శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 20, 2020 , 02:54:44

అభివృద్ధికి దిశా నిర్దేశం..

అభివృద్ధికి దిశా నిర్దేశం..

వరంగల్‌,నమస్తేతెలంగాణ: పల్లెప్రగతిలో పల్లె లు అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నాయి. అదే ఉత్సాహంతో చేపట్టే పట్టణ ప్రగతితో నగరాలు, పట్టణాలు మెరువనున్నాయి. పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా  సర్కారు ‘పట్టణ ప్రగతి’కి శ్రీకారం చుట్టింది. పది రోజుల ప్రగతి పండుగతో నగరాలు, పట్టణాల్లో ప్రతివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం కానున్నాయి. ఈ నెల 24 నుంచి మా ర్చి 4వ తేదీ వరకు పట్టణాలు, నగరాల ప్రగతి ప్రణాళికలు చేయనున్నారు. అభివృద్ధి ప్రణాళికల్లో  ప్రజలను భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో సర్కారు ప్రతి డివిజన్‌లో నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేసి కమిటీలో 15 మంది సభ్యులను నియామకం చేసింది. అన్నివర్గాల ప్రజలకు వార్డు కమిటీల్లో స్థానం కల్పించి డివిజన్‌ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చేయనున్నారు. నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్న లక్ష్యంతో పట్టణ ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. 24వ తేదీన ప్రారంభం కానున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దీనిలో భాగంగానే గురువారం పట్టణ ప్రగతిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రోజుల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతికి దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రజ ల భాగస్వామ్యంతో చేయనున్న అభివృద్ధి ప్రణాళికలు  నగరానికి మాస్టర్‌ ప్లాన్‌గా మారనున్నది.


సమగ్ర ప్రణాళికలు

పట్టణ ప్రగతి ద్వారా నగర సమగ్ర ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇప్పటికే ప్రతి డివిజన్‌లో నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. డివిజన్‌ అవగాహన ఉన్న వార్డు కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకొని ప్రణాళికలు రూపొందించనున్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని 58 డివిజన్ల సమగ్ర ప్రణాళికలు పది రోజుల పట్ట ణ ప్రగతి కార్యక్రమంలో రూపకల్పన చేయను న్నారు. వాటన్నింటిని క్రోడీకరించి నగర సమగ్ర ప్రణాళికలు చేయనున్నారు. ప్రజల భాగస్వామ్యం తో తొలిసారిగా పట్టణ అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకోన్నాయి. అభివృద్ధిలో ప్రజలను భాగ సామ్యం చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ప్రతి డివిజన్‌లో నాలుగు వార్డు కమిటీలను ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికల్లో వారిని భాగస్వామ్యం చేయనున్నారు. డివిజన్‌ వారీగా రూపొందించిన ప్రణాళికల్లో అధిక ప్రాధాన్యత ఉన్న వాటిపై ప్రత్యేక ప్రణాళికలు చేస్తామని అధికారులు అంటున్నారు. మెరుగైన పారిశుధ్యం, ప్రస్తుత కాలుష్య వాతావరణాన్ని దృ ష్టిలో ఉంచుకొని నగరాల్లో విరివిరిగా మొక్కలు పెంచడం పట్టణ ప్రగతిలో ప్రధాన అంశంగా చేర్చారు. దీనికి తోడు మోడల్‌ మార్కెట్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, పార్కుల్లో ఆహ్లాదం అందేలా అభివృద్ధి చేయాలన్నది పట్టణ ప్రగతిలో ముఖ్యమైన అంశంగా తీసుకున్నారు.


ప్రజల భాగస్వామ్యం

పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేసే ప్రతి ప్రణాళిక ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకోనున్నది.  డివిజన్‌లో చేయాల్సిన అభివృద్ధిపై డివిజన్‌ ప్రజలతో ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుల ఆలోచనలతో ప్రణాళికలు ఉండనున్నాయి. వార్డు కమిటీల్లో యువత, మహిళ, సీనియర్‌ సిటిజన్స్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించడం అభివృద్ధి ప్రణాళికల్లో పారదర్శకతకు అవకాశం ఉండనున్నది. ప్రజల భాగస్వామ్యంతో చేయనున్న ప్రణాళికలతో రాబోయే కొద్ది నెలల్లోనే నగర అభివృద్ధి ముఖ చిత్రం మారిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.


 నేడు ప్రత్యేక సమావేశం

పట్టణ ప్రగతిపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హంటర్‌ రోడ్డులోని అభిరామ్‌ గార్డెన్‌లో జరిగే ప్రత్యేక సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పట్టణ ప్రగతి కార్యక్రమానికి నియమితులైన ప్రత్యేక అధికారులతో పాటు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు ప్రత్యేక సమావేశానికి హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పట్టణ ప్రగతిపై మంత్రులు దిశా నిర్దేశం చేయనున్నారు. పట్టణ ప్రగతి లక్ష్యం, సర్కారు సంకల్పాన్ని మంత్రులు ప్రజాప్రతినిధులకు, అధికారులకు హితబోధ చేయనున్నారు.  


logo