ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 12, 2020 , 03:26:19

డబుల్‌ వైపు అడుగులు

డబుల్‌ వైపు అడుగులు

 నర్సంపేట రూరల్‌ : ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కళ నెరవేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టి అందిస్తుంది. నర్సంపేట పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలు అతిత్వరలో చేపట్టనున్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిలోని దామెర చెరువు ఎదురుగా నిర్మించనున్న 960 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు టెండర్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ప్రముఖ లహరి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఈటెండర్‌ను గతంలోనే దక్కించుకుంది. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం సాకారం కానుండడంతో  పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణానికి తొలివిడతలో 960 డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు గతంలో మంజూరయ్యాయి. ఇటీవల ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే పెద్ది పలువురు ఉన్నతాధికారులతో కలిసి శంకుస్థాపన చేపట్టారు. అనతి కాలంలో టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త దొడ్డ మోహన్‌రావు ఆర్థిక చేయూతతో సర్వాపురం శివారులోని 22 ఎకరాల భూమి కొనుగోలుకు ఆయా రైతులకు నష్టపరిహారం  చెల్లించి  ఎలాంటి చిక్కులు లేకుండా ఆ స్థలాన్ని  ఆర్డీవో ద్వారా  కలెక్టర్‌కు అందించారు.  దీంతో సుమారు 22 ఎకరాల సువిశాల స్థలంలో అన్ని రకాల మౌలిక వసతులతో  ఆధునిక కట్టడాలు  ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే పంచాయతీరాజ్‌   ఆధికారుల ఆధ్వర్యంలో లహరి కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులు పనులు ప్రారంభించనున్నారు.  

 22 ఎకరాల స్థలాన్ని అందించిన దొడ్డ 

నర్సంపేట డివిజన్‌లో ప్రభుత్వ స్థలాలు ఎక్కుడా లేవు.  భూమి ఉన్న వారు  ఎవరూ అమ్మకానికి ముందుకు రావడం లేదు. దీంతో  ఎమ్మెల్యే పెద్ది చొరవ చూపి హైదరాబాద్‌ ఫార్మాకంపెనీ అధినేత, చెన్నారావుపేట మండలం లింగగిరి వ్యాస్తవ్యులైన దొడ్డ మోహన్‌రావును భూమికి కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పించారు. ఎమ్మెల్యే పెద్ది సూచన మేరకు ముందుకు వచ్చిన దాత దొడ్డ మోహన్‌రావు పట్టణంలోని సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలోగల 22ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి విరాళంగా ఇప్పటికే అందించారు. రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమిని రికార్డు ప్రకారం స్వాధీనం చేసుకొని డబుల్‌బుడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు కేటాయించారు.   

 ప్రభుత్వం నిధుల కేటాయింపు 

 ఇళ్ల నిర్మాణాలకుగాను ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఒక్కో డబుల్‌బెడ్‌ రూం నిర్మాణానికి  రూ.5.30 లక్షలు, మౌలిక వసతుల కల్పనకు మరో రూ.75వేలను కేటాయించింది. రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, ఇతర మౌలిక వసతులకుగాను రూ.14కోట్లు కేటాయించారు. డబుల్‌బెడ్‌ రూం నిర్మాణాలను దక్కించుకున్న లహరి కన్సస్ట్రక్షన్‌ కంపెనీ ఇటీవల టెండర్‌ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. అంతేగాక  నిర్మాణాల్లో భాగంగా  కొద్ది రోజుల క్రితం మిక్స్‌డ్‌ యూనిట్‌ పరిశ్రమ నిర్మాణం కూడా చేపట్టారు. ఇటుకల తయారీ, కాంక్రీట్‌, చిప్స్‌, చూర, సిమెంట్‌ను తయారు చేస్తున్నారు. మొత్తం ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నారు. అతిత్వరలో నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. సరిగ్గా ఏడాదిలోపే నిర్మాణాలు పూర్తి చేయాలనే సంకల్పంతో కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారు. నియోజకవర్గానికి కేటాయించిన 1400 ఇళ్లల్లో తొలి విడతగా 960  ఇళ్ల నిర్మాణాలకు గాను రూ.34.94కోట్లను ప్రభుత్వం గతంలో కేటాయించింది. 

 జీప్లస్‌-2 తరహాలో 

జీప్లస్‌-2 తరహాలో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఒక్కో డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు 36 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. సుమారు 3వేల మంది నివసించడానికి అనువైన ప్రాంతంగా ఈ ప్రదేశాన్ని తీర్చిదిద్దనున్నారు. డబుల్‌బెడ్‌ రూం నిర్మాణాలను ఆనుకొని జిల్లా దవాఖాన నిర్మాణం  చేపట్టనున్నారు. 250 పడకల  దవాఖాన నిర్మాణానికి రూ.60కోట్లను ఇటీవల ప్రభుత్వం కేటాయిస్తూ జీవో జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. 

    ఇళ్ల స్థలాన్ని పరిశీలించిన

   అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి

 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల స్థలాల ఎంపికను సకాలంలో పూర్తి చేయాలని సంబంధింత అధికారులను గతంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి సూచించారు.  సర్వాపురం శివారు నర్సంపేట -కొత్తగూడ ప్రధాన రహదారిలో దామెర చెరువు సమీపంలో ఇటీవల కాలంలో  గుర్తించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల స్థలాలను  ఆయన సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి ఇప్పటికే పరిశీలించారు. సర్వే నెంబర్‌ 62లో గతంలో  దాత దొడ్డ మోహన్‌రావు సహకారంతో కొనుగోలు చేసి ప్రభుత్వానికి అందించిన 22ఎకరాల స్థలంలో  జేసీ నిర్మాణాలు పూర్తి చేయాలని  సూచించారు.


logo