సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 25, 2020 , 02:53:21

సూపర్ స్ట్రక్చర్లకు ఓనర్ షిప్

సూపర్ స్ట్రక్చర్లకు ఓనర్ షిప్
  • సొంత ఆదాయం పెంచే దిశలో గ్రేటర్ నిర్ణయం
  • 75 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు మహానగర పాలక సంస్థ గ్రీన్‌సిగ్నల్
  • హరితహారంపై సభ్యుల అసంతృప్తి
  • ప్రజా సమస్యలను చర్చించని కౌన్సిల్

వరంగల్,నమస్తేతెలంగాణ : మహా నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సొంత ఆదాయం పెంచుకునే దిశలో నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం మేయర్ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. 12 గంటలకు ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం 1.30 నిమిషాలకు ముగిసింది. కౌన్సిల్ సమావేశం ముందుకు వచ్చిన 5 ఎజెండా అంశాల్లో నాలుగు అంశాలను ఆమోదించిన సభ్యులు ఒక అంశాన్ని తిరస్కరించారు. హరితహారంపై సభలో సభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా మహిళా సంఘాలు పెంచిన లక్ష మొక్కలు కొనుగోలు చేయాలన్న అంశంపై సమావేశంలో రచ్చ జరిగింది. స్వపక్ష సభ్యులే గ్రేటర్ కార్పొరేషన్‌లో హరితహారం విఫలమైందన్నారు. ఇప్పటి వరకు హరితహారంలో ఖర్చు చేసిన నిధులు ఎన్ని, నాటిన మొక్కలు ఎన్ని అంటూ డివిజన్ల వారీగా అందజేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో హరితహారంలో భాగంగా కౌన్సిల్ ఆమోదంతో కార్పొరేటర్లు డివిజన్లలో కార్మికులను ఏర్పాటు చేశామని, వారికి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ నుంచి ఏజెన్సీకి బిల్లులు చెల్లించినప్పటికీ కార్పొరేటర్లు నియమించిన కార్మికులకు డబ్బులు చెల్లించలేదని, అవి ఎక్కడికి వెళ్లాయంటూ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై చీఫ్ హర్టికల్చర్ అధికారి సునీత చెప్పిన సమాధానంతో సభ్యులు సంతృప్తి చెందలేదు. దీంతో మేయర్  స్పందిస్తూ ఏజెన్సీని పిలిపించి కార్మికులకు డబ్బులు చెల్లించారా? లేదా అనే విషయం తెలిసుకుంటామని, చెల్లించని పక్షంలో ఏజెన్సీపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. దీంతో సభ్యులు శాంతించారు. చివరకు మహిళా సంఘాల నుంచి లక్ష మొక్కలు కొనుగోలు చేసే అంశంలో ఎండాకాలం వరకు మొక్కల సంరక్షణ బాధ్యత మహిళా సంఘం తీసుకునేలా షరత్ విధించాలన్న డిమాండ్‌తో సభ్యులు ఆమోదం తెలిపారు.

సూపర్ స్ట్రక్చర్‌కు ఆమోదం

కార్పొరేషన్ పరిధిలోని సూపర్ స్ట్రక్చర్ నిర్మాణాలకు ఓనర్ షిప్ సర్టిఫికెట్లను జారీ చేసే అంశానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్ సమావేశంలో టేబుల్ ఎజెండాలో మొదటి అంశంగా వచ్చిన సూపర్ స్ట్రక్చర్ గృహాలకు ఓనర్ షిప్, అసెస్‌మెంట్ అందజేయాలన్న అంశంపై సభ్యులు చర్చించారు. ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన గృహాలను సూపర్ స్ట్రక్చర్‌గా అధికారులు గుర్తిస్తున్నారు. కేవలం ఆస్తి పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 12,400 సూపర్ స్ట్రక్చర్ గృహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సూపర్ స్ట్ట్రక్చర్ గృహాలకు ఓనర్ షిప్, అసెస్‌మెంట్ సర్టిఫికెట్లు అందజేస్తే యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతుందని దీని ద్వారా కార్పొరేషన్ ట్రాన్స్‌ఫర్ డ్యూటీ పన్నులో 98 శాతం వస్తుందన్నారు. అలాగే పేరు మార్పిడి ద్వారా రిజిస్ట్రేషన్ విలువలో 1 శాతం వస్తుందని అధికారులు వివరించారు. దీని ద్వారా కార్పొరేషన్‌కు సుమారు  25 నుంచి 30 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని డిప్యూటీ కమిషనర్ గోధుమల రాజు సభకు వివరించారు. దీనిపై సభ్యులు సవివరంగా చర్చించారు. తాతముత్తాల నుంచి వారసత్వంగా వచ్చి ఎలాంటి డాక్యుమెంట్లు లేని సూపర్ స్ట్రక్చర్ గృహాలకు  ఓనర్‌షిప్, అసెస్‌మెంట్ కాపీలను ఎలా అందజేస్తారో వాటి మార్గదర్శకాలను అందజేయాలని  సభ్యులు కోరారు. ఈ అంశాన్ని వీలిన గ్రామాలకు సైతం వర్తింపజేయాలని వీలిన గ్రామాల కార్పొరేటర్లు కోరారు. కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చే ఈ అంశానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం       తెలిపారు.

