బుధవారం 12 ఆగస్టు 2020
Warangal-city - Feb 14, 2020 , 04:17:02

కాళేశ్వరంలో జలతపస్వీ

కాళేశ్వరంలో  జలతపస్వీ
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే
  • పుష్కర ఘాట్‌, ఆలయంలో మంత్రులతో కలిసి పూజలు
  • పుష్కర ఘాట్‌, ఆలయంలో మంత్రులతో కలిసి పూజలు
  • ఐజీ, ఎస్పీ ఆధ్వర్యంలో భద్రత

మంజూర్‌నగర్‌/కాళేశ్వరం, ఫిబ్రవరి 13 : సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని గురువారం సందర్శించారు. ప్రాజెక్టును పరిశీలించి సంబంధిత ఉన్నతాధికారులకు సలహాలు, సూచనలిచ్చారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం రాత్రి కరీంనగర్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ రాత్రి తీగలగుట్టపల్లిలోని ఆయన నివాసంలో బస చేశారు. గురువారం మధ్యాహ్నం కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్‌కుమార్‌తో కలిసి మధ్యాహ్నం 1.10 గంటలకు కాళేశ్వరం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కాళేశ్వరం పుష్కరఘాట్‌కు చేరుకోగా, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో కలిసి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. నదీమతల్లికి పసుపు, కుంకుమ, పూలు, కానుకలు, నాణేలు సమర్పించారు. గోదావరి నీళ్లను నెత్తిపై చల్లుకున్నారు.


అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. దేవస్థాన ట్రస్టు చైర్మన్‌ బొమ్మెర వెంకటేశం, ఆలయ ఈవో మారుతి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు సీఎం కేసీఆర్‌, మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని, పార్వతీ అమ్మవారిని వారు దర్శించుకున్నారు. ధ్వజస్తంభం, గణపతి, గర్భలాయంలో పూజలు చేశారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శివ కల్యాణ మండపంలో అర్చకులు సీఎం కేసీఆర్‌, మంత్రులను ఆశీర్వదించారు. కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌, ఆలయ ఈవో మారుతి, ట్రస్టు చైర్మన్‌ వెంకటేశం, జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేశ్‌ స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ తన తండ్రి దత్తాత్రేయులు జ్ఞాపకార్థం ముద్రించిన ‘కాళేశ్వర ఖండం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించారు. లక్ష్మీబరాజ్‌, లక్ష్మీ పంప్‌హౌజ్‌, సరస్వతీ బరాజ్‌ తదితర ప్రాంతాలను వీక్షించారు. 


చైర్‌పర్సన్‌కు ఆత్మీయ పలకరింపు

కాళేశ్వరం పర్యటనలో భాగంగా కాళేశ్వరం చేరుకున్న సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు వెళ్లిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి రాకేశ్‌ దంపతులను సీఎం కేసీఆర్‌ ఆప్యాయంగా పలకరించారు. ‘చైర్‌పర్సన్‌ గారూ.. పెండ్లి బాగా జరిగిందా..? పెండ్లికి రాలేకపోయాను..’ అంటూ చైర్‌పర్సన్‌ దంపతులను ఆశీర్వదించారు. 


కాళేశ్వరంలో భారీ భద్రత

సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పాటిల్‌ పర్యవేక్షణలో ములుగు, జయశంకర్‌ జిల్లాల అదనపు ఎస్పీలు సాయిచైతన్య, శ్రీనివాసులు, ట్రైనీ ఐపీఎస్‌ బాలస్వామి, డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాంబ్‌ స్కాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సీఎం సెక్యూరిటీ వింగ్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాస్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన అనంతరం భక్తులను దేవాలయంలోకి అనుమతించారు. 


ఆలయంలో ప్రముఖుల పూజలు

కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని జాయింట్‌ కలెక్టర్‌ స్వర్ణలత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ రూరల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, ఐజీ నాగిరెడ్డి తదితరులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, మహదేవపూర్‌ ఎంపీపీ రాణిబాయి, జెడ్పీటీసీ అరుణ,  సర్పంచ్‌ వసంత, ఎంపీటీసీ మమత ఉన్నారు.


logo