గురువారం 02 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 19, 2020 , 02:10:44

‘నవ’ రత్న పీఠం టీఆర్‌ఎస్‌ వ్యూహం

‘నవ’ రత్న పీఠం టీఆర్‌ఎస్‌ వ్యూహం
  • - ప్రచారంలో పత్తాలేని ప్రత్యర్థులు
  • - గులాబీ దూకుడుకు విపక్షాల కుదేలు
  • - కనుమరుగైన కాంగ్రెస్‌.. కనిపించని కమలధారులు
  • - ఇల్లిల్లూ కలియదిరుగుతున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
  • -పట్టణాభివృద్ధే టీఆర్‌ఎస్‌కు ప్రాణప్రదం

మున్సిపల్‌ ఎన్నికల పోరులో గులాబీ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. టీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తుండడంతో పార్టీ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఆరేళ్ల పాలనలో ప్రగతే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను పట్టణాల్లో ప్రచారం చేస్తుండడంతో నీరాజనం పలుకుతున్నారు. దీంతో అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఏవైనా, ఎప్పుడైనా టీఆర్‌ఎస్‌దే విజయమని గత ఫలితాలు వెల్లడిస్తున్న తరుణంలో పురపాలక ఫలితాల్లో వార్‌ వన్‌సైడే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కున్న ప్రజాదరణ ముందు విపక్షాల పరిస్థితి దయనీయంగానే ఉండబోతోందని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తోపాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
- వరంగల్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి - నమస్తే తెలంగాణ: పట్టణాల్లో ఎన్నికల హోరు సందడి చేస్తున్నది. టీఆర్‌ఎస్‌ ప్రచార హోరుతో మిగితా పార్టీలు కుదేలవుతున్నాయి. చేసిన ప్రగతిని చెప్పుకుంటూ చేయాల్సిన పనులపై నమ్మకమైన వాగ్దానం చేస్తూ దూసుకెళుతున్న గులాబీ శ్రేణులు. ఇల్లిల్లూ జల్లెడ పడుతున్నాయి. ఎన్నికలకు ఎన్నికలకు మధ్య కనుమరుగుతున్న పార్టీల తీరు. పేరుకే జాతీయ పార్టీలు, గల్లీల్లో కనిపించని వైనం. అతిశయోక్తి కాదు. క్షేత్రస్థాయి యథార్థ చిత్రం. ఎన్నికలుంటాయనగానే విపక్షాలు అధికార పార్టీని ఇరకాటంలో పెడతామని దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేయడం ఆనవాయితీ. కానీ రాష్ట్ర సాధన అనంతరం, టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలను, అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూస్తూ ప్రజాక్షేమమే పరమావధిగా, ప్రగతే లక్ష్యంగా గులాబీ పార్టీ ముందుకు సాగుతున్నదనేది ప్రతీ ఎన్నికల్లో రూఢీ అవుతూ వస్తుంది. రేపు జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే ప్రతిఫలిస్తుందని టీఆర్‌ఎస్‌ బాజాప్తా ‘ఈ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గల్లంతే’ అని స్పష్టం చేస్తున్నది.

అదే విపక్ష పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతుందనగానే ప్రజాక్షేత్రాన్ని మరచి ఈ ఎన్నికల్ని ఆపండీ అంటూ రకరకాల పేర్లతో కోర్టులను ఆశ్రయిస్తూ, తీరా కోర్టులు ఎన్నికల ఆ వాదనని తిరస్కరించడమూ పరిపాటిగా మారుతూ వస్తున్నది. దీంతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల విసుగుచెందుతోన్న వాతావరణం దాదాపు ప్రతీ ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టం అవుతూనే ఉన్నది. ఇక బీజేపీ పట్టణాల్లో తమదే ఆధిపత్యం అని గంభీర ప్రకటనలు చేసిన దానికి బరిలో నిలిచిన స్థానాలకు, ఆ స్థానాల్లో వారి ప్రచార సరళిని బట్టి, ఫలితాల తీరు విస్మయం గొలిపేదిగానే ఉంటున్నాయని ఇప్పటి దాకా తేలుతున్న అంశం. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలంతోపాటు, ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యూహాత్మక  ఎత్తుగడల్ని బరిలో నిలిచిన మిగిలిన పార్టీలు జీర్ణించుకోలేని విధంగా ఉంటున్నాయని క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారం, జనం నుంచి వస్తున్న ఆదరణను, పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల ఆకర్షణ స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలేవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అన్న నానుడి మరోసారి తేటతెల్లమై, వార్‌ వన్‌సైడ్‌గానే పరణమించింది. దీంతో వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగే తొమ్మిది మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాల ఫలితమే పునరావృతం కాబోతుందన్నది ఆ పార్టీ నేతల ధీమా. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరడం ఖాయంగా మారిందా? అంటే టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు అవుననే ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

చేతులెత్తేసిన కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో దాదాపుగా చేతులెత్తేసిందా అంటే ఈ మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సరళిని బట్టి చూస్తే అవుననే స్పష్టమైన వాతావరణం కనిపిస్తోంది. బలహీనమైన పార్టీ విధానం. చేష్టలుడిగి, చతికిలబడిన శ్రేణులు. అసలు పోటీచేయడానికే ముందుకు రాని వాతావరణం ఉంటే ఉనికి కోసమన్నా ఉండండీ అంటూ పిలిచి పిలిచి బీ-ఫారాలిచ్చిన దుస్థితి ఆ పార్టీలో నెలకొన్నది. మునుపెన్నడూ లేని దయనీయస్థితి, జెండా పట్టుకొని తిరిగే వారే కరువైన వాతావరణం. అక్కడక్కడా అభ్యర్థులుగా నిలిచివారు సైతం టీఆర్‌ఎస్‌ దూకుడు ప్రచారం, జనం నుంచి ఆ పార్టీకి వస్తున్న స్పందన బట్టి తిరగడం ఎందుకు దండగ అన్న నైరాశ్యంలో ఆ పార్టీ అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏం తిరగాలి. ఎందుకు తిరగాలి. తిరిగినా జనం మమ్ముల్ని నమ్మడం లేదు అని స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులే పేర్కొంటున్నారు. మరోవైపు జనం సైతం గెలిచే వాళ్లకు మద్దతిస్తే బావుటుంది. ఒకవేళ కాంగ్రెసోళ్లు పొరపాటునో, గ్రహపాటునో గెలిస్తే వాళ్లూ టీఆర్‌ఎస్‌లోకే వెళ్లేటట్టున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఇగ వాళ్లకే వేస్తే మంచిది. మేమెందుకు కంటు కావాలన్న ధోరణి జనంలో వ్యక్తం అవుతున్న వాతావరణం. ఇలాంటి పరిస్థితి గతంలో ఏ ఎన్నికల సందర్భంగా లేని వాతావరణం. కుమ్మలాటలు, గ్రూపు విబేదాలకు ఆలవాలమైన కాంగ్రెస్‌ పార్టీ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీల్లో తమ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల నాయకత్వమే చేతులేత్తెస్తోంది. జనగామ వంటి మున్సిపాలిటీల్లో తెలంగాణ తొలి పీసీసీ చీఫ్‌గా చేసిన పొన్నాల లక్ష్మయ్య వర్గానికి ఒక్కటంటే ఒక్క బీ-ఫారం కూడా రాకపోవడం, అక్కడ మూడు ముక్కలుగా పార్టీ చీలిపోవడం వంటి పరిణామాలు ఆ పార్టీ శ్రేణుల్ని నివ్వెరపరిచింది. మహబూబాబాద్‌, నర్సంపేట, భూపాలపల్లి, వర్దన్నపేట, మరిపెడ, డోర్నకల్‌, పరకాల, తొర్రూరు మున్సిపాలిటీల్లో కనీసం ఇన్‌చార్జీలు ఎవరో, అభ్యర్థులు ఎవరో కూడా తెలియని దయనీయ స్థితి నెలకొన్నది. ఇక బీజేపీ పరిస్థితి మరింత ఆధ్వానంగా తయారైందని స్వయంగా ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో స్వయంగా పార్టీ జిల్లా సారధ్యంపైనే బహిరంగ విమర్శలు, ఉత్తర ప్రత్యుత్తర, నిజనిర్దారణ కమిటీల పేర ఆరేడు నెలలుగా జరుగుతున్న పరిణామాలతో అక్కడో ఇక్కడో కనీసం జెండా పుట్టుకొన్న వారు సైతం కలావిహీనమైన వాతావరణం.

