గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 10, 2020 , 03:40:34

పట్టించుకోకుంటే ప్రాణాంతకమే

పట్టించుకోకుంటే ప్రాణాంతకమే
  • పట్టించుకోకుంటే ప్రాణాంతకమే

రెడ్డికాలనీ, ఫిబ్రవరి 09: నులి పురుగులను నలిపేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నులి పురుగుల నివారణకు ఒకటి నుంచి 19ఏళ్ల లోపు వారందరికీ అల్బండజోల్‌ మాత్రల పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. కాగా,  జిల్లాలోని 2.86 లక్షల మందికి మాత్రలు అందించేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టర్‌ సమక్షంలో అన్ని విభాగాల అధికారులు సభ్యులుగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో అందరికీ తగు ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని పిల్లలకు మాత్రలు  అందించనున్నారు. ఇప్పటికే 603 ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్‌ స్కూళ్లలో 56,035 మంది నమోదయ్యారు. అలాగే 23 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 6,970, 70ప్రైవేటు కళాశాలల్లో 37,148 ఎనిమిది వొకేషనల్‌ కళాశాలలో 2052, 12 టెక్నికల్‌ ఇనిస్టిట్యూషన్స్‌లోని  6392 మంది , 428 ప్రైవేటు పాఠశాలలోని 1,18,805, అలాగే 9 కేంద్రియ, నవోదయ విద్యాలయాల్లో 2991 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ఏడబ్ల్యూసీఎస్‌ 1-5 సంవత్సరాల పిల్లలు 48,760 మంది  ఉన్నట్లుగా అధికారుల రికార్డులు చెబుతున్నారు.  మొత్తం సుమారు 2.86 లక్షల మందికి ఆల్‌బెండజోల్‌ మాత్రలు అందజేయనున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు. 

నులి హానికరమే..

నులిపురుగులు ప్రాణానికే ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. నులి పురుగులు కలిగిఉన్న పిల్లల్లో రక్తహీనత ఏర్పడడంతోపాటు పోషకాహార లోపం, ఆకలి లేకపోవుట, బలహీనత, కడుపునొప్పి, వికారం, వాంతులు, అతిసారం, బరువుతగ్గుడం లాంటి సమస్యలు బాధిస్తాయి.  గ్రామాల్లో చాలా మంది బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం, పాదరక్షలు ధరించకుండా అపరిశుభ్ర ప్రదేశాల్లో తిరగడం, చేతులు సరిగ్గా కడుక్కోకుండానే ఆహారం తినడం ద్వారా నులిపురుగులు సంక్రమిస్తాయి. పిల్లల్లో సాధారణంగా మూడు రకాల క్రీములు కనబడుతాయని, అవి ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అని వైద్యులు తెలిపారు. 

లక్షణాలు..

మల ద్వారం దగ్గర దురదగా ఉండడం, పళ్లు రాత్రి పూట కొరుకుతూ ఉండడం, ఎంత తిన్నా బరువు పెరుగకపోవడం, క్రమక్రమంగా బరువు తగ్గిపోవడం, కడుపులో నొప్పి తరచుగా రావడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, మానసికంగా, శారీరకంగా, అస్థిమితంగా ఉండడం, మలంలో చిన్నచిన్న పురుగులు కనపడడం, మలబద్ధకం, వికారం, వాంతులు, కడుపులో గ్యాస్‌ పేరుకుపోయినట్లు అనిపించడం, రాత్రి వేళల్లో సరిగా నిద్ర పట్టకపోవడం, రక్తహీనత ఏర్పడడం, చర్మంపై దద్దుర్లు, చర్మం చిట్లినట్లు మారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు నులి పురుగుల వ్యాప్తితో కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 

జాగ్రత్తలు..

నులి పురుగుల బారిన పడకుండా ఉండేందు కు వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సరిగా ఉడికించిన ఆహారం తినడం, ముఖ్యంగా పరిశుభ్రమైన నీరు తాగడం, ఆరుబయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండడం, ఇంట్లో ఈగలు, ఇతర పురుగులు రాకుండా చూడడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.  


logo
>>>>>>