గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Feb 01, 2020 , 03:54:08

మేడారం భక్తజన ప్రవాహం..!

మేడారం భక్తజన ప్రవాహం..!
  • ఒక్కరోజే తరలివచ్చిన 5 లక్షల మంది భక్తులు
  • జంపన్నవాగులో స్నానాలు
  • తల్లుల దర్శనానికి బారులు
  • నిలువెత్తు బెల్లం, చీరె, సారెతో మొక్కులు

ములుగు, నమస్తే తెలంగాణ/తాడ్వాయి/ములుగు రూరల్‌: మేడారం జనప్రవాహంగా మారుతున్నది. వనం జనంతో నిండిపోతున్నది. మహాజాతరకు గడువు సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సు మారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు చెల్లించారు. గత జాతరతో పోలిస్తే ఈ జాతర సమయంలో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు కుటుంబాల సమేతంగా వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. జంపన్నవాగు శుక్రవారం జలకళతో దర్శనమిచ్చింది. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నుంచి జంపన్నవాగుకు విడుదల చేసిన నీరు శుక్రవారం సాయంత్రం మేడారంలోని జంట వంతెనలను ముద్దాడింది. భక్తులు అందులో స్నానాలు చేశారు. ‘జంపన్నవాగులో అబ్బియా.. జాలారు బండల్లో అబ్బి యా..’ అంటూ పూనకాలతో ఊగిపోయారు. మహిళలు వ రాలు పట్టారు. కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. కాలినడకన తల్లుల గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో  క్యూలైన్‌ ద్వారా భక్తులను అనుమతించారు. భక్తులు అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తు బెల్లం, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో పలువురు తప్పిపోగా మీడియా సెంటర్‌ వద్ద ఉన్న అనౌన్స్‌ మెంట్‌ను ఆశ్రయించి మైక్‌ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పార్కింగ్‌లోకి వాహనాలను మళ్లించారు. ప్రధాన ద్వారం వద్ద వీఐపీలకు మాత్రమే దర్శనానికి అనుమతిచ్చారు. కాగా, సమ్మక్క-సారక్కను వరంగల్‌ మేయర్‌ గుండ ప్రకాశ్‌రావుతో పాటు కౌన్సిలర్లు, కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి సంఘమేశ్వర్‌ దర్శించుకున్నారు. 



logo