మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 13, 2020 , 04:30:29

మేడారం హుండీల లెక్కింపు షురూ..

మేడారం హుండీల లెక్కింపు షురూ..
  • తొలిరోజు ఆదాయం రూ.కోటి లక్షా 50 వేలు
  • సీసీ కెమెరాల నిఘాలో కానుకల లెక్కింపు
  • వారం రోజులు కొనసాగనున్న ప్రక్రియ

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 12: మేడారం మహాజాతర హుండీల్లోని కానుకల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారాలమ్మ మహాజాతర వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వనదేవతల గద్దెల ప్రాంగణంలో దేవాదాయ శాఖ మొత్తం 494 హుండీలను ఏర్పాటు చేసింది. సమ్మక్క గద్దె వద్ద 202, సారలమ్మ గద్దె వద్ద 202, గోవిందరాజు గద్దె వద్ద 25, పగిడిగిద్దరాజు గద్దె వద్ద 28 హుండీలతోపాటు, 38 క్లాత్‌, రెండు బియ్యం హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. జాతర అనంతరం భక్తులు సమర్పించుకున్న కానుకలు హుండీల్లో నిండడంతో వీటిని మూడు రోజుల క్రితం హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపంలో భద్రపరిచారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య బుధవారం హుండీల లెక్కింపు చేపట్టారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కానుకలను లెక్కిస్తున్నారు. తొలిరోజు హుండీల లెక్కింపు పూర్తయ్యే సమయానికి రూ.కోటి ఒక లక్షా 50 వేల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.


సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు..

కట్టుదిట్టమైన భద్రతకు తోడు సీసీ కెమెరాల పర్యవేక్షణలో మేడారం హుండీలను లెక్కిస్తున్నట్లు దేవాదాయశాఖ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు, మేడారం ఈవో రాజేంద్ర తెలిపారు. సుమారు వారంపాటు మొత్తం 494 హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నట్లు వారు పేర్కొన్నారు. తొలిరోజు బుధవారం 64 హుండీలను లెక్కించగా రూ.కోటి లక్షా 50 వేల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు. లభించిన డాలర్లు, రద్దయిన నోట్లు హుండీల్లో విదేశీ కరెన్సీతో పాటు ఇప్పటికే ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు లభించినట్లు అధికారులు తెలిపారు. ఎవరి తగ్గరైనా ఆ నోట్లు లభిస్తే చట్టప్రకారం శిక్షార్హులవుతారని భక్తులు భావించి అమ్మవార్లకు సమర్పించుకున్నారని అధికారులు వివరించారు.


logo
>>>>>>