గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 21, 2020 , 02:28:38

ముగిసిన ప్రచార పర్వం

ముగిసిన ప్రచార పర్వం


వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రచారం గడువు  తక్కువ ఉన్నా ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఇల్లిల్లూ జల్లెడ పట్టారు. అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జీలు సంక్రాతి పండుగ నాడు సైతం ప్రచారంలోనే గడిపారు. ప్రచారం ఆఖరిరోజు మున్సిపాలిటీలన్నిట్లో రోడ్‌షోలతో టీఆర్‌ఎస్‌ హల్‌చల్‌ చేసింది. బైక్‌ర్యాలీలు, బహిరంగ సభలతో గులాబీ శ్రేణులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహించాయి. వార్డుల వారీగా ప్రతి ఓటరును ఒకటికి రెండుమూడుసార్లు కలిశారు. దూర తీరాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్‌ ఆహ్వానాలు అందుతున్నాయి. రాజకీయ పార్టీల ప్రచార పర్వాన్ని ముగించడంతో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. గతం లో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరిగే ఎన్నికలకు మధ్య చెప్పుకునేంత తేడా కనిపించింది. ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వారివారి అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈసారి  మాత్రం అందుకు విరుద్ధంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు దాదాపు ప్రచారంలో ఎక్కడా కనిపించకుండాపోయాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ మినహా మిగితా రాజకీయ పార్టీలు ఎక్కడా ప్రచారంలో కనీసం తమ ఉనికిని కూడా ప్రదర్శించలేకపోవడం ప్రచారంలో కొట్టిచ్చినట్టు కనిపించింది. స్వతంత్రంగా బరిలో నిలిచిన అభ్యర్థులతో కూడా పోటీ పడలేని పేలవమైన రీతిలో కాంగ్రెస్‌, బీజేపీలు కనిపించాయి.

మంత్రుల సుడిగాలి పర్యటన

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీల్లో సుడిగాలి పర్యటన చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకర్గంలో ఉన్న ఏకైక మున్సిపాటీ తొర్రూరులోనే ఆయన మకాం వేసి ప్రచారం నిర్వహించకుండా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమేకాకుండా పార్టీ శ్రేణుల్ని సమన్వయ పరుస్తూ, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. తన స్వగ్రామం పర్వతగిరిని కేంద్రంగా చేసుకొని ఆయన పరకాల, నర్సంపేట, డోర్నకల్‌, మరిపెడ, మహబూబాబాద్‌, జనగామ, వర్ధన్నపేట, భూపాలపల్లి మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. ఇక రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ మహబూబాబాద్‌ కేంద్రంగా ఉంటూ అటు ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలను కవర్‌ చేస్తూ మహబూబాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, మరిపెడ మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు.

ప్రతిష్టాత్మకంగా భావించిన ఎమ్మెల్యేలు

మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు వారివారి నియోజకర్గ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లోని ఇల్లిల్లూ జల్లెడ పట్టారు. మనిషిమనిషినీ కలిసి మరీ తామే ఎన్నికల బరిలో ఉన్నామన్న రీతిలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో, జిల్లాలో, మున్సిపాలిటీల్లో నెలకొన్న సానుకూల వాతావరణం, టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉన్న బలం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలోని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు విస్తృతంగా పర్యటించారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన ఆరోగ్యం సహకరించకపోయినా సరే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కసరత్తు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఇలా ఎవరికి వారు తమతమ అనుచర, సహచర, సన్నిహితగణంతో విస్తృతంగా ప్రచారం లో పాల్గొన్నారు.

ప్రస్తుతం నెలకొన్న సానుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానికంగా అభ్యర్థులకు పార్టీ పట్ల, ప్రజల పట్ల ఉన్న అభిమానాన్ని, అంగీకారాన్ని వివరిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం స్థానికంగా ఉంటూ పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్నిస్తూ, ఎప్పటికప్పుడూ అనుసరించాల్సిన వ్యూ హాన్ని రచిస్తూ మార్గనిర్దేశనం చేశారు. చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా అభ్యర్థుల గెలుపే తమ గెలుపుగా స్వీకరించి అహర్నిశలు కృషి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు ఎక్కడికక్కడ తామే పోటీచేస్తున్నామని బాధ్యతతో పనిచేశారని స్వయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేర్కొన్నట్టుగానే క్షేత్రస్థాయిలో ప్రచార వాతావరణం స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన చీఫ్‌విప్‌లు బోడకుండి వెంకటేశ్వర్లు, దాస్యం వినయ్‌భాస్కర్‌,  ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, నన్నపునేని నరేందర్‌, మేయర్‌ ప్రకాశ్‌రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి. వాసుదేవరెడ్డి, కృష్ణారెడ్డి, జన్ను జకార్య, మెట్టు శ్రీనివాస్‌, నాగుర్ల వెంకటేశ్లర్లు , పార్టీ అన్ని విభాగాల నాయకులు, కుల సంఘాలు, పార్టీ యూత్‌, విద్యార్థి, రైతు సమన్వయ సమితీలు ఇలా అన్ని స్థాయిల్లో నేతలందరూ సమష్టి వ్యూహంతో ప్రచారం నిర్వహించారు. 

మహమూద్‌ అలీ...పోచంపల్లి సైతం

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మినహా ఈసారి ఇతర జిల్లాల నుంచి ఎవరూ పెద్దగా ప్రచారం నిర్వహించేందుకు రాలేదు. ఇక వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక్క పరకాల మున్సిపాలిటీ మినహా మిలిగిన ఎనిమిది మున్సిపాలిటీల్లో ఇంటింటి ప్రచారం, రోడ్‌షోల్లో ప్రచారం నిర్వహించడం విశేషం.

ఆఖరిరోజు రోడ్‌షోలతో...

మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం ఆఖరిరోజు టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఆధిపత్యాన్ని, ఆ పార్టీకి జనం నుంచి వస్తున్న మద్దుతును రోడ్‌షోలు, బైక్‌ ర్యాలీలు, బహిరంగ సభలతో  హల్‌చల్‌ చేసింది. ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు,  సత్యవతీ రాథోడ్‌ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విస్తృతంగా పర్యటించారు. మొత్తానికి మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ తన సత్తా చాటింది.logo
>>>>>>