సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 19, 2020 , 03:18:01

ప్రగతి పరుగు!

ప్రగతి పరుగు!

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి- నమస్తే తెలంగాణ : అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. పల్లెలతో పాటు పట్టణాల్లోనూ ప్రగతిని పరుగులు పెట్టించే దిశలో ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అమల్లోకి వచ్చిన పల్లె ప్రగతి పనుల పురోగతిపై ఒకవైపు సమీక్ష నిర్వహిస్తూనే.. మరోవైపు పట్టణ ప్రగతికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 24వ తేదీ నుంచి పది రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో పట్టణ ప్రగతిపై రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ సమ్మేళనం నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ, పురపాలక శాఖ అధిపతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర పాలక సంస్థల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కార్పొరేషన్‌, మున్సిపల్‌ కమిషనర్లు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి కలెక్టర్‌ ఎం హరిత, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గుంటి రజినికిషన్‌, సోదా అనితరామకృష్ణ, అరుణతోపాటు వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు తదితరులు సమ్మేళనానికి హాజరయ్యారు. మున్సిపల్‌ సమ్మేళనంలో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణపై ప్రజాప్రతినిధులకు కర్తవ్య బోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ చివరకి భర్తృహరి సుభాషిత పద్యం చదివి అర్థం చెప్పటం ద్వారా పట్టణ ప్రగతి కార్యక్రమానికి కార్యోణ్ముఖులను చేశారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని అన్నారు.

 పనిచేసే వారికి గుర్తింపు..

మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశం, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టం, త్యాగంతో కూడుకున్నటువంటివి. బ్రిటిష్‌ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయి. అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నాము. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమై పోయాము. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యం అని సీఎం కేసీఆర్‌ అన్నారు. అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్‌పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది. దీన్ని ఒక ముందడుగు స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు. అది మీచేతుల్లోనే ఉంది. విధి నిర్వహణలో విఫలం కావద్దు. పదవి అసిధారా వ్రతం (కత్తిమీద సాము) లాంటిది. ప్రజా జీవితం అంతా సులభం కాదు. సోయి తప్పి పని చేయవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. చాలా కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎంను చేశారు. నా వరకైతే గెలిచేంత వరకే రాజకీయం, తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేసాం. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నామని సీఎం అన్నారు. 

 మీరంతా ధీరులు కావాలి..

 ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలి. చాలా మందికి ఆత్మ విశ్వాసం తక్కువ ఉంటుంది. అలా ఉండకూడదు. అవగాహనతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలి. పట్టుదల ఉంటేనే విజయం సాధిస్తారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలి. అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే, ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారు. ప్రజాశక్తిని సమీకృతం చేయగలిగితే మనం గొప్ప ఫలితాలు సాధిస్తాం. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారు. మీరంతా ధీరులు కావాలి. సంకల్పం గట్టిగా ఉంటే వంద శాతం విజయం సాధిస్తారు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారుపేరు అయింది. బల్దియా.. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయి. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంబించాలి. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలి. పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా ఉండాలి. అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదు. అది మీ చేతుల్లో ఉందని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్‌ నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడవద్దు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్‌ వేసుకోవాలి. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి. ఫొటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టణాలు మంచి దారి పడతాయని కేసీఆర్‌ అన్నారు. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించాలి. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాధలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. చివరగా సీఎం కేసీఆర్‌ ఏనుగు లక్ష్మణ కవి రాసిన పద్యాన్ని చదివారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి ఉత్తములుగా నిలవాలని ఆకాంక్షించారు.

 నేడు పంచాయతీ సమ్మేళనం..

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు, చీఫ్‌ సెక్రటరీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధిపతులతో పాటు  కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండు విడుతలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం నిర్వహించటంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయి పంచాయతీ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పంచాయతీ సమ్మేళనం నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్‌చార్జిగా నియమించింది. జిల్లా ఇన్‌చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నియమితులయ్యారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం జిల్లా స్థాయి పంచాయతీ సమ్మేళనం జరుగనుంది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా మంత్రి ఎర్రబెల్లి పాల్గొంటారు. జిల్లా కలెక్టర్‌ ఎం హరిత, అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డితోపాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్‌పర్సన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, కార్యదర్శులు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖల అధికారులు సమ్మేళనానికి హాజరుకానున్నారు.



logo