శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 28, 2020 , 05:52:24

గులాబీ పీఠాలు

గులాబీ  పీఠాలు
  • పనిచేయకుంటే కౌన్సిలర్‌పై వేటు తప్పదు
  • కలెక్టర్‌కు ప్రత్యేక అధికారాలు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో త్వరలో చేపట్టనున్న ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంతో నగరాలు అభివృద్ధి చెందనున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలో ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్‌ ఆంగోతు అరుణ, వైస్‌ చైర్మన్‌ కోమాండ్ల ఎలేందర్‌రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసిన కౌన్సిలర్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆయన మున్సిపల్‌ కార్యాలయం వద్ద అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. కాంగ్రెస్‌, బీజేపీలు కనీసం పోటీలో కూడాలేవన్నారు. జనగామ పట్టణంలో కూడా 13 స్థానాల్లో గెలుపొందడంతో పాటు ముగ్గురు పార్టీకి చెందిన రెబల్‌ అభ్యర్థులు గెలిచినట్లు తెలిపారు. ఇదంతా ప్రజలకు టీఆర్‌ఎస్‌పై ఉన్న నమ్మకమేనన్నారు. అందుకని మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించినట్లు తెలిపారు. గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు.


 అలాగే, వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. లేకపోతే కౌన్సిలర్లను పదవుల నుంచి తొలగించే అధికారం నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం కలెక్టర్‌కు ఉంటుందన్నారు.  ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్‌, సభ్యులు పట్టణాల ప్రగతి కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్లను గెలిపించుకొని ఏకపక్షంగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను గెలిపించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇందుకోసం కష్టపడిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ యాదవరెడ్డి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు,  భిక్షపతి, నాగేశ్వర్‌రావు, యాకయ్య, నాయకులు పాల్గొన్నారు. 


logo