బుధవారం 01 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 22, 2020 , 03:59:57

‘గ్రేటర్’లో మరో 20 పార్కులు

‘గ్రేటర్’లో మరో 20 పార్కులు


వరంగల్, నమస్తేతెలంగాణ: వరంగల్ నగరం అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచనున్నది. గ్రీనరీతో ఉల్లాసాన్ని నింపనున్నది. ఓపెన్ జిమ్ ఆరోగ్యాన్ని పరిరక్షించనున్నది.  ఈ మేరకు గ్రేటర్ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. పర్యాటక హబ్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్న క్రమంలో నగర ప్రజలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు కొత్తగా మరో 20 పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే సీఎం హామీ నిధులతో గ్రేటర్ పరిధిలో 16 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు అమృత్ నిధులతో 8 ప్రాంతాల్లో  పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నారు.

దీనికి తోడు రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు మరో 20 కొత్త పార్కుల నిర్మాణాలు చేపట్టాలని గ్రేటర్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల క్రితం కలెక్టర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్మార్ట్ నిధులతో గ్రేటర్ కార్పొరేషన్ 2-3 డివిజన్లకు ఒక పార్కు ఉండేలా 20 పార్కులు నిర్మాణం చేయాలని ఆదేశించారు. దీంతో బల్దియా అధికారులు గ్రేటర్ కొత్త పార్కుల నిర్మాణాలకు ప్రణాళికలు చేస్తున్నారు. పార్కుల నిర్మాణాలకు టౌన్ విభాగం స్థలాలను అన్వేషిస్తున్నది. త్వరలోనే స్మార్ నిధులతో గ్రేటర్ 20 పార్కుల నిర్మాణాలకు టెండర్లు పిలిచేందుకు గ్రేటర్ అధికారులు సిద్ధమవుతున్నారు. 

ఓపెన్ జిమ్ 20 పార్కులు

స్మార్ట్ నిధులతో కొత్తగా నిర్మించనున్న 20 పార్కులను ఓపెన్ జిమ్ అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. పిల్లల ఆట వస్తువులతో పాటు జిమ్ పరికరాలు, గ్రీనరీ ఏర్పాటు వాకింగ్ ట్రాక్ లాంటి వసతులతో స్మార్ట్ కొత్త పార్కులను డిజైన్ చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్ల ప్రజలకు ప్రస్తుతం స్మార్ట్ నిధులతో చేపట్టనున్న 20 పార్కులు అందుబాటులో ఉండేలా చూడనున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాల కొరత ఉండటం పార్కులకు పెద్ద విస్తీర్ణం కలిగిన స్థలం కోసం అన్వేషణ చేయకుండా అధికారులు స్మార్ట్ పార్కులకు ప్రణాళికలు చేస్తున్నారు. ఉన్న చిన్న పాటి స్థలంలో అయినా అన్ని వసతులతో పార్కులను డిజైన్ చేయనున్నారు. ఓపెన్ జిమ్ తరహాలో పార్కులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. పార్కుల్లో ముఖ్యంగా గ్రీనరీపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.

16 పార్కుల అభివృద్ధి

ఇప్పటికే  గ్రేటర్ కార్పొరేషన్ సీఎం హామీ నిధులతో 16 పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ. 7.40 కోట్ల  సీఎం హామీ నిధులతో చేపట్టిన 16 పార్కుల అభివృద్ధిలో 6 పార్కులు పూర్తి అయ్యాయి. ఎల్ నగర్, డాక్టర్స్ సంతోష్ రామారావు కాలనీ, టీచర్స్ కనుకదుర్గ కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేశారు. ప్రహరీ, గేట్, పిల్లల ఆట వస్తువులు, గ్రీనరీ పనులు పూర్తి చేశారు. పరిమళకాలనీ, కీర్తినగర్, ఎఫ్ కాలనీల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. కాకతీయ కాలనీ, శ్రీనివాసకాలనీ, ప్రశాంత్ నగర్, శ్రీనగర్ కాలనీ, బాలసముద్రం, క్రిస్టియన్ కాలనీ, టీఆర్ కాలనీల్లో పార్కుల నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. దీనికి తోడు అమృత్ పథకంలో భాగంగా మిలీనియం కాలనీ, ఉర్సు వాటర్ ట్యాంక్ పార్కుల ను అభివృద్ధి చేయనున్నారు. అమృత్ పథకంలో భాగం గా చేపట్టనున్న పార్కుల్లో ముఖ్యంగా వాటర్ ట్యాంక్ పరిసరాల్లోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.logo
>>>>>>