సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Feb 12, 2020 , 03:24:18

రామవరానికి చేరిన ఎస్సారెస్పీ జలాలు

రామవరానికి చేరిన ఎస్సారెస్పీ జలాలు

నర్సంపేట రూరల్‌, ఫిబ్రవరి 11 : మొట్టమొదటి సారిగా నర్సంపేట మండలంలోని రామవరం గ్రామానికి ఎస్సారెస్పీ జలాలు చేరుకున్నాయి. గత ఎన్నికల ముందు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి గ్రామానికి డీబీఎం 38 కాల్వల ద్వారా ఎస్సారెస్పీ జలాలు చేరేలా కృషి చేశారు. మొదటి సారిగా గ్రామానికి గోదావరి జలాలు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అన్నదాతల చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఎమ్మెల్యే పెది  నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామానికి ఎస్సారెస్పీ జలాలు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.  సాగు నీటిని విడుదల చేయాలని సూచించడంతో మేయిన్‌కెనాల్‌ నుంచి డీబీఎం 38 ద్వారా జలాలను విడుదల చేశారు. మండలంలోని లక్నెపల్లి గ్రామం మీదుగా రామవరం గ్రామ సబ్‌స్టేషన్‌ సమీపానికి గోదావరి జలాలు చేరుకున్నాయి. దీంతో ఇప్పటికే యాసంగికి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సబ్‌స్టేషన్‌ సమీపంలో ఓటీ పాయింట్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా చెరువులోకి జలాలు వచ్చేలా చూశారు. మంగళవారం సర్పంచ్‌ కొడారి రవన్న ఆధ్వర్యంలో ఉప సర్పంచ్‌ జినుకల విమల-శంకర్‌, వార్డు సభ్యులు రాజిరెడ్డి, జయకృష్ణ, రవిలు రామవరానికి చేరుకున్న ఎస్సారెస్పీ జలాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. logo