సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Feb 23, 2020 , 03:22:47

అక్షర మహావృక్షం

అక్షర మహావృక్షం
  • తరాల వారధి.. తరగని గని
  • ఓరుగల్లు సిగలో మణిహారం
  • వజ్రోత్సవ విద్యాకుసుమం ఏవీవీ

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చందా కాంతయ్య ఇవ్వాల్టి తరానికి వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో విగ్రహం. కానీ అదొక విజయసంకేత చిహ్నం. భవిష్యత్‌ను దర్శించిన దారిదీపం. మనసు పులకించే పరిమళం. నిలువనీయని కాలంలోనే తను నిలబడటమే కాదు అక్షరాన్ని నిట్టనిలువునా నిలబెట్టిన మహా శిక్షరం ఆయన. ఒంటిచేత్తో వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగిన మహావృక్షమది. గతం నుంచి భవిష్యత్‌ను దర్శించిన దార్శనికుడు కావడం వల్లే ఇవ్వాళ అతడు నిష్కామ కర్మయోగిగా నిలిచారు. ఆంధ్రా విద్యాభివర్థిని 75 ఏండ్ల క్రితం ఒక పసిమొగ్గ. కానీ అదే ఇవ్వాళ జిల్లా గుండెలో నిలిచి గెలివటం మాత్రమే కాదు ఎగరేసిన కీర్తి చంద్రిక. ఎల్లెడెలా వ్యాపించిన విద్యాశిఖరం. చందా కాంతయ్యది నిజమైన వజ్ర సంకల్పం. ఆయన స్థాపించిన ఆంధ్రా విద్యాభివర్థిని సంఘం (ఏవీవీ)75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.  


ఏవీవీ నేపథ్యం

నిజాం కాలంలో అనేక రకాలుగా అణచివేతకు గురైన తెలంగాణ వాసులను విద్యాపరంగా ముందంజలో ఉంచడం కోసం 1944లో విద్యాలయాల స్థాపనకు దిశా నిర్దేశం చేయడానికి తాండ్ర వెంకట్రామనర్సయ్య, వద్దిరాజు రాజేశ్వర్‌రావు, జమలాపురం గోపాల్‌రావు, రామిని మృత్యుంజయ లింగం, చెరకు కాంతయ్య, భూపతి కృష్ణమూర్తి, ఎంఎస్‌ రాజలింగం వంటి ప్రముఖులతో కీర్తిశేషులు చందాకాంతయ్య ఆంధ్రవిద్యాభివర్థిని (ఏవీవీ) సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అప్పటి దాకా ఉర్దూ మాధ్యమంలోనే విద్యా బోధన సాగుతున్న కాలంలో నిజాం నవాబును మెప్పించి ఏవీవీ ఉన్నత పాఠశాల ఏర్పాటును 1945లో స్థాపించారు. ఈ ఏవీవీ ద్వారా వరంగల్‌ జిల్లా వాసులకే కాకుండా, అనేకమంది ఇతర జిల్లా వాసులకు కూడా తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించే అవకాశం లభించింది. ఈ పాఠశాలను నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అజం జంగ్‌ ఈ పాఠశాలకు అనుమతిని ఇవ్వాల్సిన అనివార్యతలు కల్పించడంలో చందా కాంతయ్య చూపిన చొరవ అపూర్వం. అజరామరం. పాఠశాల స్థాపనకు, విద్యాబోధన విస్తరణకు శ్రీకారం చుట్టిన చందా కాంతయ్యకు ఆజం జంగ్‌ ‘అవ్వల్‌ దర్జీ’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. 


