బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 31, 2020 , 03:27:51

సహకార సమరం

సహకార సమరం

సుబేదారి, జనవరి 30: సహకార సంఘాలకు ఎన్నికల సైరన్ మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం పీఏసీఎస్‌లకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వరంగల్ అర్బన్ జిల్లాలోని 12 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లాలో ఖిలా వరంగల్, ధర్మసాగర్, ఆత్మకూరు, ఖాజీపేట దర్గా, హన్మకొండ, సింగారం, నందనం, కమలాపూర్, ఎల్కతుర్తి, పెగడపల్లి, హసన్‌పర్తి, మల్లారెడ్డిపల్లి, వంగపహాడ్ మొత్తం 12 సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీల్లో 26 వేల మంది ఓటర్లు ఉన్నారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 2018 డిసెంబర్‌తో ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ పాలకవర్గాల పదవీ కాలన్నీ ఇప్పటిదాకా పొడిగిస్తూ వచ్చింది. అయితే సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల ముగిశాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికలు సైతం పూర్తయ్యాయి. ఇక మిగిలింది ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు మాత్రమే. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం వీటికి సైతం ఎన్నికలు నిర్వహించేందుకు  కసరత్తు ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికల తర్వాత పీఏసీఎస్ ఎన్నికలు ఉంటాయనే ఊహగానాలు ఊపందుకున్నట్లుగానే  ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ గ్రామాల్లో రాజకీయవేడి మొదలైంది.  

ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల  ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా సహకార శాఖ 3వ తేదీన జిల్లాస్థాయిలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 6వ తేదీ నుంచి 8 తేదీ వరకు సొసైటీ కేంద్రాల్లో నామినేషన్లను స్వీకరిస్తారు. 9వ తేదీన స్క్రీనింగ్ ఉంటుంది. 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు చివరిగడువు. 15వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. 16వ తేదీన ఆఫీస్‌బేర్స్( చైర్మన్, వైస్‌చైర్మన్) ఎన్నిక ఉంటుంది. ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ప్రతి సొసైటీకి 13 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన డైరెక్టర్ల నుంచి ఒకరిని చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 

అధికారులు సిద్ధం..

జిల్లాలోని 12 సొసైటీల ఎన్నికల కోసం జిల్లా సహకారశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలోనే నోటిఫికేషన్ వస్తుందనే సమాచారంతో అధికారులు ఎన్నికల కార్యాచరణ రూపొందించారు.  వ్యవసాయ శాఖ నుంచి అధికారులను ఒక్కొ సొసైటీకి ఎన్నికల అధికారులుగా నియమించే ప్రక్రియ సైతం మొదలైంది.  

రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలోని పీఏసీఎస్‌లకు రిజర్వేషన్లను జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసింది. సొసైటీ వారీగా జనరల్, మహిళ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలుగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో  గ్రామాల్లో రాజకీయ వేడి ఊపందుకుంది. పోటీ చేయడానికి ఆసక్తి ఉన్నవారు బరిలో నిలిచేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. చైర్మన్ రేసులో ఉన్నవారు రాజకీయ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తు కాకుండా ఎన్నికల సంఘం కేటాయించిన (సర్పంచ్) ఎన్నికల మాదిరిగా గుర్తులతోనే జరుగుతాయి. చైర్మన్ కావాలంటే ముందు డైరెక్టర్‌గా గెలువాల్సి ఉంటుంది.  మెజార్టీ డైరెక్టర్ల మద్దతు ఉన్నవారు చైర్మన్ ,వైస్‌చైర్మన్‌గా ఎన్నికవుతారు.  శుక్రవారంనుంచి సొసైటీల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు బయటికి వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో గ్రామాల్లో మళ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది.


logo
>>>>>>