శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 12, 2020 , 03:22:00

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన స్టేట్‌ ఫ్లయింగ్‌ స్కాడ్‌

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన స్టేట్‌ ఫ్లయింగ్‌ స్కాడ్‌

శాయంపేట, ఫిబ్రవరి 11 : మండలంలో పల్లె ప్రగతి పనులను స్టేట్‌ ఫ్లయింట్‌ స్వాడ్‌, స్టేట్‌ ఫారెస్టు చీఫ్‌ కన్జర్వేటర్‌ సదానంద కుక్రెటి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్తగట్టుసింగారం, ఆరెపల్లి గ్రామాల్లో ఆయన తనిఖీలు చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన నర్సరీలు, శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు, ఇంకుడు గుంతలను ఆయన పరిశీలించారు. రెండు గ్రామాల్లోనూ వీధుల్లో కలియదిరిగారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలో రెండు గ్రామాల్లో పల్లెప్రగతి పనులపై తనిఖీలు చేస్తున్నట్లు సదానంద కక్రోటి తెలిపారు. అందులో భాగంగా ఎంచుకున్న గ్రామాల్లోనే పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగట్టుసింగారంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, నర్సరీ, ఇంకుడుగుంతలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను ఆయన పరిశీలించారు. గ్రామ పంచాయతీకి చుట్టు ప్రహరీ నిర్మించాలని సూచించారు. ఇంకా పనులు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే పాఠశాలలోని నర్సరీలో వెలుతురు పడేలా మొక్కలు పెట్టాలని తెలిపారు. గ్రామంలో రోడ్లపై తిరుగుతు డ్రైనేజీలను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వస్తువులు లేకుండా డంపింగ్‌యార్డుల్లోకి తరలించాలన్నారు. విద్యుత్‌ స్తంభాలను పరిశీలించారు. అయితే నిధులు అందడం లేదని స్థానికులు తెలపడంతో నిధుల విషయంలో ఇబ్బంది లేదని, ఉపాధి హామీ పనుల్లో చేపట్టారు కాబట్టి కేంద్రంతో ముడి పడి ఉందని నిధులు తప్పకుండా అందుతాయని సదానంద కక్రొటి వెల్లడించారు. రోడ్లను ఎప్పటికప్పుడు ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నర్సరీలో పదివేల మొక్కలనును పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదికను అందిస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు ఎలా గ్రామాలు ఉండేవో, పల్లె ప్రగతి తర్వాత ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆరెపల్లి గ్రామాన్ని సదానంద కుక్రెటి సందర్శించారు. ఇక్కడ నర్సరీని సందర్శించి బ్యాగ్‌ ఫిల్లింగ్‌ ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, ఏవి పెంచుతున్నారో తెలుసుకున్నారు. అరెపల్లిలో వంద శాతం ఇంకుడు గుంతలు, వంద శాతం మరుగుదొడ్లు నిర్మాణం జరగడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లపై తిరుగుతూ పరిశీలించి బాగుందని పేర్కొన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. పారిశుధ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, పచ్చదనం ఉట్టిపడాలని సూచించారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుమనవాణి, ఫారెస్టు డిప్యూటీ రేంజర్‌ ఝాన్సీ,  ఏపీవోఅనిత, ఈసీ రజినీకాంత్‌, ఉపాధి సిబ్బంది, వార్డుసభ్యుడు దుంపల మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo