గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 31, 2020 , 03:16:49

దేవుడి పేరుతో బురిడీ..

దేవుడి పేరుతో బురిడీ..

వరంగల్ క్రైం, జనవరి30 : ఇంట్లో పనిమనిషిగా చేరిన ఓ మహిళ ఇంటి యాజమాని అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పూజల పేరిట లక్షలాది రూపాయలు దోచుకోవడమేగాక, అతడి బంధువులను సైతం మోసం చేసిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో మాయలేడీతోపాటు మరోవ్యక్తిని గురువారం వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమాలాపూర్ మండలం వంగర గ్రామానికి చెందిన కొలిపాల పద్మ అలియాస్ రేణుక (50), జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామానికి చెందిన తులిసేగారి రాజబాబు (42) హన్మకొండలోని జూలైవాడలో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముంజ వెంకటస్వామి ఇంట్లో మూడేండ్ల క్రితం పని మనిషులుగా చేరారు. వెంకటస్వామి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న పద్మ పూజల పేరిట డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. రాజబాబు సహకారాన్ని తీసుకొని తన దోపిడీని కొనసాగించింది. వెంకటస్వామి కుమారుడు, కూతురు విదేశాల్లో ఉంటుండటంతో పనిమనిషి పద్మను వీరు సొంతమనిషిలాగా నమ్మారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం వీరి మనుమడికి అనారోగ్యం ఏర్పడడంతో రేణుక ఎల్లమ్మ దేవత ఆవహించిందని, దీనిని నయం చేసేందుకు పూజలకు రూ.4 లక్షల ఖర్చు అవుతుందని నమ్మించింది. నమ్మిన వెంకటస్వామి ఆమె అడిగినంత డబ్బు ఇచ్చాడు. ఇదే క్రమంలో ఓ రోజు వెంకటస్వామి ఇంటికి వచ్చిన అతడి బంధువు వెంకటరమేశ్ అనారోగ్యంతో ఉండడంతో అతనికి ప్రాణగండం ఉందని చెప్పిన రేణుక పూజలతో నయం చేసేందుకు రూ.11 లక్షలు తీసుకుంది. ఇంటి యాజమాని వెంకటస్వామి గత సంవత్సరం ఫిబ్రవరిలో గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరడంతో నిందితురాలు మళ్ళీ అదే పూజల పేరిట రూ.25 లక్షలు డిమాండ్ చేసింది. అతడి ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే డబ్బులివ్వాలని గొడవ చేయడంతో రూ.10 లక్షలు చెల్లించారు. మిగితా రూ.15 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకొని వెంకటస్వామి ఉద్యోగ పదవి విరమణ అనంతరం చెల్లించాలని కోరింది. లేకుంటే ఇల్లును జప్తు చేసుకుంటామని బలవంతంగా సంతకాలు చేయించుకోవడంతో పాటు రెండు చెక్కులను తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మోసానికి తెగబడిన రేణుక ఈ నెల 6వ తేదీన వెంకటస్వామి ఇంటికి వచ్చి విదేశాల్లో ఉంటున్న మీ కుమారుడికి ప్రాణగండం ఉందని, రూ. 2 కోట్లు ఇస్తే పూజలు చేసి కాపాడుతానని బెదిరించింది. ఈ క్రమంలో గతంలో తమతో బలవంతంగా రాయించుకున్న దస్తావేజులను తిరిగి ఇవ్వాలని రేణుకను వెంకటస్వామి దంపతులు ప్రశ్నించడంతో రేణుక, రాజబాబు వీరిని ఇంట్లో తాళ్లతో బంధించి వెళ్లడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీసీఎస్, సుబేదారి పోలీసులు దర్యాప్తు చేసి నిందితులు పద్మ, రాజబాబును గురువారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.25.69 లక్షల నగదు, 6 లక్షల విలువైన 147 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇతర దస్తావేజులను, చెక్కులను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించినట్లు సీపీ విశ్వనాథ రవీందర్ వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఆయన అభినందించారు.

సిబ్బందికి అభినందనలు

నిందితులను పట్టుకోడంలో ప్రతిభ కనబరిచిన ఈస్ట్‌జోన్ డీసీపీ నాగరాజు, క్రైం ఏసీపీ బాబురావు, సీసీఎస్, సుబేదారి ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌కుమార్, అజయ్, సీసీఎస్ ఎస్సై బీవీఎస్ రావు, ఏఎస్సై శివకుమార్, పర్విన్, హెడ్‌కానిస్టేబుల్స్ అహ్మద్‌పాషా, దామోదర్, జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, సౌభాగ్య, సంధ్యారాణి వరంగల్ పొలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అభినందించారు. 


logo
>>>>>>