ఆదివారం 29 మార్చి 2020
Warangal-city - Feb 01, 2020 , 03:46:31

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
  • ఎంజీఎం సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌
  • అభివృద్ధి పనుల పరిశీలన

వరంగల్‌ చౌరస్తా, జనవరి 31: ఉత్తర తెలంగాణలోని పేద ప్రజలకు వైద్యసేవలందిస్తున్న వరంగల్‌ ఎంజీఎంలో సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పని చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. శుక్రవారం ఎంజీఎంలో  దవాఖాన సూపరింటెండెంట్‌, వివిధ విభాగాల అధిపతులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రత్యేక కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎంజీఎంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్య తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్పొరేట్‌స్థాయిలో వైద్యం అందించడానికి అవసరమైన ఆధునిక పరికరాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం సుమారు రూ.3.5 కోట్ల నిధులతో చేపట్టిన 15 రకాల అభివృద్ధి పనులను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పారు. నాణ్యతలో లోపం ఉంటే బిల్లులు చెల్లించవద్దని అధికారులకు తెలిపారు. అనంతరం అభివృద్ధి పనులు చేస్తున్న విభాగాలను ఆయన సందర్శించి, తగిన సూచనలు చేశారు. అదే విధంగా పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు.  డీఎంహెచ్‌ఓతో చర్చలు జరిపి ప్రస్తుతం పాత భవనంలో కొనసాగుతున్న కుష్ఠు వ్యాధి నివారణ విభాగాన్ని మరో భవనంలోకి మార్చిన తర్వాత కూల్చివేతకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రి ఆవరణను 12 విభాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ప్రత్యేకంగా పారిశుధ్య సూపర్‌వైజర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు.  ఏ విభాగంలోనైతే పారిశుధ్య చర్యలు పాటించరో వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావుతో పాటుగా సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ డాక్టర్‌ హరీశ్‌రాజ్‌, ఆర్‌ఎంఓ వెంకటరమణ, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. 


logo