ఎందరో మహానుభావులు

1945లో ఏర్పాటైన ఏవీవీ ఉన్నత పాఠశాల చందా కాంతయ్య ఆశించిన విధంగా పనిచేస్తూ క్రమశిక్షణ, విలువలతో కూడుకున్న విద్య విద్యార్థి లోకానికి చేరువయ్యే విధంగా ఎందరో మహానుభావులు కృషి చేశారు. వారిలో వైకే శాస్త్రి, కారుమంచి కొండల్‌రావు, హరి రాధాకృష్ణమూర్తి, వైద్యనాథ్‌, ముకుందరావు, విశ్వనాథ వెంకటేశ్వర్లు, భండారు చంద్రమౌళీశ్వర్‌రావు, బండారు నాగభూషన్‌రావు, దెందుకూరి సోమేశ్వర్‌రావు వంటి ఎంతో మంది ఉద్ధండులైన విద్యావేత్తలు తొలితరం ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఇక మలితరం అధ్యాపక వర్గంలో టీఏ రామారావు, గుమ్మడవెల్లి సూర్యనారాయణ, రత్నం, వేమూరి శ్రీనివాసమూర్తి, వెంకట్రాజం, అప్పె జగన్మోహన్‌శర్మ , బాలాదేవి, వాసుదేవ్‌ వంటి వారు ఏవీవీ ఉన్నత పాఠశాల కీర్తి ప్రతిష్టలను దశ దిశలా వ్యాప్తి చేశారు.   

ఏవీవీ మహావిద్యా వృక్షంగా..

 1944లో పురుడుపోసుకున్న ఏవీవీ సంస్థ. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మకుటాయమానంగా నిలిచింది. 1944లో ప్రస్తుతం దుర్గేశ్వరాలయ గుడివీధిలోని నందయ్య గారి దొడ్డిలో కేవలం నాలుగైదు పదుల సంఖ్య గల విద్యార్థులతో ప్రారంభమైంది. 

1945లో నేరేళ్ల ప్రాంగణం (ప్రస్తుతం కాకతీయ టాకీస్‌) ప్రాంతానికి మారింది. 

 1951లో ఏవీవీ ఎయిడెడ్‌ సంస్థగా రూపాంతరం చెందింది. 

1958లో మల్టీ పర్పస్‌ స్కూల్‌గా గుర్తింపు.

1970లో ఏవీవీ సంఘం ఆధ్వర్యంలో పూర్తిగా సంఘం నిర్వహణలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు 

1977లో జూనియర్‌ కాలేజీకి సైతం ఎయిడెడ్‌ హోదా 

 1991లో డిగ్రీ కళాశాల ఏర్పాటు 

2007లో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పీజీ కళాశాలగా ఉన్నతీకరణ.  

పదుల నుంచి వేల కొలదిగా... 

పాఠశాల స్థాయిలో ప్రారంభమైన విద్యా కుసుమం అంచెలంచెలుగా ఎదుగుతూ, విస్తరిస్తూ మహావటవృక్షంగా ఏవీవీ రూపాంతరం చెందింది. పాఠశాల స్థాయిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు విద్యాభ్యాసం చేసే అవకాశం నుంచి జూనియర్‌, డిగ్రీ కాలేజీలతోపాటు పీజీ స్థాయికి విస్తరించి వేలాది మందికి చందా కాంతయ్య కలకల పంటగా ఖ్యాతి పొందింది. ఇంటర్మీడియెట్‌, ఉన్నత విద్యా స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, బీఏ, బీకాం, బీకాం (కంప్యూటర్స్‌), బీఎస్సీ, ఎంకాం వంటి కోర్సుల్లో ప్రవేశావకాశాల్ని కల్పిస్తూ, వరంగల్‌ మహా నగరంలో పేరెన్నికగన్న విద్యా సంస్థగా గుర్తింపు పొందాయి. ఇప్పటి వరకు ఏవీవీ విద్యాసంస్థ నుంచి 38వేల మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌ను తీర్చిదిద్దుకున్నారు. ఇందులో ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల విద్యార్థులదే సింహభాగం. 28వేల మంది విద్యార్థులు ఈ రెండు సంస్థల్లో ప్రయోజకులు అయితే 7వేల మంది డిగ్రీ, పీజీ పట్టభద్రులు కావడం విశేషం. 

ఏవీవీ నుంచి ఎదిగినవారెందరో..

