బుధవారం 08 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 08, 2020 , 03:40:44

టీఆర్‌ఎస్‌ మద్దతుదారులదే గెలుపు

టీఆర్‌ఎస్‌ మద్దతుదారులదే గెలుపు

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ పదవి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్‌)ల ఎన్నిక పూర్తయిన తర్వాతే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశాల ప్రకారం డీసీసీబీ చైర్మన్‌ అభ్యర్థి ఎన్నిక జరపాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన శుక్రవారం హన్మకొండలోని ఆయన క్యాంపు ఆఫీస్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ కీలక నేతల సమన్వయ సమావేశం జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య, శాసనమండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, నర్సంపేట, వర్ధన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ జీ సుధీర్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నేతలు కే వాసుదేవరెడ్డి, గుజ్జ సంపత్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించేలా వ్యూహం అమలు చేయాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు నిర్ణయించారు. గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని మొత్తం 90 వ్యవసాయ సహకార సంఘాల్లోని ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ)ని కైవసం చేసుకునే విధంగా కార్యాచరణ ఉండాలని అన్నారు. అన్ని పీఏసీఎస్‌ల చైర్మన్‌ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. గత వరుస ఎన్నికల మాదిరిగానే సహకార ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే గెలుస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రభుత్వానికి రైతులు మద్దతు తెలపాలని కోరారు. పంట పెట్టుబడి సాయానికి రైతుబంధు, రైతు బీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటు ప్రతి ఎకరానికి సాగునీరు అందించేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తుందని అన్నారు. సహకార ఎన్నికల్లో రైతులు టీఆర్‌ఎస్‌ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు రైతులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మొత్తం 9 పురపాలక సంఘాల్లో టీఆర్‌ఎస్‌కు విజయం అందించిన ప్రజలు, పార్టీ కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మేడారం సమ్మక్క సారక్క జాతరను విజయవంతం చేస్తున్న అధికారులు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లితో పాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అభినందనలు చెప్పారు. మేడారం జాతరకు వచ్చిన గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్‌కు సమావేశంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ధన్యవాదాలు తెలిపారు.


logo