బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 21, 2020 , 04:00:25

పల్లె మురవాలె.. పట్నం మెరవాలె..!

పల్లె మురవాలె.. పట్నం మెరవాలె..!

పట్టణాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి విజయాల స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతితో పల్లెలు మురుస్తున్నాయి.

  • ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు
  • రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
  • శాఖల మధ్య సమన్వయం ఉండాలి
  • రాష్ట్రంలో జిల్లా నంబర్‌వన్‌గా నిలవాలి
  • నిధుల కొరత లేదు.. నిర్లక్ష్యం వద్దు
  • కష్టపడే కార్పొరేటర్లకే ఫలితం
  • జిల్లాకు సారొచ్చే అవకాశం ఉంది

వరంగల్‌, నమస్తేతెలంగాణ: పట్టణాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి విజయాల స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతితో పల్లెలు మురుస్తున్నాయి. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు మెరవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. గురువారం హంటర్‌రోడ్‌లోని అభిరామ్‌ గార్డెన్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అధ్యక్షతన జరిగిన అర్బన్‌ జిల్లా పంచాయతీరాజ్‌ సమ్మేళనం, పట్టణ ప్రగతి అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది రోజుల పట్టణ ప్రగతి ద్వారా ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. పట్టణ ప్రగతి ద్వారా హైదరాబాద్‌ కార్పొరేషన్‌ మినహాయించి రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కలిపి ప్రతినెలా రూ.70కోట్లు మంజూరు చేయనున్నారని అన్నారు. పల్లె ప్రగతిద్వారా పల్లెల్లో కనిపించిన మార్పు పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలలో కనిపించాలన్నారు. పట్టణ ప్రగతిలో కార్పొరేటర్లే కీలకమన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని అన్నారు. పట్టణ ప్రగతిని వినియోగించుకొని కార్పొరేటర్లు డివిజన్‌ల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. 

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిలో ముందుకు పోవాలని అన్నా రు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులను ప్రకటించిందని అన్నారు. 


అయితే నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతికి ప్రతినెలా రూ.339కోట్లు ఇస్తున్నారని అన్నారు. పట్టణ ప్రగతిని ఛాలెంజ్‌గా తీసుకొని అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.  ఇప్పటికే పంచాయతీ రాజ్‌ చట్టం సవరించి కొత్త చట్టం తీసుకువచ్చామని, రాబోయే రోజుల్లో కొత్త మున్సిపల్‌ చట్టం రాబోతుందన్నారు. కష్టపడి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పదవులు ఊడుతాయని ఆయన హెచ్చరించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో 80శాతం అభివృద్ధి జరిగిందని, ఇంకా 20శాతం జరగాల్సి ఉందన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటిక కోసం స్థలం కొనుగోలు చేశామని, మిగతా 20శాతం గ్రామాల్లో వాటిని కొనుగోలు చేసేలా సర్పంచ్‌లు ముందుకు పోవాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పల్లె ప్రగతికి వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి ద్వారా పారిశుధ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణ ప్రగతి ద్వారా మోడల్‌ మార్కెట్లు, శ్మశాన వాటికల నిర్మాణాలకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణాలను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలన్నారు. 


సారొచ్చే అవకాశం 

రాష్ట్ర సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా ఈనెల 24 నుంచి చేపట్టనున్న పట్టణ ప్రగతి, పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొ నేందుకు సీఎం కేసీఆర్‌ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. ఎక్కడికి వస్తారో, ఏ గ్రామంలో నిద్రిస్తారో ముందస్తు సమాచారం లేదని,  దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో అభివృద్ధి మార్కు కనిపించేలా సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి డివిజన్‌లో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి 60మంది సభ్యులను నియమించి అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి ముందుకు సాగుతుందన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్‌ వార్డు కమిటీలను ఏర్పాటు చేశారన్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు బాధ్యతగా గుర్తించి తమ డివిజన్లను అభివృద్ధిలో ముందుంచాలని అన్నారు. కార్యక్రమంలో జేసీ దయానంద్‌, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, డిప్యూటీ మేయర్‌ ఖాజా సిరజుద్దీన్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శ్రీరాములు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


డివిజన్‌కో ప్రత్యేక అధికారి

ఆర్జీ  హన్మంతు, కలెక్టర్‌పట్టణ ప్రగతి కోసం ప్రతి డివిజన్‌కు ఒక నోడ ల్‌ అధికారిని ఏర్పాటు చేశాం. పదిరోజుల పాటు సాగే పట్టణ ప్రగతిలో రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా 2020-21బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగనుంది. పల్లె ప్రగతిలో అనుభవం ఉన్న అధికారులను పట్టణ ప్రగతికి డివిజన్‌ అధికారులుగా నియమించాం. ఇది నిరంతర ప్రక్రి య. పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి సో పానం కానుంది. 


పల్లెప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలి.. సుధీర్‌కుమార్‌, అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌

పల్లె ప్రగతిని ఆదర్శంగా తీసుకొని పట్టణ ప్రగతిని ముందుకు తీసుకుపోవాలి. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో చాలా మార్పు జరిగింది.  పచ్చదనం, పరిశుభ్రత గ్రామాల్లో పరిఢవిల్లుతోంది. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణాలు జరుగుతున్నాయి.  సంక్షేమ పథకాలపై ప్రజలు చర్చించుకునేలా వారిలో చైతన్యం తీసుకురావాలి. పట్టణ ప్రగతిలో ప్రజలను భాగస్వామ్యం చే యాలి. ఆరోగ్య పట్టణాలుగా ప్రణాళికలు రూపొందించాలి. 


