గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 27, 2020 ,

ప్రగతి పథం.. ప్రభుత్వ ధ్యేయం

ప్రగతి పథం.. ప్రభుత్వ ధ్యేయం

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ప్రగతి పథం. ఇదే ప్రభుత్వం ధ్యేయమని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమరంగాల్లో రాష్ట్రంలోనే చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత గల స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ అందరి సహకారంతో ముందుకుసాగుతుందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి జిల్లా ప్రజలకు ప్రగతి సందేశాన్నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభ్యున్నతి కి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నదన్నారు. పల్లె ప్రగతి ద్వారా ప్రస్తుతం పల్లెలు మురిసిపోతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలే కాకుండా పారిశ్రామిక, ఉపా ధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్‌కిట్ల పంపిణీలో జిల్లా నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని ఆయన సగర్వంగా ప్రకటించా రు. అలాగే ఒక్కో రంగంలో  ప్రగతి, పురోగమనంలో ఉన్న స్థితిని వివరించారు.  


పల్లె ప్రగతి..

పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో మార్పులు వచ్చా యి. ప్రతి జీపీకి జనాభా ప్రాతిపదికన నిధులు మంజూరవుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 97 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, వాటర్‌ ట్యాంకులు కొనుగోలు చేశాం.  రోడ్లకు ఇరువైపులా లక్ష 40 వేల మొక్కలను నాటి హరితపల్లెల నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో డం పింగ్‌ యార్డు, వైకుంఠధామాలు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాలను ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా అడుగులు పడుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.   


 మిషన్‌భగీరథ-అమృత్‌ పథకం

వరంగల్‌ మహానగరానికి వచ్చే 30 ఏళ్ల  వరకు శుద్ధి చేసిన సురక్షిత తాగునీటిని అందించడమే లక్ష్యంగా రూ.630 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా మహా నగరపాలక పరిధిలోని 43 విలీన గ్రామాలకు మార్చి నెల చివరి నాటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. 


పరిశ్రమల స్థాపన-ఉపాధి అవకాశాలు

పారిశ్రామీకరణతో ప్రజలకు  ఉపాధి లభించి  తద్వారా తలసరి ఆదాయం, వినియోగం, వ్యయం పెరగడంతో పాటుగా మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల మడికొండ ఐటీ సెజ్‌లో రెండు ఐటీ కంపెనీలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.  అంతేకాకుండా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వం టాస్క్‌ కేంద్రాన్ని మంజూరు చేసిందన్నారు.  


వ్యవసాయ,  అనుబంధ రంగాల్లో..  

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు బంధు పెట్టుబడి సహాయం, రాయితీతో విత్తనాలు, ఆధునిక పనిముట్లను అందిస్తూ ఖరీఫ్‌  లో రూ.81 కోట్లను 71 వేల మంది రైతులకు నేరుగా ఖాతాల్లో జమ చేశామన్నారు. అదేవిధంగా మృతి చెందిన 68 మంది రైతులకు రూ.3 కోట్లను వారి సంబంధీకుల ఖాతాలలో జమ చేశామని కలెక్టర్‌ చెప్పారు. అంతేకాకుండా గొర్రెల పెంపకందారులైన  గొల్ల, కురుమలకు జీవనోపాధిని పెంచామన్నారు.  ఈ సంవత్సరం బీ కేటగిరి లో ఉన్న 5,744 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.18 కోట్లు ఖర్చుచేసి 1402 యూనిట్లను పంపిణీ చేశామని కలెక్టర్‌ చెప్పారు. అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధి కోసం జిల్లాలోని 561 చెరువుల్లో, 131 లక్షల చేప పిల్లలను ఉచితంగా కలిపినట్లు తెలిపారు. రూ.19 కోట్లతో   2094 రకాల వస్తువులను, వాహనాలను సబ్సిడీ ద్వారా అందించామన్నారు.  


ఆదర్శ సంక్షేమం 

అభివృద్ధి కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూనే సంక్షేమాన్ని ఆదర్శంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఎకనామిక్‌ సపోర్టు పథకాలు, ప్రీ మెట్రిక్‌, పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల ద్వారా జిల్లాలో ఈ ఏడాది రూ. 121 కోట్లను  లక్ష 27 వేల మందికి అందజేసినట్లు తెలిపారు.  నిరుపేదలకు గుణాత్మక విద్యను, బలమైన పౌష్టిక హారం అందించేందుకు  23 బీసీ, గిరిజన, మైనా ర్టీ గురుకుల కళాశాలు/పాఠశాలలో 7,500 మం ది ప్రయోజనం పొందుతున్నారన్నారు. రూ.92 కోట్ల  ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌ ఉపకార వేతనాలను 59 వేల మంది విద్యా ఉన్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. జిల్లాలో ఆసరా పెన్షన్ల కింద  లక్ష 11 వేల మందికి ప్రతినెలా రూ.24 కోట్లు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. 