పట్టణ ప్రగతికి గులాబీ బాసట

తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పల్లె, పట్నం ప్రగతి దారుల్లో పయనిస్తుంది. పరిపాలనా వికేంద్రీకరణ. వికేంద్రీకరణతోనే ప్రగతి అని నినదిస్తూ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. కేవలం ప్రచారం చేయడం కాదు. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించడం, కేవలం ఉన్నతీకరించడం వరకే పరిమితం కాకుండా పట్టణ ప్రగతిని ప్రజల కళ్లముందు చేసి చూపెట్టిన పార్టీగా టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు అనడానికి ఆయా మున్సిపాలిటీల్లో మెరుగైన కనీస సౌకర్యాల కల్పన, రహదారి విస్తరణ, డివైడర్లు, ఆస్పత్రుల ఉన్నతీకరణ, కోట్లాది రూపాయల నిధుల ప్రవాహం, మెరుగైన శానిటేషన్‌, పట్టణ యువతకు కల్పించిన ఉపాధి శిక్షణా, ప్రతీ మున్సిపాలిటీకి సరఫరా అవుతున్న తాగునీరు ఇలా ఒకటా రెండా అనేక అంశాల్లో అద్వితీయమైన ప్రగతిని సాధించాం. ఇక సాధించేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలోని ప్రభుత్వం, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ అందిస్తున్న సారథ్యం రెండూ తమ వద్ద ఉన్న వజ్రాయుధాలనీ టీఆర్‌ఎస్‌ ప్రచారకర్తలు జనంలోకి విస్తృతంగా తీసుకెళుతున్నారు.

మంత్రుల సుడిగాలి పర్యటనలు

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతీరాథోడ్‌, శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌లు దాస్యం వినయభాస్కర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి గ్యాదరి బాలమల్లు, మున్సిపల్‌ ఎన్నికలున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్‌, డీఎస్‌ రెడ్యానాయక్‌, బానోత్‌ శంకర్‌నాయక్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇల్లిల్లూ జల్లెడపడుతున్నారు. వీరికి తోడు ఆయా మున్సిపాలిటీలకు ప్రచార బాధ్యతలు స్వీకరింంచి తమ ఎన్నికల ప్రచారాన్ని తలపించేవిధంగా ఎమ్మెల్యేలు వారి వారి శ్రేణులతో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. మరోవైపు వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, ఎంపీలు ఇలా అందరికీ అందరూ, పార్టీ వివిధ విభాగాల బాధ్యులు, రాష్ట్ర, జిల్లా కమిటీల బాధ్యులు విస్తృతంగా జనలోకి వెళుతూ ఇప్పటి దాకా చేపట్టిన అభివృద్ధిని వివరించడమే కాకుండా అన్ని ప్రాంతాలను సమదృష్టితో ఆదరించే ప్రభుత్వం, పార్టీగా టీఆర్‌ఎస్‌ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీకి సాకుకూల వాతావరణం నెలకొన్న నేపథ్యమే కాకుండా జనం నుంచి వస్తున్న విశేష స్పందనతో తమ గెలుపును నిలువరించగలిగే శక్తి ఏ పార్టీకి లేదని టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిబ్బరంగా, గుండెనిండిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి.logo
>>>>>>