ఆదివారం 24 మే 2020
Warangal-city - Jan 24, 2020 , 04:51:38

తల్లుల సేవలో..

తల్లుల సేవలో..
  • - వనదేవతల జాతరకు పోటెత్తిన భక్తజనం
  • - గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు
  • - క్యూలైన్లలో దర్శనానికి అనుమతి
  • - ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమలతో మొక్కులు
  • - అమ్మవార్ల సేవలో ప్రముఖులు


తాడ్వాయి/ వెంకటాపురం(నూగూరు), జనవరి 23: మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క-సారక్క తల్లుల గద్దెలను దర్శించుకునేందుకు గురువారం బారులుతీరారు. వరాలిచ్చే తల్లులు, వనదేవతలకు ముందస్తుగా మొక్కులు అప్పగించేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా మేడారం వచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భక్తులు వివిధ వాహనాల్లో మేడారం చేరుకున్నారు. జంపన్నవాగు వద్ద బ్యాటరీట్యాప్స్‌ కింద స్నానాలు చేసి తలనీలాలు ఇచ్చారు. తల్లుల గద్దెల వద్దకు చేరుకుని ఎత్తుబెల్లం, పసుపు, కుంకుమ, సారె, పూలు, పండ్లు, ఒడిబియ్యం సమర్పించారు. గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించారు. తల్లులకు యాటపోతులను బలిచ్చి గద్దెల పరిసరాలతో పాటు సమీప అటవీ ప్రాంతాల్లో విడిది చేశారు. వంటలు వండుకొని బంధూమిత్రులు, కుటుంబ సమేతంగా భోజనాలు చేసి సాయంత్రం వేళ స్వగ్రామాలకు పయనమయ్యారు. జాతర పరిసరాల్లో వ్యాపారులు పలు రకాల దుకాణాలు ఏర్పాటు చేయగా, అవి భక్తులతో కిటకిటలాడాయి. గద్దెల వద్ద ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించారు. ఉదయం ఆరుగంటల నుంచి ప్రారంభమైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది. భక్తుల వాహనాలతో పార్కింగ్‌ ప్రదేశాలు నిండిపోయాయి. మొదట గద్దెల సమీపంలోకి వాహనాలను అనుమతిచ్చారు. రద్దీ పెరగడంతో రెడ్డిగుడెం క్రాస్‌, స్తూపం వద్ద ఉన్న పార్కింగ్‌ ప్రదేశాల్లోకి వాహనాలను మళ్లించారు.


అమ్మవార్ల సేవలో ప్రముఖులు

ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కను పలువురు ప్రముఖులు గురువారం దర్శించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ కుటుంబ సమేతంగా, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు విమోచన చైర్మన్‌ నాగూర్ల వెంకటేశ్వర్లు, మిర్యాలగుడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు కుటుంబ సమేతంగా, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు, ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, ప్రజాకవి ఏపూరి సోమన్న, ఖమ్మం ఏఎస్పీ మురళీధర్‌ కుటుంబ సమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి మేడారం జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, డైరెక్టర్లు, అమ్మవార్ల పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలివాయిద్యాల మధ్య స్వాగతం పలికారు. కండువాలు కప్పి తల్లుల గద్దెల వద్దకు తీసుకెళ్లారు. వారు గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో అమ్మవార్ల గద్దెలపై పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం, నూతన వస్ర్తాలు, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అతిథులకు పూజారులు అమ్మవారి వస్ర్తాలతో పాటు ప్రసాదాన్ని అందజేశారు.



logo