  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఇప్పటివరకు రూ.35.25 కోట్ల  ఆర్థిక సహాయాన్ని 3,643 మంది పేదింటి ఆడపిల్లలకు పెండ్లి కానుకగా ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సఖీ కేంద్రం ద్వారా హింసకు గురైన మహిళలు, బాలికలకు అవసరమైన సేవలందిస్తున్నామని చెప్పారు.  


వైద్య ఆరోగ్యంలో రాజీలేని.. 

అందరికీ వైద్యం, ఆరోగ్యాన్ని అందించాడన్ని  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిందని కలెక్టర్‌ పేర్కొంటూ  జిల్లాలో ఇప్పటివరకు 14,095 ప్రసవాల్లో 76 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగాయన్నారు.  కేసీఆర్‌ కిట్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని ప్రకటించారు. 108 అంబులెన్స్‌లు, అమ్మఒడి (102) కింద గర్భిణులను నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లి సుఖ ప్రసవాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ప్రధాన ఆస్పత్రులల్లో మెరుగైన వైద్యసేవలు అందించడమే కాకుండా ఉత్తర తెలంగాణకే తలమానికంగా మారిన  ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్‌, రీజినల్‌ ఐ హాస్పిటల్‌, చెస్ట్‌ టీబీ హాస్పిటల్‌  సేవల్ని అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.     


 పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకం

వరంగల్‌ మహానగర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా హృద య్‌, స్మార్ట్‌ సిటీ పనులు పురోగతిలోఉన్నాయన్నారు. వేయిస్తంభాల గుడి, పద్మాక్షి గుట్టపై ఉన్న  జైన్‌ విగ్రహాల పరిరక్షణ, సందర్శకుల కోసం  అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాజీపేట దర్గా పునర్‌నిర్మాణం, వరంగల్‌ కోటలో పురావస్తు కట్టడాల మరమ్మతులు, లైటింగ్‌ సీసీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. ఈ పనులన్నీ హృదయ్‌ పథకం కింద చేపట్టగా  రూ. 20 కోట్లతో భద్రకాళీ చెరువు సుందరీకరణ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందని పేర్కొన్నారు. నగరంలోని ప్రధాన రహదారులకు స్మార్ట్‌ సిటీ శోభను సంతరించేలా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వరంగల్‌ నగరాన్ని సుందరీకరించేందుకు ప్రత్యేక దృష్టి సారించారని ఈ సందర్భంగా కలెక్టర్‌ గుర్తుచేశారు.  కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో రూ. 673 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ.150 కోట్లతో 14 కిలోమీటర్ల వ్యయంతో ఇన్నర్‌ రింగ్‌రోడ్‌,  మడిపెల్లి వంటి ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో టౌన్‌షిప్‌ అ భివృద్ధి జరుగుతుందన్నారు. అదేవిధంగా రాంపూర్‌లో 70 ఎకరాల సువిశాల ప్రదేశంలో  ఆక్సిజన్‌ పార్కు నిర్మాణం  చేపట్టామని కలెక్టర్‌ వివరించారు.   


 ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు

ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ కోసం జిల్లాలో 205 నివాసిత గ్రామాల్లో 179 తాగునీటి ట్యాంకుల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. మరో 79,914 ఇళ్లకు ఉచితంగా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. 


 పుష్కలంగా విద్యుత్‌

ఉత్తర విద్యుత్‌ సంస్థ ద్వారా అంతరాయం లేకుండా 24 గంటల పాటు గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కరంటు సరఫరా అవుతున్నదన్నారు. దాదాపు రూ.75 కోట్ల వ్యయంతో విద్యుత్‌ అభివృద్ధికి ఖర్చుచేసి వినియోగదారులకు మెరుగైన కరంటు సరఫరా చేస్తున్నామన్నారు.  అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి నిర్మాణాత్మక రీతిలో సహకారం, సూచనలు అందజేస్తున్న రాష్ట్ర  పచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజనస్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలందరికీ  కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.  ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు.  


logo