మంగళవారం 31 మార్చి 2020
Warangal-city - Feb 12, 2020 , 03:31:36

పీఆర్‌ సమ్మేళనం

పీఆర్‌ సమ్మేళనం

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : రాబోయే పదిహేను రోజుల్లో జిల్లాస్థాయిలో పంచాయతీ రాజ్‌ సమ్మేళనం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. జిల్లాలోని సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను సమ్మేళనానికి ఆహ్వానించాలని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్న ఈ సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్‌ ఎం హరిత, అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రాధాన్యాలు, బాధ్యతలను వివరించారు. పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో ఎవరి బాధ్యత ఏమిటో విడమరిచి చెప్పాలి. సర్పంచ్‌లు, కార్యదర్శులు ఏమేం చేయాలో వివరించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లను ముఖ్యఅతిథులుగా పిలవాలి. ఈ సమ్మేళనంలో విధులు, బాధ్యతలు తెలపాలి. సమావేశం తర్వాత పది రోజుల గడువు ఇవ్వాలి. ఆలోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రామాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. ఫ్లయింగ్‌ స్కాడ్లు పర్యటిస్తాయి. ముఖ్యమంత్రిగా నేను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తాను. ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవు. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలూ ఉంటాయని సీఎం అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం కొద్ది కాలం చేసి ఊరుకునేది కాదు. కేవలం స్పెషల్‌ డ్రైవ్‌లా కాకుండా ఇది నిరంతరం సాగాలి. 

ఆదర్శ పల్లెలు తెలంగాణలోనే ఉండాలి..

దేశంలో ఆదర్శ పల్లెలు ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఉన్నాయనే పేరు రావాలి. గ్రామాల్లో ఎవరు చేయాల్సిన పనిని వారితోనే చేయించాలి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవస్థతో పనిచేయించాలి. ప్రతి గ్రామంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను కచ్చితంగా బతికించాలి. శ్మశానవాటికలు, ఖనన వాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. చెట్లకు నీరు పోయడానికి, చెత్త ఎత్తిపోయడానికి ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు తమ దృష్టికి వచ్చిన అత్యవసర, అత్యంత ప్రాముఖ్యత కలిగిన పనులు చేయడానికి ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి అందుబాటులో ఉంచుతామని కేసీఆర్‌ ప్రకటించారు.

  గ్రామాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు.. 

గ్రామాల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంది. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవి అయ్యాయి. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి ఎంతో సానుకూల అంశమని సీఎం కేసీఆర్‌ అన్నారు. పల్లెల అభివృద్ధికి నిధుల కొరత సమస్య కాకుండా ప్రతీ నెల రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తున్నాం. అన్ని పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవో వంటి పోస్టులన్నీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. ప్రతి గ్రామంలో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పించాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం. నేరుగా కోర్టుకు వెళ్లకుండా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశాం. ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసింది. ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చే విధంగా పనిచేయించే బాధ్యతలను కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లకు సహాయకారిగా ఉండేందుకు అడిషనల్‌ కలెక్టర్లను నియమించాం. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. వారికి మరో పని అప్పగించవద్దు. ఒక అడిషనల్‌ కలెక్టర్‌ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పనిచేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలని ఆయన స్పష్టం చేశారు. 

నిరంతరం పల్లె ప్రగతి..

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత సాదించడం లక్ష్యంగా ఇప్పటివరకు రెండు విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి విజయవంతమైంది. ఈ కార్యక్రమం నిరంతరం సాగాలి. పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలి. వాటిని సంరక్షించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. మురికి గుంతలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుబడిన బావులు పూడ్చివేయాలి. పాత బోరుబావులనూ పూడ్చాలి. ఈ పనులన్నింటినీ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడమే కాదు అడవుల్లో కలప స్మగ్లింగ్‌ను అరికట్టడంపైనా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి. చెట్లు నరకకుండా చూడాలి. అటవీ భూముల్లో దట్టమైన అడవులు పెంచాలి. పది ఎకరాల అటవీ భూమిలో అడవిని అభివృద్ధి చేయడం పదివేల ఎకరాల్లో సామాజిక అడవులు పెంచడంతో సమానం. ఈ నేపథ్యంలో అడవిని పునరుద్ధరించడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత. వారి పనితీరుకు ఇదే గీటురాయి. మొక్కలు నాటి, సంరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించన వారిని ఉపేక్షించేది లేదు. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమమైనా ముందుగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలు సమాజంలో అత్యంత వెనుకబడి ఉన్నారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించాలి. కార్యక్రమాల అమలును అక్కడి నుంచే ప్రారంభించాలని సీఎం అన్నారు.

త్వరలో పట్టణ ప్రగతి..

పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి క ఆర్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖలో దాదాపు ఖాళీలన్నీ భర్తీ చేశాం. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పంచాయతీరాజ్‌ శాఖ మాదిరిగానే మున్సిపల్‌ శాఖలోనూ అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎన్ని ఖాళీలున్నాయి, ఎక్కడెక్కడ ఏ పోస్టులు భర్తీ చేయాలో మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పట్టణ స్థానిక సంస్థలకు కూడా నిధులు సమకూరుస్తాం. హైదరాబాద్‌ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల లెక్కన విడుదల చేస్తాం. ఈ నిధులతో పాటు స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కేసీఆర్‌ అన్నారు. 

 సర్పంచ్‌లకు అక్షరాస్యత బాధ్యత.. 

అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. తెలంగాణ రాష్ర్టాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతిన తీసుకోవాలి. తమ గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలి. తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. 

 వ్యక్తిగత ప్రాధాన్యతలుండొద్దు..

అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఉద్బోధించారు. మిస్తృత మేధోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అవలంబిస్తున్న మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, విధానాలు, పథకాలు, కార్యక్రమాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దు. అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీంలా అధికార యంత్రాంగం పనిచేయాలి. రాష్ట్రస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి కార్యక్రమాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చిన పథకాలు. ఎంతో మేధోమథనం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో ప్రభుత్వం కార్యక్రమాలు రూపొందిస్తుంది. అలాంటి కార్యక్రమాలను జిల్లా స్థాయిలో కలెక్టర్లు అమలు చేయాలని సీఎం అన్నారు.


logo
>>>>>>