మన పథకాలపై దేశం అధ్యయనం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ

అనేక రాష్ర్టాలు మన పథకాలపై అధ్యయనం చేస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షతకు నిదర్శనం. వేసవిలో రాష్ట్రంలోని చెరువులు మత్తడి పడుతున్నాయి. కాళేశ్వరం ఒక మహా అద్భుతం. గత ప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే తెలంగాణ సర్కారు బలోపేతం చేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి. పట్టణ ప్రగతి కార్పొరేటర్లకు అందివచ్చిన మంచి అవకాశం.  


60 రోజుల్లో పట్టణాల్లో ప్రభావిత అభివృద్ధి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అరవై రోజుల్లో పట్టణాల్లో ప్రభావిత అభివృద్ధి కనిపించాలి. ఈవేసవి కాలంలోనే పట్టణాల్లో స్పష్టమైన అభివృద్ధి ప్రజల ముందుండాలి.  రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ప్రతి ఎన్నికల్లో ఆ శీర్వదిస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతోనే  ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.  లక్ష జనాభాకు ఒక మోడల్‌ మార్కెట్‌ ఉండేలా ప్రణాళికలు చేయాలి. పబ్లిక్‌ టాయిలెట్లు, మురికి వాడల అభివృద్ధికి పట్టణ ప్రగతిలో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. 


పట్టణ ప్రగతి అభివృద్ధికి వేదిక దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి అభివృద్ధికి వేదికగా నిలువనుంది. కార్పొరేటర్లు క్రియాశీలకంగా పనిచేసి అభివృద్ధి చేసుకోవాలి. పల్లె, పట్టణ వాతావరణానికి ఎంతో తేడా ఉంది. వాటిని సమతుల్యం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. పనిచేసే ఉత్సాహం ఉన్న వారిని వార్డు కమిటీల్లో నియమించాలి. చిరు వ్యాపారస్తులను, స్ట్రీట్‌ వెండర్లను పట్టణ ప్రగతిలో భాగస్వామ్యం చేయాలి. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతోంది. 


పట్టణ ప్రగతితో అన్ని డివిజన్ల అభివృద్ధి నన్నపునేని నరేందర్‌, తూర్పు ఎమ్మెల్యే

పట్టణ ప్రగతి ద్వారా గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో సమగ్ర అభివృద్ధి జరుగనుంది. కార్పొరేటర్లు బాధ్యతగా పనిచేసి డివిజన్ల అభివృద్ధికి ప్రణాళికలు చేయాలి. పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి ఎంతో దోహదపడుతుంది. పట్టణాల సమగ్రాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు. దీన్ని ప్రజా ప్రతినిధులు వినియోగించుకొని నగరంలోని మురికి వాడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేయాలి. 


విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అరూరి రమేశ్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే

కార్పొరేషన్‌లో విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేయాలి. విలీన గ్రామాల్లో ఇప్పటికీ అభివృద్ధి ఛాయ లు కనిపించడం లేదు. పట్టణ ప్రగతి ద్వారా ప్రత్యేక ప్రణాళికలు చేసి అభివృద్ధికి బాటలు వేయాలి. వర్ధన్నపేట నియోజకవర్గంలోని 32గ్రామాలు గ్రేటర్‌ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి చేయాలి. 


పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి టీ రాజయ్య, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే

పట్టణాల అభివృద్ధి కోసం సీఎం ఆలోచనల నుంచి పుట్టిన పట్టణ ప్రగతి నిధుల ద్వారా అభివృద్ధికి ప్రణాళికలు చేయాలి. పట్టణ ప్రగతికి, పల్లె ప్రగతికి నిధుల కొరత లేదు. విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. పల్లె ప్రగతి తర్వాత గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు కనిపిస్తున్నాయి. అదే బాటలో పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో అభివృద్ధి బాటలు వేయాలి. నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు చేపట్టాలి. 


గుంతలులేని నగరంగా తీర్చిదిద్దుతా.. గుండా ప్రకాశ్‌రావు, నగర మేయర్‌

వరంగల్‌ను గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దుతా.  మురికి వాడల అభివృద్ధికి బల్దియా బడ్జెట్‌లో 1/3 కేటాయించనున్నాం. పది శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయిస్తున్నాం. పట్టణ ప్రగతి నగరాభివృద్ధికి బాటలు వేయనుంది. డివిజన్ల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని నగరాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తాం. ఇప్పటికే వార్డు కమిటీల ఏర్పాటు పూర్తి చేశాం.  


సంక్షేమ పథకాల్లో రాష్ట్రం నంబర్‌వన్‌ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తోంది. రాష్ట్రంలోని అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం. నిరంతర అభివృద్ధి ఆలోచనలతో సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా సమన్వయంతో ముందుకు పోవాలి. పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కీలక భూమిక పోషించాలి. 


logo
>>>>>>