బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 18, 2020 , 02:55:26

దేవునూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌కు రూ.కోటి

దేవునూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌కు రూ.కోటి

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: అడవుల విస్తరణ హరితహారంతోనే సాధ్యమన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పం. ఆ సంకల్పాన్ని అక్షరబద్ధం చేసేందుకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌ తనవంతుగా తనకొచ్చే నిధుల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడం కోసం కంకణబద్ధులై కదంతొక్కుతున్న నేపథ్యంలో జిల్లాలోని ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను హరితవనంగా మార్చడం కోసం ఆయన సంబంధిత అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. అంతేకాకుండా హంటర్‌రోడ్‌లోని కాకతీ య జూ పార్క్‌లో ఉన్న ఐదెకరాల భూమిని మోడ ల్‌ ఫారెస్ట్‌గా మార్చేందుకు అవసరమైన నిధులను సైతం వెచ్చిస్తామని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలకు రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మలిచి స్వచ్ఛమైన  సమతుల్యమైన వాతావరణాన్ని అందించే దిశగా సీఎం కేసీఆర్‌  తలపెట్టిన హరితహారం అందరూ ఆదర్శంగా తీసుకొని తమవంతు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  


రాజ్యసభ సభ్యుడు జోగినపెల్లి సంతోశ్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ ఎంతో ఉన్నతమైనదని తెలుపుతూ.., ఆ పిలుపు అనేక మందికి స్ఫూర్తినిచ్చిందని, వారు కీసరగుట్టలో అర్బన్‌ ఫారెస్ట్‌ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయం తనకు స్ఫూర్తి దాయకంగా నిలిచిందని డాక్టర్‌ బండా ప్రకాశ్‌ పేర్కొన్నారు. ఆ స్ఫూర్తిలోంచే దేవునూరు అర్బన్‌ ఫారెస్ట్‌ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కాగా సోమవారం సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మొక్కను నాటారు. అనంతరం ఆయన సీఎం కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు   జెడ్పీ మాజీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, ముదిరాజ్‌ మహాసభ యువత నాయకుడు అల్లుడు జగన్‌, బొక్క శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo