గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 23, 2020 , 03:20:50

అధికారులపై కౌన్సిల్‌ ఫైర్‌

అధికారులపై కౌన్సిల్‌ ఫైర్‌

వరంగల్‌,నమస్తేతెలంగాణ: వరంగల్‌ మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా చెప్పుకుంటున్న నగరంలో అభివృద్ధి నత్త నడకన సాగుతుండటంపై కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా డివిజన్లలో ఏ అభివృద్ధి పని కావడం లేదన్నారు. కౌన్సిల్‌ తీర్మానాలను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మరో ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల మధ్యకు  ఎలా పోవాలంటూ కార్పొరేటర్లు ప్రశ్నించారు. శనివారం మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన గ్రేటర్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం 11.30 నుంచి 3 గంటల వరకు  కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. అధికార పక్ష సభ్యులే విపక్ష సభ్యులుగా మారారు. కౌన్సిల్‌ సమావేశం ప్రారంభం కాగానే ఒక్కసారిగా కార్పొరేటర్లు డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను నిలదీశారు. 


నాలుగేళ్ల క్రితం డివిజన్‌ రూ. 50 లక్షలు మంజూరు చేసిన పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని, వేసవి కాలం దృష్టిలో పెట్టకొని మంజూరు చేసి రూ.2 లక్షల నామినేషన్‌ పనులపై అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో  రెండు రోజుల్లో పట్టణ ప్రగతి పేరుతో డివిజన్‌ ప్రజల వద్దకు ఏ ముఖంతో పోవాలంటూ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల కౌన్సిల్‌ సమావేశాల్లో  తీసుకుంటున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఒక దశలో కౌన్సిల్‌ సమావేశం దారి తప్పుతున్న పరిస్థితుల్లో చీఫ్‌విప్‌ దాస్యం  వినయ్‌ భాస్కర్‌  చక్కదిద్దారు. అన్ని సమస్యలు పట్టణ ప్రగతిలో పరిష్కారం అవుతాయని కార్పొరేటర్లకు సర్థిచెప్పారు. నగరాభివృద్ధికి నిధుల మంజూరు కోసం మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను కార్పొరేటర్లు కలవాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సీఏఏ,ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కౌన్సిల్‌ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.


అధికారుల తీరుపై మండిపాటు

కార్పొరేషన్‌ అధికారుల తీరుపై కార్పొరేటర్లు మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇస్తూ కమిషనర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. కౌన్సిల్‌ సమావేశాల్లో చేసిన తీర్మానాలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో పదేపదే చెప్పుకుంటూ వచ్చినా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పట్టించుకోవడం లేదని పలువురు కార్పొరేటర్లు అధికారుల తీరును ఎండగట్టారు. మురికివాడల్లో పేదలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసుకొని సంవత్సరాలు గడుస్తున్నా..బిల్లులు చెల్లించకుం డా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు కార్పొరేటర్లు అధికారులపై మండిపడ్డారు. లీకేజీల మరమ్మతులు చేయడానికి నెలల సమయం తీసుకుంటున్నారన్నారు.  దీంతో డివిజన్లలో తిరుగలేక పోతున్నామని  కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


సీఏఏ,ఎన్‌సీసీకి వ్యతిరేకంగా తీర్మానం

కేంద్రం తీసుకొస్తున్న సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టానికి వ్యతిరేకంగా బల్దియా సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. టేబుల్‌ ఎజెండాలో ఈ అంశాన్ని కౌన్సిల్‌ సమావేశం ముందు కు తీసుకొచ్చారు. దీనిపై సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. 30వ డివిజన్‌ కార్పొరేటర్‌  బోడ డిన్నా ఈ అంశాన్ని టేబుల్‌ ఏజెండాగా కౌన్సిల్‌ సమావేశం ముందుకు తీసుకొచ్చారు. దీనితో పాటు కార్పొరేషన్‌కు అభివృద్ధి నిధుల మంజూరు కోసం మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలువాలని సభ్యుల డిమాండ్‌ మేరకు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసింది. మంత్రి కేటీఆర్‌ అపాయింట్‌మెంట్‌ తేదీని ఖరారు చేసిన తర్వాత కార్పొరేటర్లను మంత్రి వద్దకు తీసుకెళ్లడానికి కౌన్సిల్‌లో తీర్మానం చేశారు.


ఇన్‌చార్జి సీపీపై మేయర్‌ ఫైర్‌

ఆక్రమణదారులకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సపోర్ట్‌ చేస్తున్నారు...వెంటనే మెమో ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఇన్‌చార్జి సిటీ ప్లానర్‌ను మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు మందలించారు. వెంటనే సదరు బిల్డింగ్‌  ఇన్‌స్పెక్టర్‌కు మెమో ఇవ్వాలని అన్నారు. మేయర్‌ అంటే నిర్లక్ష్యమా..సరెండర్‌ చేసానంటూ మండిపడ్డారు.


logo
>>>>>>