ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 10, 2020 , 03:35:33

అగ్రంపహాడ్‌లో కొనసాగుతున్న మొక్కులు

అగ్రంపహాడ్‌లో కొనసాగుతున్న మొక్కులు

ఆత్మకూరు, ఫిబ్రవరి 09 : మినీ మేడారం అగ్రంపహాడ్‌ జాతరలో భక్తులు వన దేవతలకు ఆదివారం మొక్కులు చెల్లించుకున్నారు.  సమ్మక్క, సారలమ్మలు శనివారం వన ప్రవేశం  చేసినప్పటికీ భక్తులు కుటుంబ సమేతంగా గద్దెలపై ఎత్తుబెల్లం (బంగారం), పసుపు, కుంకుమ భరిణి, ఒడిబియ్యంతో పూజలు చేశారు. సెలవుదినం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. ఎదురుకోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇచ్చారు. జాతర ప్రాంగణంలో విడిది చేశారు. అనంతరం భక్తులు మళ్లీ  రెండేళ్లకు వస్తాం అంటూ ఇంటిబాట పట్టారు.

  వర్షంలోనూ మొక్కులు

  రెండు రోజుల నుంచి చిరు జల్లులతో వాతావరణం చల్లబడింది. అయినప్పటికీ జాతరలో భక్తుల సందడి నెలకొంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. కాగా,  వారం రోజుల పాటు జన సందోహంతో నిండిపోయిన జాతర ప్రాంగణం ఒక్కసారిగా చిన్నబోయింది. ఆదివారం ఖాళీ గుడారాలతో కనపడింది.  కాగా,  మినీ మేడారంలో వారం రోజులు నుంచి భక్తులు వేసిన ప్లాస్టిక్‌ కాగితాలు చెత్తా చెదారంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పందులు సంచారం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హుండీల తరలింపు

 అగ్రంపహాడ్‌ సమ్మక్క సారలమ్మ జాతరలో ఏర్పాటు చేసిన 38 హుండీలను ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య వరంగల్‌లోని మట్టెవాడలో ఉన్న బట్టల బజార్‌ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి  తరలించినట్లు ఈవో ధనుంజయశర్మ తెలిపారు. హుండీలను పరకాల ఆర్డీవో కిషన్‌, తహసీల్దార్‌ ఎస్‌కే ముంతాజ్‌, సీఐ రంజిత్‌కుమార్‌, సర్పంచ్‌ మాదాసి అన్నపూర్ణ రాజు, ఎంపీటీసీ బొమ్మగాని భాగ్యరవి, జాతర చైర్మన్‌ కత్తెరశాల మల్లేశం, డైరెక్టర్లు చెంచు ప్రభాకర్‌, గుండెబోయిన రాజన్న, మోరే మహేందర్‌ ఆధ్వర్యంలో డీసీఎం వాహనంలో తరలించారు. హుండీలను సోమవారం ఉదయం 11 గంటలకు లెక్కించనున్నట్లు ఈవో తెలిపారు.


logo