బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 20, 2020 , 02:56:40

మహా అద్భుతం..కాళేశ్వరం ప్రాజెక్టు

మహా అద్భుతం..కాళేశ్వరం ప్రాజెక్టు

రెడ్డికాలనీ, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతంగా ఉందని రామన్‌ మెగసెస్‌, స్టాక్‌హోం, వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా డాక్టర్‌ రాజేంద్రసింగ్‌జీ అన్నారు.  కాకతీయ విశ్వవిద్యాలయ సెనెట్‌ హాల్‌లో బుధవారం రిజిస్ట్రార్‌ కే పురుషోత్తం అధ్యక్షతన ‘జల సాక్షారత, నదుల హక్కులు బాధ్యతలు’ అనే అంశంపై డాక్టర్‌ రాజేంద్రసింగ్‌జీతో విస్తృత ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు గోదావరిలో చుక్క నీరు ఉండకపోయేదని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మహాసముద్రాన్ని తలపిస్తుందన్నారు. సుమారు 40, 50 కిలోమీటర్ల మేర నీళ్లు ఉండటం చాలా గొప్ప విషయమన్నారు. నీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. అంతదూరం నుంచి నీటి ఖర్చుపెట్టుకుని తెచ్చుకుంటున్నామని, నీటిని వరి పంటలకు వాడకుండా రైతులకు ఇతర పంటలకు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.  అలాగే ఏ సెక్టార్‌కు ఎంత నీటిని కేటాయించాలనేది వాటర్‌ బడ్జెట్‌ ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ ఫ్రెష్‌ అవుతుందని ఆయన సూచించారు. 


తెలంగాణ రాష్ట్రం చేపట్టిన దేవాదుల, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలు చాలా ప్రశంసించదగినవి పేర్కొన్నారు. నీటి దుర్వినియోగం కాకుండా చూడాలని, తక్కువ నీటితో జరిగే వ్యవసాయం చేపట్టాలని, వరి పంటను తగ్గించి తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఎంతో ఖర్చుతో ఎత్తిపోతల ద్వారా పొందిన నీటిని నిర్ణయాత్మకంగా వాడుకోవాలన్నారు. వర్షపునీరు, పంట మార్పిడి అనుగుణంగా వ్యవసాయం చేపట్టాలన్నారు. రోజురోరోజుకు భూగర్భజల నీటిమట్టం పడిపోతుందని, విచ్చలవిడిగా వినియోగిస్తున్న నీటి వనరులపై పరిమితి అవసరం అన్నారు. జల దుర్వినియోగం 150 ఏళ్ల నుంచి కొనసాగుతున్నదని, అది 90 సంవత్సరాల నుంచి బాగా పెరిగి ఇప్పుడు విషమస్థితికి చేరిందన్నారు. నీటి నిల్వలు తగ్గిపోవడంపై ఆయన బాధను వ్యక్త పరిచారు. ప్రజల వలసల ప్రభావం నీటి లభ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు.


పెరిగిపోతున్న జల దుర్వినియోగం..

జల దుర్వినియోగం 150ఏళ్ల నుంచి కొనసాగుతుందన్నారు. విద్యార్థులు మార్పు తీసుకురాగలరని, నది శక్తి, నారి శక్తి చాలా గొప్పదన్నారు. 2019 లెక్కల ప్ర కారం 17 రాష్ర్టాలు, 365 జిల్లాలు నీటి సమస్య, కరువును ఎదుర్కొంటున్నాయన్నారు. 190 జిల్లాలను వరదలు ప్రభావితం చేశాయన్నారు. నది పరివాహక ప్రాం తాలను సంరక్షించాలని, భూగర్భ నదులను కాపాడాలన్నారు. జలవనరుల సంరక్షణ అవసరం నుంచి అత్యవసరం పరిధికి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయక, గ్రామీణ పద్ధతుల ద్వారా నీటి నిల్వలు పెంచవచ్చన్నారు. ఇది రాజస్థాన్‌లో ప్రయోగపూర్వకంగా 11,800 చెక్‌డ్యాంలు, 2.5 లక్షల బావుల నీటి నిల్వలు పెరిగి విజయవంతమైందని, 17 లక్షల మంది వలసపోయిన గ్రామీణులు తమ గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారన్నారు. గ్రామీణ భారత దేశాభివృద్ధి నీటి లభ్యత, సౌకర్యాలపై  ఆధారపడి ఉందని, శాంతి, సంతోషం జీవనం, కేవలం వా తావరణం, నీటి లభ్యతపై ఆధారపడి ఉంన్నారు. ‘ఏ నది అయితే స్వేచ్ఛగా పారుతుందో ఆ నది ఎప్పటికీ జీవిస్తుంది-ఏ నది అయితే స్వేచ్ఛగా పారదో ఆ నది మరణిస్తుంది’ అని అన్నారు. జలసాక్షారతతో వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించవచ్చని పవర్‌ పాయింట్‌ ద్వారా తెలియజేశారు.  విద్యార్థుల ప్రశ్నోత్తరాల ద్వారా మరిన్ని వివరాలు తెలియజేశారు. 


చెరువులు..చెక్‌ డ్యాంలు నిర్మించాలి

గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో మరిన్ని చెరువులు, చెక్‌డ్యాంలు నిర్మాణం రావాలని తెలంగాణ రాష్ట్ర వాటర్‌ మేనేజ్‌మెంట్‌ రిసోర్స్‌ నిర్వాహకులు శ్యాంసుందర్‌రెడ్డి అన్నారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దీనికి కాకతీయ విశ్వవిద్యాలయ చెక్‌డ్యాం నిర్వహణ మంచి ఉదాహరణ అన్నారు. బ్రహ్మగిరి నుంచి రాజమండ్రి వరకు చేపట్టిన జలసాక్షారత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కే సీతారామారావు, ప్రిన్సిపాల్‌ కే డేవిడ్‌, పాఠ్యప్రణాళిక అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ మల్లికార్జునరెడ్డి, డీఎస్‌ ఆచార్య టీ రమేశ్‌, ఒప్పంద అధ్యాపకులు, పరిశోధకులు వివిధ సామాజిక కార్యకర్తలు, వరంగల్‌లోని వివిధ కళాశాలల జియాలజీ విభాగానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్‌ రాజేంద్రసింగ్‌జీని విశ్వవిద్యాలయం తరుఫున శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. అదేవిధంగా ‘వలంతరి స్వచ్ఛంద సంస్థ తరుఫున విశ్వవిద్యాలయంలో జలసాక్షారత కేంద్రాన్ని ఏర్పరుస్తున్న డాక్టర్‌ ఆర్‌.మల్లికార్జునరెడ్డిని సమన్వయకుడిగా, ఆచార్య కే డేవిడ్‌ను సహాయ సమన్వయకుడిగా 16 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు జలనిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు, పౌరులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు తెలిపారు.


logo
>>>>>>