గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 28, 2020 , 05:47:33

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం
  • జిల్లాను రాష్ట్రంలోనే అగ్రభాగంలో నిలుపాలి
  • ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి
  • జెడ్పీ చైర్మన్‌ మారెపల్లి సుధీర్‌కుమార్‌ పిలుపు
  • వ్యవసాయ, ఆరోగ్యశాఖలపై జెడ్పీ సమావేశంలో చర్చ

అర్బన్‌ కలెక్టరేట్‌, జనవరి 27: రాష్ట్రంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎం సుధీర్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకా రం, సమన్వయంతో ముందుకుపోదామన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చైర్మన్‌ డాక్టర్‌ ఎం సుధీర్‌కుమార్‌ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉండటంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేడారం జాతర విధులు నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమావేశానికి హాజరు కాలే దు. వారిస్థానంలో అధికారులు కిందిస్థాయి ఉద్యోగులను పంపించారు. అయితే ఉదయం 11గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సుమా రు గంట ఆలస్యంగా ప్రారంభమై మధ్యాహ్నం 3గంటల వరకు నిర్వహించారు. ఎజెండాలోని అంశాలపై చర్చించారు. ముఖ్యంగా వ్యవసాయం, వైద్యారోగ్యం, గ్రామీణ నీటి సరఫరా, మిషన్‌భగీరథ, భూగర్భ జలాలు, మిషన్‌ కాకతీయ, పశుసంవర్ధకం, మైనార్టీ, స్త్రీ శిశు సంక్షేమం, విద్యుత్‌, జిల్లా పంచాయతీ, మైనింగ్‌ తదితర శాఖల ద్వారా చేపడుత్ను అభివృద్ధి పనుల గురించి సంబంధిత శాఖల అధికారులు సభ్యులకు వివరించారు. 


అక్షరాస్యతకు కృషి చేయాలి..

జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ అక్షరాస్యతలో చివరి స్థానంలో ఉందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి రాష్ట్రంలో వందశాతం అక్షర్యాసత సాధించాలనే ఉద్ధేశంతో ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందులో భాగంగా ‘ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌' కార్యక్రమాన్ని ప్రారంభించి అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేయాలన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పనిచేసి జిల్లాను రాష్ట్రంలో అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయాలన్నారు. సభ్యులు అధికారులు పరస్పర సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. అలాగే సభ్యులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వయోజన విద్యను పటిష్ట పర్చడంలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో వంద శాతం ఇంటి పన్నులను వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్ల పంపిణీలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమల్లో ఆరో స్థానంలో ఉందని తెలిపారు.  మాత శిశు మరణాల నివారణకు ఆస్పత్రుల్లో పారిశుధ్యం, మరమ్మతులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందించడంలో ట్రాన్స్‌కో అధికారుల కృషి మరువలేదని, ఆయన అభినందించారు. 


అధికారుల పనితీరుపై సభ్యుల అసహనం

సర్వసభ్య సమావేశంలో అధికారుల పనితీరుపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు  అధికారులు, ఉద్యోగులు పనిచేయడం లేదని అన్నారు.  వివిధ శాఖల ఉద్యోగులు గ్రామాలకు సక్రమంగా రావడం లేదన్నారు. అలాగే ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో అవగాహన కల్పించడం లేదన్నారు. వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పని తీరును తప్పుబట్టారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం లేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మైనింగ్‌ విషయంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇచ్చిన అనుమతులకు మించి పనులు జరుగుతున్నా.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. అంగన్‌వాడీ సెంటర్లకు అంగన్‌వాడీ టీచర్లు సక్రమంగా రావడం లేదని, గుడ్లు అందజేయడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో రోడ్లన్నీ గుంతలమయకావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వెంటనే ప్యాచ్‌ వర్కు ప్రారంభించాలని సభ్యులు కోరారు.  


రైతులకు అవగాహన కల్పించాలి

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు అవగాహన కల్పించాలని ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందం కోరారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావలంటే కమిషన్‌ ఏజెంట్ల వద్దకు కాకుండా సీసీఐ వద్దకు తీసుకువచ్చేలా రైతుల్లో చైతన్యం కల్పించాలన్నారు. రైతులకు ఏవో, ఏఈవోలు ప్రతి రోజు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఆయిల్‌ ఫామ్స్‌కు సంబంధించిన వివరాలను రైతులకు తెలియజేయాలని, ముఖ్యంగా రైతులకు ఇస్తున్న రాయితీలు, దానికి ఎవ్వరు అర్హులు, ఎంతవరకు సబ్సిడీ వస్తుందో తదితర అంశాలను రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వైస్‌ చైర్మన్‌  గజ్జెల్లి శ్రీరాములు అన్నారు. తద్వారా రైతులు లబ్ధిపొందడంతో పాటు వారి జీవనప్రమాణాలు పెంపొందించుకుంటారన్నారు.


మార్కెట్‌ చైర్మన్‌కు సన్మానం

ఏనుమాముల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందను పుష్పగుచ్ఛం అందజేసి  శాలువాతో సన్మానించారు. సదానందం చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి హాజరు కావడంతో జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌తో పాటు సభ్యులు, అధికారులు కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జెడ్పీసీఈవో ప్రసూనారాణి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జెల శ్రీరాములు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, కో ఆప్షన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


logo
>>>>>>