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై చర్చ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కార్పొరేషన్ ఎదుట ఏర్పాటు చేయాలని సభలో చర్చ జరిగింది. కార్పొరేటర్లు జోరిక రమేశ్, బోడ డిన్నా, చింతం సదానందం విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 26న మొదట అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసిన తర్వాతే జాతీయ జెండాను ఆవిష్కరించాలని కోరారు. దీనిపై సుమారు అరగంట పాటు కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. 27వ డివిజన్ కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్ మాట్లాడుతూ.. తన డివిజన్ పరిధిలోని పోతన ఆడిటోరియం ముందు ఉన్న పోతన విగ్రహం తొలగించారని తిరిగి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీనిపై మేయర్ గుండా ప్రకాశ్‌రావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఎదుట మహాత్మగాంధీ, అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

 75 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్

గ్రేటర్ పరిధిలో వందశాతం ఇంటింటి చెత్త సేకరణ కోసం మరో 75 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై సభ్యులు సమగ్రంగా చర్చించారు. స్వచ్చ ఆటోల నిర్వహిస్తున్న వారికి ప్రజలు డబ్బులు చెల్లించడం లేదని, దీంతో వారు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎంహెచ్‌వో డాక్టర్ రాజారెడ్డి స్పందిస్తూ  నగరంలో 163 స్వచ్ఛ ఆటోలు ఉన్నాయని అన్నారు. వాటిలో 13 పని చేయడం లేదని అన్నారు. గతంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రస్తుతం 90 శాతం స్వచ్ఛ ఆటోలు పని చేస్తున్నాయని అన్నారు. డబ్బులు చెల్లించని డివిజన్ల నుంచి స్వచ్ఛ ఆటోలను ఇతర డివిజన్లకు కేటాయించి పుష్‌కాట్‌ల ద్వారా చెత్త సేకరణ చేయాలని కార్పొరేటర్ నాగమళ్ల ఝాన్సీ అన్నారు.

ఒక్కటి తిరస్కరణ

కౌన్సిల్ సమావేశంలో 5 ఎజెండా అంశాల్లో నాలుగు ఆమోదించగా ఒక్కటి తిరస్కరించారు. కార్పొరేషన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మాదాసి మహేశ్‌కు సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పుట్టలమ్మ ఫిల్టర్ బెడ్ నిర్వహణ అంశాన్ని సభ్యులు వ్యతిరేకించారు. మిషన్ భగీరథలో భాగంగా అనేక విలీన గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ కాలువ నుంచి వచ్చే నీటితో పుట్టలమ్మ ఫిల్టర్ బెడ్ నిర్వహణ అవసరమా అని సభ్యులు ప్రశ్నించారు. దీనిపై మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం చర్చకు తీసుకురావాలని సభ్యులు అన్నారు. 

చర్చకు రాని ప్రజా సమస్యలు

కౌన్సిల్ సమావేశంలో ప్రజాసమస్యలు చర్చకు రాలేదు.  కౌన్సిల్ సమావేశం ముందుకు వచ్చిన  5 ఎజెండా అంశాల్లో  కొనుగోళ్లు, నిర్వహణ, పరిపాలన అంశాలు మాత్రమే ఉన్నాయి.  ప్రజా సమస్యలు లేక పోవడంపై పలువురు కార్పొరేటర్లు పెదవి విరువడం కనిపించింది. 

 కౌన్సిల్ సమావేశంలో ప్లాస్టిక్ నిషేధం

నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్న కార్పొరేషన్  అదే బాటలో నడుస్తున్నది. కౌన్సిల్ సమావేశంలో ప్లాస్టిక్ నిషేధాన్ని  అమలు చేశారు. గత సమావేశంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వినియోగించేవారు. అయితే ఈసారి ప్రతి కార్పొరేటర్ సీటు వద్ద స్టీల్ గ్లాస్‌లను పెట్టారు.  దీంతో పాటు కార్పొరేటర్లకు అందించే ఎజెండా ప్రతులను కాగితం కవర్‌లో అందజేశారు. logo