శనివారం 04 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 10, 2020 , 03:47:23

జాతర ముగిసినా జన సంద్రమే

జాతర ముగిసినా జన సంద్రమే

తాడ్వాయి, ఫిబ్రవరి09: వరాల తల్లులు, కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారమైన వనదేవతల ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో జనం పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ర్టాలతోపాటు పక్క రాష్ర్టాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ గద్దెల ప్రాంగణానికి వచ్చి భక్తిశ్రద్ధలతో తల్లులను దర్శించుకుంటున్నారు. సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలపై గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు సమర్పించి ‘సల్లండ సూడు తల్లీ’ అని వేడుకుంటే మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం యాటపోతులను, కోళ్లను సమర్పించి జాతర పరిసరాల్లో వంటలు చేసుకుని విందు భోజనాలు చేస్తున్నారు. అమ్మవార్ల మహాజాతర ముగిసినప్పటికీ తల్లులను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర పరిసరాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే సుమారు నాలుగు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. logo