సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Jan 19, 2020 , 02:07:44

ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు

ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు
  • -పీఆర్‌సీ అమలుకు సర్కారు సానుకూలం
  • -సీపీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుదాం
  • -టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి


సుబేదారి,జనవరి18: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే తీపి కబురు అందనున్నదని తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. టీఎన్‌జీవోస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా డైరీ ఆవిష్కరణ, స్టాడింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్‌ కోలా రాజేశ్‌గౌడ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సుబేదారి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కారం రవీందర్‌డ్డి హాజరై డైరీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు పీఆర్‌సీ, పదోన్నతులు, నియామకాల విషయాల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ప్రదమైన జీతభత్యాలు అందించడమే కాకుండా పదోన్నతలను సాధించుకున్నామని చెప్పారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీపై  సీఎం కేసీఆర్‌ను కలువగా వెంటనే కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ విషయమై ఇటీవల టీఎన్‌జీవోస్‌ ,ఉద్యోగ జేఏసీ నుంచి సీఎంను కలిసి చర్చిచినట్లు పేర్కొన్నారు.  మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక చేరనున్నదని, మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం కొత్త పీఆర్‌సీ ప్రకటించే అవకాశం ఉందన్నారు. మిగతా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు.  నూతన సంవత్సరంలో ఉద్యోగులకు మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నడ్డి విరుస్తున్న కేంద్రం..

 కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను కాంట్రీబ్యుషన్‌ పెన్షన్‌ చట్టంతో నడ్డివిరుస్తున్నదని, దీనిపై పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.  సీపీఎఫ్‌ రద్దుచేయడం, పాత పెన్షన్‌ అమలు కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు ఉద్యోగులు సన్నద్ధం కవాలని పిలుపునిచ్చారు. జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఉద్యోగులు పాత్ర ముఖ్యమైనదన్నారు. ప్రముఖ కవి గోరేటి వెంకన్న పాటలతో ఆకట్టుకున్నారు. తెలంగాణ ఉద్యోమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది, స్వరాష్ట్రంలో ఉద్యోగులకు గౌరవం దక్కిందన్నారు. డీసీపీ నాగరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుశాఖలో పదోన్నతలు చాలా తక్కువగా ఉండేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత డీసీపీ అయ్యే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకుడు పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ,ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటూ రాష్ట్రంలో గణనీయమైన మార్పులు తెచ్చిందన్నారు. సమావేశంలో టీఎన్‌జీవో రాష్ట్ర నాయకుడు రాజేందర్‌, టీజీవో నాయకుడు జగన్‌మోహన్‌రావు, టీఎన్‌జీవోస్‌ నాయకులు వెంకటేశ్వర్లు, రత్నావీరాచారి, రాజ్‌కుమార్‌,వేణు, ఆరు జిల్లాల టీఎన్‌జీవోస్‌ కమిటీ బాధ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.logo