శనివారం 30 మే 2020
Warangal-city - Feb 15, 2020 , 02:26:56

సహకార టెన్షన్‌!

సహకార టెన్షన్‌!

వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ: సహకార ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో సర్వత్రా ఉత్కంఠ చోటుచేసుకుంది. ఎలక్షన్‌ జరిగే ప్రాదేశిక నియోజకవర్గా(టీసీ)ల నుంచి బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగిన ఈ అభ్యర్థుల భవితవ్యం మరో కొన్ని గంటల్లో తేలనుంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగిసిన తర్వాత అధికారులు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే 271 టీసీల పరిధిలో మొత్తం 71,934 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ నిర్వహణ కోసం బ్యాలెట్‌ బాక్సులు, పేపరుతో పాటు ఎన్నికల సామగ్రి శుక్రవారం పోలింగ్‌ స్టేషన్లకు చేరుకుంది. వీటితో పాటే ప్రిసైడింగ్‌ అధికారు(పీవో)లు, అసిస్టెంటు ప్రిసైడింగ్‌ అధికారు(ఏపీవో)లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఘర్షణ చోటుచేసుకునే అవకాశం ఉన్న పోలింగ్‌ కేంద్రాల వద్ద సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ), సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్సై)లు ఎన్నికల బందోబస్తు పర్యవేక్షిస్తారు. ఈ నెల 15వ తేదీన సహకార ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎన్నికలు జరిగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)లు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 32 ఉండగా వీటిలో 31 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్‌ అధికారులు ఈ నెల 3న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 6 నుంచి 8వ తేదీ వరకు ఆయా పీఏసీఎస్‌ పరిధిలోని టీసీల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికలు జరపతలపెట్టిన 31 పీఏసీఎస్‌ల పరిధిలోని 402 టీసీల్లో మూడురోజుల పాటు 1,564 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరిగింది. 164 నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో రిజక్ట్‌ చేశారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి పీఏసీఎస్‌ పరిధిలో 3 టీసీల్లో దాఖలైన నామినేషన్లు తిరస్కరణకు తిరస్కరణకు గురికావటంతో సదరు మూడు టీసీల్లో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. 10న నామినేషన్ల ఉపసంహరణ గడువుకు తెరపడింది. 645 మం ది తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. దీం తో 25 పీఏసీఎస్‌ల పరిధిలో 128 టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆత్మకూరు మండలం పెంచికల్‌పేట, గీసుగొండ మండలం మొగిలిచర్ల పీఏసీఎస్‌ పరిధిలోని అన్ని టీసీల్లో ఎన్నిక ఏకగ్రీవం కావడం, ఈ రెండు పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవటం విశేషం. వీటితో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకోవడానికి అవసరమైన టీసీల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మరో ఆరు పీఏసీఎస్‌లను కూడా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తమ ఖాతాలో వేసుకుంది. 


 271 టీసీల్లో పోలింగ్‌..

వివిధ కారణాలతో ఎన్నిక నిలిచిపోయిన టీసీలను పక్కన పెడితే జిల్లాలో 271 టీసీల్లో శనివారం పోలింగ్‌ జరగనుంది. వీటిలో 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అమీనాబాద్‌, ఆత్మకూరు, చెన్నారావుపేట, చింతలపల్లి, చౌటపల్లి, దుగ్గొండి, ఎలుకుర్తి, కాపులకనపర్తి, గీసుగొండ, గురిజాల, ఖానాపురం, కొలన్‌పల్లి, మదారం, మందపల్లి, మహ్మదపురం, నాచినపల్లి, నల్లబెల్లి, నర్సంపేట, నెక్కొండ, ఊకల్‌, పరకాల, పర్వతగిరి, పెద్దాపూర్‌, రాయపర్తి, రెడ్లవాడ, శాయంపేట, సూరిపల్లి, వంచనగిరి, వర్ధన్నపేట పీఏసీఎస్‌ల పరిధిలో ఎన్నికలు జరిగే ఈ 271 టీసీలు ఉన్నాయి. వీటిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు 29 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రతి టీసీకి ఒకటితో పాటు అదనపు బాక్సులను కలుపుకుని 350 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. పీవోలు, ఏపీవోలు సహా పోలింగ్‌ సిబ్బందిని 870 మందిని అధికారులు పోలింగ్‌, ఓట్ల లెక్కిం పు నిర్వహణ కోసం నియమించారు. 271 టీసీ ల్లో పోలింగ్‌ కోసం 12 జోన్లు, 29 రూట్లను గుర్తించారు. ఎన్నికల సామగ్రి తరలింపునకు పీవోలు, ఏపీవోలకు 29 వాహనాలు సమకూర్చారు. పరకాల, రంగశాయిపేట, నర్సంపేటలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి శుక్రవారం పీవోలు, ఏపీవోలు బ్యాలెట్‌ బాక్సులు, పేపర్‌తో పాటు ఎన్నికల సామాగ్రి తీసుకుని వాహనాల ద్వారా పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ నిర్వహించేందుకు బూత్‌లను సిద్ధం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. పోటీ నెలకొన్న 271 టీసీల్లో విజేతలెవరు అనేది సాయంత్రం వరకు తేలనుంది. పోలింగ్‌ కేంద్రాల్లో 26 స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు ఈస్ట్‌ జోన్‌ డీసీపీ కేఆర్‌ నాగరాజు చెప్పారు. వీటిలో నర్సంపేట పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 13, పరకాల పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో 5, మామునూరు పోలీసు సబ్‌ డివిజన్‌ పరిధిలో 8 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సీఐ, ఎస్సైలు బందోబస్తు పర్యవేక్షిస్తారని డీసీపీ వెల్లడించారు. ఆదివారం ప్రతి పీఏసీఎస్‌ ఆఫీసులో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.  


logo