ఏవీవీ విద్యా సంస్థల నుంచి ఓనమాలు నేర్చుకొని ఉన్నత శిఖరాలవైపు పయనం అయిన వారెందరో ఉన్నారు. దేశంలో అత్యున్నత సర్వీస్‌ అయిన ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో చేరి ఓరుగల్లు ఖ్యాతిని దశదిశలా చాటినరెందరో ఉన్నారు. అందులో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ సర్వీస్‌ల్లో చేరి వివిధ రాష్ర్టాల్లో సేవలు చేసిన వారిలో..

1) డీ. చక్రపాణి ఐఏఎస్‌ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా పనిచేశారు. రిటైర్‌ అయ్యారు)

2) ముదిగొండ వీరభద్రయ్య, ఐఏఎస్‌ (రిటైర్డ్‌)

3) భండారు ఉమామహేశ్వరరావు, ఐఏఎస్‌ (రిటైర్డ్‌), ప్రస్తుతం 


తెలంగాణ రాష్ట్ర పీఆర్‌సీ సభ్యులు 

4) బీవీ పాపారావు ఐఏఎస్‌ (రిటైర్డ్‌), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 

5) మన్నేం నాగేశ్వరరావు, ఐపీఎస్‌, సీబీఐ ఇన్‌చార్జీ డైరెక్టర్‌గా కొద్దికాలం  

పనిచేశారు. 

6) చిద్ర ఓంకారేశ్వరరావు, ఐఆర్‌ఎస్‌ ఇలా అనేక మంది ఏవీవీ గాలి పీల్చి, ఇక్కడ చెట్ల కింద, తరగతి గదుల్లో ఒదిగి ఎదిగిన ఎంతోమంది ఉన్నారు. అలా ఎదిగినవారిలో ఆచార్య మాఢభూషి శ్రీధరాచార్యులు, జాతీయ సమాచార హక్కు కమిషనర్‌గా పనిచేశారు. 

రాజకీయాల్లో   లెక్కలేనంత మంది 

ఏవీవీ విద్యా సంస్థల నుంచి ఎదిగిన వచ్చిన ఎంతోమంది రాజకీయ నాయకులుగా రానించారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేకతను చాటుకున్న వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిగా వ్యవహరించిన దాస్యం ప్రణయభాస్కర్‌, మాజీ మంత్రి మదన్‌మోహన్‌ వంటి వాళ్లు ఇక్కడే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్‌గా వ్యవహరించిన బొల్లం సంపత్‌కుమార్‌, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం ఇలా చెప్పుకుంటూ పోతే స్థానిక సంస్థల్లో వందకు పైగా కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, సర్పంచ్‌లుగా వివిధ హోదాల్లో వెలుగులీనుతున్నారు.  

మూడు రోజుల ముచ్చటైన పండుగ 

విద్యా రంగ సేవలో గడిచిన 75 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లను ఒకవైపు ఎదుర్కొంటూనే మరోవైపు ప్రభుత్వ విధానాల పరంగాను, సమాజ పరంగాను వస్తూ ఉన్న మార్పుల్ని స్వీకరిస్తూనే అనుక్షణం సవాళ్లను స్వీకరిస్తూ రానున్న రోజుల్లో విద్యా రంగంలో మరింత క్రియాశీలంగా నడుచుకొంటూ, సగర్వంగా ఏవీవీ విద్యా సంస్థల్ని ముందుకు సాగుతుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణాన్ని మననం చేసుకుంటూనే చరిత్రలో నిలిచిపోయేవిధంగా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈనెల 23, 24, 25 ఈ మూడు రోజుల్లో పూర్వ విద్యార్థుల సంఘం, ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వ్యాపార వాణిజ్య రంగాల ప్రముఖుల సమ్మిళిత భాగస్వామ్యంగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఏవీవీ విద్యా సంస్థల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నారు. 

ఏవీవీ హైస్కూల్‌ హెడ్‌మాస్టర్లు

 వైద్యనాథ్‌ అయ్యర్‌ 1944-1945

 సుబ్బారాయుడు 1945-1947

 సౌందర్‌రాజన్‌ 1947-1948

 వైకే శాస్త్రీ 1948-1966

 డీ సోమేశ్వర్‌రావు 1966-1970

ఏవీవీ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్స్‌

 డీ సోమేశ్వర్‌రావు 1970 నుంచి  15-06-1976

 టీఏ రామారావు 16-06-1976 నుంచి 31-01-1985

 కే మోహన్‌రావు 01-02-1985 నుంచి  31-10-1985

 వీ దామోదర్‌రెడ్డి 01-11-1985 నుంచి 11-12-1987

 కే మోహన్‌రావు 12-12-1987 నుంచి 12-12-1991

 పీ బాలసుబ్రహ్మణ్యం 07-08-1998 నుంచి 28-02-2001

 ఏఆర్‌సీ కుమారవర్మ 01-03-2001 నుంచి  19-12-2002

 ఆర్‌ రామమోహన్‌ శర్మ 20-12-2002 నుంచి 31-07-2005

 టీ జయశ్రీ 01-08-2005 నుంచి 30-11-2007

 డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 01-12-2007 నుంచి 08-08-2008

 బీ వెంకటేశ్వర్‌ రావు 08-08-2008 నుంచి 31-01-2013

 డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 01-02-2013 నుంచి 24-01-2014

 డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ ప్రసాద్‌ 25-01-2014 నుంచి 31-01-2014

 డీ రఘుపతి 01-02-2014 నుంచి 12-12-2017

 డాక్టర్‌ ఎస్‌.అనిత 13-12-2017 నుంచి 28-10-2018

 డీ రఘుపతి 29-10-2018 నుంచి 30-06-2019

డాక్టర్‌ ఏ భుజేందర్‌రెడ్డి 01-07-2019 నుంచి ప్రస్తుతం..

వ్యక్తిపేరు మీద సర్కార్‌ ప్రసూతి దవాఖాన 

ఒక ప్రభుత్వ హాస్పిటల్‌కు ఒక స్థానిక వ్యక్తి పేరు పెట్టడం చరిత్రలోనే విశేషం, అపూర్వం. అటువంటి విశేషమైన సేవలు అందించిన మాతృహృదయులు ఆచార్య చందా కాంతయ్య. తన పెద్దబిడ్డ ఓంకారేశ్వరి జనన సమయంలో నిజాం సర్కారియా హాస్పిటల్‌లో హృదయ విదారక సన్నివేశం చందా కాంతయ్యను కదిలించి వేసింది. తన బిడ్డ కాన్పు సమయంలో దవాఖానలో చోటుచేసుకున్న దయనీయ దృశ్యం మరే బిడ్డకు రాకూడదని భావించిన చందా కాంతయ్య వరంగల్‌లోని ప్రతీ బిడ్డ... తన బిడ్డే అనుకున్నాడు ఆ కష్టాలను కడతేర్చేందుకు తక్షణం రోగుల కోసం రెండు జనరల్‌ వార్డులు, సేవచేసే నర్సుల కోసం రెండు క్వార్టర్లు, ప్రాణాలు కాపాడే డాక్టర్ల కోసం క్వార్టర్లు కట్టించారు. మరెవరన్నా అయితే డాక్టర్లనీ, వాతావరణాన్ని, ప్రభుత్వాన్ని నిందించడంలోతమ పాండిత్యమంతా చూపించేవారు. కానీ చందా కాంతయ్య అలా నిందిస్తూ, నిందలేస్తూ కూర్చొకుండా ప్రసూతి దవాఖాన నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన వైద్యసేవానిరతిని అర్థం చేసుకున్న నాటి రాష్ట్రమంత్రిగా ఉన్న, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చందా కాంతయ్య మెమోరియల్‌ హాస్పిటల్‌ (సీకేఎం ప్రసూతి ఆస్పత్రి)గా నామకరణం (1969లో కాంతయ్య మరణం అనంతరం) చేయించారు.  


logo