్టణ ప్రగతిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 10 రోజుల్లో మంత్రి కేటీఆర్‌ వచ్చే అవకాశం ఉందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ ఉపశమన కమిటీ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 
logo