సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Jan 25, 2020 , 02:50:54

ఆర్టీసీ నమ్మకాన్ని నిలబెట్టేది డ్రైవర్లే..

ఆర్టీసీ నమ్మకాన్ని నిలబెట్టేది డ్రైవర్లే..
  • ఆర్టీసీ డ్రైవర్స్ డే కార్యక్రమంలో ఏసీపీ సారంగపాణి
  • ఉత్తమ డ్రైవర్లకు సన్మానం, ప్రశంసాపత్రాల అందజేత


సుబేదారి, జనవరి 24: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుఖవంతమైనదని, ఆర్ట్సీ నమ్మకాన్ని నిలబెట్టేది డ్రైవర్లేనని వరంగల్ ఏసీపీ ఎస్ సారంగపాణి అన్నారు. ఆర్టీసీ డ్రైవర్స్ డే సందర్భ
ంగా ములుగురోడ్డు ఆర్టీసీ శిక్షణ కళాశాలలో వరంగల్ రీజియన్‌కు చెందిన 9డిపోల ఉత్తమ డ్రైవర్ల్లను శుక్రవారం సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ముందుగా వరంగల్ రీజియన్‌లోని వరంగల్ 1,2 ,హన్మకొండ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, తొర్రూర్, మహబూబాబాద్, జనగాం డిపోల్లో విధి నిర్వహిణలో ఉన్న డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి డ్రైవర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హన్మకొండ బస్‌స్టేషన్‌లోని  వరంగల్ 1డిపోలో ఆర్‌ఎం ఏ శ్రీధర్, డిపో మేనేజర్ సురేశ్‌తో కలిసి డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ములుగురోడ్డులోని ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో రీజియన్‌లో 21మంది ఉత్తమ డ్రైవర్లను ఏసీపీ సారంగపాణి, ఆర్‌ఎం శ్రీధర్   సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను నిలబెట్టేది, ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేది డ్రైవర్లు మాత్రమేనని అన్నారు. డ్రైవర్ నిరంతరం అప్రమత్తంగా ఉండి డ్రైవింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణ ఆర్టీసీకి దేశంలోని ప్రజారవాణా రంగంలో మంచిపేరు ఉందని, ఈ నమ్మకాన్ని మరింత నిలబెట్టాలని ఆయన డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఏటా జనవరి 24న డ్రైవర్స్ డే నిర్వహిస్తూ, ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించడం సంస్థ పట్ల వారు కనబరుస్తున్న అంకితభావాన్ని గుర్తించడమేనని అన్నారు. ఆర్‌ఎం శ్రీధర్ మాట్లాడుతూ ఆర్టీసీ పేరు నిలబెట్టేది డ్రైవర్లేనని, సంస్థను నమ్ముకొని కష్టపడి అంకితభావంతో పనిచేయడం వల్లనే సంస్థ ముందుకు సాగుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివిజనల్ అధికారులు శ్రీనివాస్‌రావు, శ్రీదేవి, వరంగల్ 1, 2, హన్మకొండ డిపోమేనేజర్లు జీ సురేశ్, భానుకిరణ్, మోహన్‌రావు, డ్రైవర్లు పాల్గొన్నారు.logo