శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 29, 2020 , 04:18:51

ట్రాఫిక్‌ను నియంత్రించాలి

ట్రాఫిక్‌ను నియంత్రించాలి
  • సెక్టారు అధికారులు టీమ్‌ సిబ్బందికి అవగాహన కల్పించాలి
  • ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాల పార్కింగ్‌ లేకుండా చూడాలి
  • మేడారం జాతర ట్రాఫిక్‌ ఇన్‌చార్జి విశ్వనాథ రవీందర్‌
  • పోలీస్‌అధికారులతో ప్రత్యేక సమీక్ష

వరంగల్‌ క్రైం, జనవరి 28 : మేడారం జాతర నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని మేడారం జాతర ట్రాఫిక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ సూచించారు. ఫిభ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర సందర్బంగా ట్రాఫిక్‌ ఏర్పాట్లపై మంగళవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ములుగు ఎస్పీ సంగ్రాంసింగ్‌ గణపతిరావు పాటిల్‌, మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి, ట్రాఫిక్‌ జోన్లలో బందోబస్తు విధులు నిర్వర్తించే ఇన్‌చార్జి డీసీపీలు, అదనపు ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ జోన్‌లోని ప్రతి సెక్టారుకు ఒకరు లేదా ఇద్దరు అదనపు ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. సెక్టారు ఇన్‌చార్జిలు ఆ జోన్‌లో విధులు నిర్వర్తించే అధికారులకు, సిబ్బందికి అప్పగించిన విధులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుందన్నారు. పార్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చూడాలని కోరారు. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలపకుండా ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు ఓవర్‌టెక్‌ చేయకుండా చూడాలని, దీంతో ట్రాఫిక్‌ సమస్యలతో పాటు, ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. క్రమపద్ధతిలో వాహనాలు వెళ్లే విధంగా వాహనాదారులకు సూచనలు చేయాలన్నారు. 


పార్కింగ్‌ ప్రదేశాలల్లో ఏర్పాట్లు ..

పార్కింగ్‌ ప్రదేశాల్లో పూర్తిస్థాయిలో వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు జేసీబీ, రేడియం జాకెట్‌లు అందుబాటులో ఉంచుకోవాలని సీపీ సూచించారు. పార్కింగ్‌ ప్రదేశాలను గుర్తించేలా ప్రత్యేకమైన జెండాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కింగ్‌ సెంటర్‌లో తప్పనిసరిగా బారికేడ్లను ఏర్పాటు చేసుకోవాలని, విధులు నిర్వర్తించే అధికారులకు, సిబ్బందికి భోజనంతో పాటు మౌలిక వసతులను కల్పించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ నాగరాజు, రాచకొండ ట్రాఫిక్‌ డీజీపీ దివ్యాచరణ్‌రావు, ములుగు ఏఎస్పీ సాయిచైతన్య, ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌ గౌతం, అదనపు ఏఎస్పీలు మల్లారెడ్డి, భాస్కర్‌, రాజమహేంద్రనాయక్‌, గిరిరాజు, భీంరావు, ఏసీపీలు జనార్ధన్‌, డీఎస్పీ సంపత్‌రావు, శశిధర్‌, శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు. 


logo