సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 14, 2020 , 03:26:51

‘పల్లె ప్రగతి’కి విశేష స్పందన

‘పల్లె ప్రగతి’కి విశేష స్పందన

రెండో విడతలో గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ఇంకుడుగుంతలు, వైకుంఠధామాల నిర్మాణం మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ జిల్లాలో 130 జీపీలకు ట్రాక్టర్లు అభివృద్ధి పనుల్లో  భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు

రెడ్డికాలనీ, జనవరి13: పల్లె ప్రగతి రెండో విడుతలో ప్రభుత్వం ఆశించిన స్థాయిని మించి గ్రామస్తుల నుంచి స్పందన లభించింది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన రెండో విడుత 12న ముగిసింది. 11 రోజుల్లో ప్రజలు తమ గ్రామాభివృద్ధి కోసం కలిసకట్టుగా పని చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా అధికారుల సహకారంతో గ్రామాల సమగ్ర సమూల మార్పునకు శ్రమించారు. ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను అందజేసి ఇంటింటి చెత్త సేకరణ చేపట్టారు. అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటుగా సామూహిక వన క్షేత్రాలకు నీటిని పోశారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో మరొక మొక్కను నాటి  ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. పంచాయతీ లక్ష్యం మేరకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా నర్సరీలో మొక్కల తయారీకి బ్యాగ్‌ ఫిల్లింగ్‌ చేపట్టారు.

కలెక్టర్‌ పరిశీలన..సూచనలు

కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రెండో విడుతలో ప్రతి రోజూ మూడునాలుగు గ్రామాల్లో పర్యటించారు. చేయాల్సిన పనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలను పరిశీలించి గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు  దిశానిర్దేశం చేశారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు కావాలంటే.. రెండో విడుతలో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా  భీమదేవరపల్లి మండలంలోని మల్లారం, వీర్లగడ్డతండా ధర్మారం గ్రామాల ప్రజలు తమ ఊళ్లకు ఇప్పటి వరకూ ఏ కలెక్టర్‌ రాలేదని, మీరు వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ పీజే పాటిల్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌  ప్రజలు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించారు.వీర్లగడ్డతండాలో వైకుంఠధామానికి ప్రహరీ, నర్సరీకి చేతిపంపును అక్కడికక్కడే మంజూరు చేశారు. ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు లేక మూతపడిన విషయంపై స్పందిస్తూ వచ్చేవిద్యాసంవత్సరం నుంచి టీచర్‌ను నియమిస్తామని కనీసం 30 మంది విద్యార్థులను బడిలో చేర్పించాలని గ్రామస్తులకు సూచించారు.


అభివృద్ధిలో రాజకీయం జోక్యం వద్దని.. 

హసన్‌పర్తి మండలం సూదన్‌పల్లి, మల్లారెడ్డిపల్లెలో ఇరుపక్షాల రాజకీయాల వల్ల పనులు నిలిచిపోయినట్లు తెలుసుకున్న కలెక్టర్‌ వెంటనే వారితో మాట్లాడి పనుల ప్రారంభమయ్యేలా చూడాలని ఎస్సైని ఆదేశించారు.  అభివృద్ధిలో రాజకీయం జోక్యం వద్దని, అలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.  


సమగ్రాభివృద్ధికి దోహదం

 పల్లె ప్రగతి రెండో విడుత ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించడంతో పాటుగా పచ్చదనం పరిశుభ్రతపై పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండో విడుతలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేశారన్నారు. పల్లెప్రగతి రెండో విడుతలో రూ.19.87 కోట్లు వివిధ గ్రాంట్ల నుంచి గ్రామ పంచాయతీలకు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 14వ ఆర్థిక సంఘం రూ.11, 7,23,850, అదేవిధంగా ఎస్‌ఎఫ్‌సీ ద్వారా రూ.8, 80, 70,100 నిధులను గ్రామ పంచాయతీలకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామపంచాయతీ బడ్జెట్‌లో 10 శాతం హరిత ప్రణాళికకు కేటాయించాలని ఆదేశించిన ట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రూ.54, 25, 000ను దాతలు విరాళాలు అందజేశారు. జిల్లాలోని 130 గ్రామ పంచాయతీల్లో 313.74 కిలోమీటర్ల మురికికాల్వల్లో పూడిక తీసి శుభ్రపరిచామన్నారు. అదేవిధంగా 517.32 కిలోమీటర్ల రోడ్డును శుభ్రపరిచినట్లు, 170 శిథిలమైన ఇళ్లను తొలగించి వ్యర్థాలను తీసేసినట్లు తెలిపారు. 291 ఖాళీ ప్రదేశాల స్థలాలను శుభ్రపరిచినట్లు, 33 నిరుపయోగ బోరుబావులను మూసివేసినట్లు 68 6 రోడ్డుపైగల గుంతలను పూడ్చివేసినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. 188 ప్రభుత్వ సంస్థల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టడం జరిగిందని, 89 సంత లు మార్కెట్‌ ప్రదేశాలను శుభ్రం చేసినట్లు, 106 గ్రా మాల్లో కంపోస్టు యార్డులను ఏర్పాటు చేశామన్నారు. 121 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు, 46 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో 2, 58,197 హరితహారం కింద మొక్కలు నాటినట్లు ఎండిపోయిన మొక్కల బదులు వేరే మొక్కను నాటి వాటికి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. రెండోవిడుత  ప్రభుత్వం ఆశించిన దానికంటే ఎక్కువ సక్సెస్‌ అయిందన్నారు.


logo