సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 19, 2020 , 03:04:57

పట్టణాల అభివృద్ధే లక్ష్యం

పట్టణాల అభివృద్ధే లక్ష్యం

పరకాల టౌన్‌, ఫిబ్రవరి 18 : పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక  చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాలనలో పారదర్శకతను తీసుకు వచ్చేందుకు నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నూతన మున్సిపల్‌ చట్టంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసికట్టుగా వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేసేలా చర్యలు తీసుకుంది. పాలనలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసే విధంగా ప్రతి వార్డుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నది.  కమిటీల ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఇందుకోసం వార్డుల పరిధిలోని యువజనులు, మహిళలు, వయోజనులు, ఇతర ప్రముఖ వ్యక్తులను భాగస్వాములు చేస్తూ 15మందితో వార్డు కమిటీల నియామకాన్ని చేపడతున్నారు. ఇందులో వార్డు కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులతో వార్డులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరి సమక్షంలో కమిటీలను నియమిస్తున్నారు. దీంతో వార్డు అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తప్పని సరి కానుంది. 

8 అంశాలపై ప్రత్యేక దృష్టి..

నూతన మున్సిపల్‌ చట్టాన్ని అనుసరించి నియమిస్తున్న వార్డు కమిటీలు 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.  ముఖ్యంగా వార్డు పరిధిలో పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, మంచి నీటి నిర్వహణ, వార్డు పరిధిలో పార్కులు, ఆటస్థలాలు, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణతో పాటు వార్డు పరిధిలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటడం, నాటిన మొక్కల్లో 85 శాతం సంరక్షించేందుకు చర్యలు చేపట్టడం, మున్సిపాలిటీలో పన్నుల వసూలు, ఇతర పెండింగ్‌ బిల్లుల వసూలుకు  సమయాన్ని వెచ్చించడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లడం, ప్లాస్టింగ్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, ప్రజలు, చిన్నారుల్లో దాగి ఉన్న కళలను, క్రీడలను వెలికి తీసి ప్రోత్సహించాలి

మూడు నెలలకోసారి సమావేశం..

 ఏర్పాటు చేసిన వార్డు కమిటీలు కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమవ్వాలి. ఈ సమావేశంలో వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించి, వార్డు అభివృద్ధికి చేపట్టాల్సిన పలు అంశాలపై ప్రణాళికలు రూపొందించాలి. వార్డు కమిటీలు గుర్తించిన సమస్యలను కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానిక కౌన్సిలర్‌ కృషి చేస్తారు.

వార్డు కమిటీల నిర్ణయాలపై సమీక్ష

 కౌన్సిల్‌ సమావేశంలో ఆయా సమస్యలను పరిష్కరించడంతోపాటు వార్డుల అభివృద్ధికి కమిటీలు రూపొందించిన ప్రణాళికలను అమలు అయ్యేలా చర్యలు చేపడుతారు. వార్డు కమిటీల సమావేశం వారు తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తారు.  

పట్టణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు..

పట్టణ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టంలో భాగంగా  పట్టణ ప్రజలకు క్షేత్ర స్థాయిలో పారదర్శక పాలన అందించేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో మున్సిపాలిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయనుంది. ఆ నిధులతో పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ చట్టంలో భాగంగా పట్టణ పరిధిలో 75 గజాల జాగలో ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. అంతకంటే ఎక్కువ జాగలో ఇట్టు కట్టుకోవాలంటే దరఖాస్తు చేసుకున్న 21రోజుల్లో ఇంటి పర్మిషన్‌ ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకువచ్చారు. అంతేకాకుండా నూతన మున్సిపల్‌ చట్టంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు ప్రజల కోసం పని చేయాలి. లేనిపక్షంలో కౌన్సిలర్‌ పోస్ట్‌ ఊస్ట్‌ అయ్యే విధంగా రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన మున్సిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. 


logo